సైనసైటిస్‌తో బాధపడుతున్నారా? లక్షణాలు ఎలా ఉంటాయి? | Sinus Infection (Sinusitis): What Are The Symtoms And Tretment | Sakshi
Sakshi News home page

Sinus Infection: సైనసైటిస్‌ ఎందుకు వస్తుంది? మందులు వాడకుండా ఈ టిప్స్‌ ఫాలో అయితే చాలు

Published Mon, Sep 4 2023 11:35 AM | Last Updated on Mon, Sep 4 2023 12:29 PM

Sinus Infection (Sinusitis): What Are The Symtoms And Tretment - Sakshi

సైనసైటిస్ వ్యాధి దీర్ఘకాలం బాధిస్తుంది. ముక్కు లోపలి భాగాల్లో ఉండే గాలి గదులను సైనస్ అని అంటారు. ఈ సైనస్‌లు ఇన్ఫెక్షన్‌కు  గురికావడం వల్ల సైనసైటిస్ వస్తుంది. ముక్కుకు ఇరువైపులా నుదురు, కళ్ల చుట్టూ నొప్పులు ఉంటాయి. జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలతో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది.

సైనస్‌ను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండదు. అలాంటి వారు సహజసిద్ధ పద్ధతులతో సైనస్‌ను ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నవీన్‌ నడిమింటి మాటల్లో తెలుసుకుందాం.


అక్యూట్ సైనసైటిస్‌లో ముక్కు కారడం, ముఖంలో ఒత్తిడి, నొప్పి, వాసన గ్రహించే శక్తి తగ్గడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది నాలుగు వారాల్లోగా తగ్గుతుంది. సాధారణ జలుబు వల్ల ఈ సమస్య వస్తుంది. పదే పదే సైనసైటిస్ రావడం వల్ల అది క్రానిక్ గా మారుతుంది. ఇది 12 వారాల వరకు ఉంటుంది. సాధారణంగా దీనికి బ్యాక్టీరియా కారణం అవుతుంది. ముక్కు కారుతూ, ముఖ భాగాల్లో నొప్పి ఉండి, పది రోజుల వరకు లక్షణాలు తగ్గకపోతే అది బ్యాక్టీరియా వల్ల వచ్చిన సైనసైటిస్ కావొచ్చు. 

"సైనసైటిస్ అనేది చాలా రకాల కారణాల నుంచి వస్తుంది. కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల సైనసైటిస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు అలర్జీ వల్ల కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది. ముక్కులో ఎముక వంకరగా ఉన్నా, పిల్లల్లో ఎడినాయిడ్ సమస్య ఉన్నా సైనసైటిస్ రావొచ్చు. డయాబెటిస్​తో బాధపడేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. షుగర్ వ్యాధితో బాధడేవారికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా వస్తాయి" అని ప్రముఖ ఈఎన్​టీ వైద్యులు, డాక్టర్ సి.ఆంజనేయులు చెప్పుకొచ్చారు.

సైనస్ లక్షణాలు ఇలా ఉంటాయి..

సైనస్ లక్షణాలు ఎలా ఉన్నాయి? అవి ఎంత కాలం నుంచి ఉన్నాయి? అనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. జలుబు, అలర్జీలను తగ్గించే ముందులు, ముక్కు దిబ్బడను తగ్గించే డీ-కంజెస్టెంట్స్​ను వాడటం ద్వారా ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడంతో సైనస్ బాధలు తగ్గుతాయి. సైనస్‌తో బాధపడేవారు దాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. సైనస్ లక్షణాలను త్వరగా గుర్తించి, చికిత్స చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కులో ఏదైనా అనాటామికల్ సమస్య ఉందేమో తెలుసుకోవాలి. సీటీ స్కాన్ ద్వారా సైనస్ ఇన్ ఫ్లమేషన్​ను తెలుసుకొని చికిత్స చేయించుకోవాలి. సైనస్​తో బాధపడేవారు వ్యాయామం లాంటివి చేస్తూ దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇలాంటి వాళ్లకు ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చిక్కగా ఉండే శ్లేష్మం పలుచగా మారుతుంది. వేడినీళ్లతో స్నానం చేయాలి.


1.స్నానం చేసే నీళ్లలో యూకలిప్టస్ నూనెను కలపడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.
2.చక్కటి ప్రశాంతమైన నిద్ర అవసరం.. విశ్రాంతి తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే తెల్ల రక్తకణాలను మన శరీరం మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయగలుగుతుంది.
3. తల కింద దిండ్లను పెట్టుకొని తల,ఛాతీ భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల సైనస్​లో ద్రవాలు పేరుకుపోకుండా ఉంటాయి.
4. నీళ్లు, ఇతర ద్రవాలను ఎక్కువగా తాగాలి.
5. శారీరక వ్యాయామాల వల్ల రక్తప్రసరణ మెరుగై ముక్కు దిబ్బడ తగ్గుతుంది. 
6. సైనసైటిస్ అంటువ్యాధి కానప్పటికీ.. దానికి కారణమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.


7. నీలగిరి తైలం,జీవన ధార తైలం తో Inhalation చేస్తే త్వరగా తగ్గుతుంది.
8. పసుపుకొమ్మును నిప్పుల్లో కాల్చి పీలిస్తే కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
9. దాల్చిన చెక్క పొడి: 5 gr,మిరియాల పొడి : 5 gr,యాలకుల గింజల పొడి:5 gr,జీలకర్ర  పొడి :5 gr.. ఇలా పొడులను కలిపి మూడు వేళ్ళతో పట్టుకొని నశ్యం లాగా పీలిస్తే ముక్కు దిబ్బడ వెంటనే  తగ్గుతుంది.
10. జాజి కాయను మెత్తగా పొడి చేసి గంధం లాగా  చేసి పాలలో కలుపుకొని తాగాలి.
11. పసుపు పొడి: అర టీ స్పూను,వెల్లుల్లి ముద్ద  :పావు టీ స్పూను.. రెండింటిని కలిపి తీసుకుంటే జలుబు ద్వారా వచ్చే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది.


12. శొంటి, పిప్పళ్ళు, మిరియాలు.. మూడింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి చూర్ణాలు చేసుకోవాలి.ఈ పొడిని పావు టీ స్పూను లేదా అర టీ స్పూను వరకు తీసుకుంటే ఫ్లూ వల్ల వచ్చే జలుబు తగ్గుతుంది. 
13. మిరియాల పొడి,యాలకుల పొడి,నల్ల జిలకర పొడి.. అన్ని పొడులను కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని పీలిస్తే ముక్కు దిబ్బడ, జలుబు కూడా తగ్గుతాయి
14. కొబ్బరి నూనెను వేడి  చేసి దానిలో కర్పూరం వేసి కరిగించి ముక్కు మీద ,గొంతు మీద   చాతీ మీద , మెడ మీద , పక్కటెముకల మీద పూసి  బాగా మర్దన చేయాలి . ఈ విధంగా చేయడం వలన  జలుబు అప్పటికప్పుడు  తగ్గిపోతుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement