పిజెటిఎస్‌ఎయులో అగ్రిహబ్ ఆధ్వర్యంలో సౌర ఫలకాల కింద కూరగాయ పంటల ప్రయోగాత్మక సాగు
'వ్యవసాయం రైతులకు గిట్టుబాటు కావాలంటే పనిసౌలభ్యంతో పాటు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే యాంత్రీకరణ అత్యవసరం. ఆవిష్కరణలను సాంకేతికంగా, ఆర్థికంగా ప్రోత్సహించినప్పుడే వినూత్న యంత్రాలు రైతులకు అందుబాటులోకి వస్తాయి. అందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలు దోహదం చేస్తాయి. అటువంటి కేంద్రాల్లో విలక్షణమైనది హైదరాబాద్ పిజెటిఎస్‌ఎయు ఆవరణలో కొలువుదీరిన అగ్రిహబ్ ఫౌండేషన్. టెక్నీషియన్ల నుంచి గ్రామీణుల వరకు ఎవరైనా అగ్రిహబ్ సేవలను అందుకోవచ్చు.'
అగ్రిహబ్.. వ్యవసాయం, ఆహార సంబంధమైన అనుబంధ రంగాల్లో ఇటు సాంకేతిక నిపుణుల ఆవిష్కరణలకు, అటు గ్రామీణ ఆవిష్కర్తలకు మార్గదర్శిగా నిలుస్తున్న సంస్థ. రెండు అంచెల వ్యవస్థగా పనిచేస్తున్న తొలి అగ్రి ఇంక్యుబేటర్ కావటం దీని ప్రత్యేకత. అంతేకాదు, అగ్రిటెక్ స్టార్టప్‌ల ఆవిష్కరణలను క్షేత్రస్థాయిలో పరీక్షించి, వాటి యోగ్యతను నిర్థారించే విలక్షణ వేదిక అగ్రిహబ్. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవటంలోనూ ఆవిష్కర్తలకు చేదోడుగా నిలుస్తోంది. అర్హులైన ఆవిష్కర్తలకు నాబార్డు గ్రాంట్‌కు సిఫారసు చేస్తోంది. కొన్ని స్టార్టప్‌ల ఆవిష్కరణల్లో ఈక్విటీ ఫండింగ్ సమకూర్చుతోంది.
ఆలోచనతో వస్తే చాలు..
సాంకేతిక నిపుణులు, పరిశో«దకులు, విద్యార్థులు వ్యవసాయం, ఆహారోత్పత్తులకు సంబంధించి వినూత్న ఆలోచనతో వస్తే.. ఆ ఆలోచనను ఆచరణాత్మక ఆవిష్కరణగా తీర్చిదిద్దటానికి ఇంక్యుబేషన్ సేవలందిస్తున్నామని అగ్రిహబ్ ఫౌండేషన్ సీఈవో, డైరెక్టర్ విజయ్ నడిమింటి ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆవిష్కరణలపై మేధోహక్కులకు పేటెంట్ హక్కులు పొందటానికి కూడా అగ్రిహబ్ తోడ్పడుతుంది. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ సేవలు అందుకోవచ్చు. ఇప్పటి వరకు 350కి పైగా స్టార్టప్‌లకు అగ్రిహబ్ సేవలందించింది. 825 డిజైన్ థింకర్స్‌కు తోడ్పాటునందించింది. 25 స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం నెరపింది. 8 స్టార్టప్‌లు రూపొందించిన డ్రోన్లు, రోబోలు వంటి సాంకేతికతలను క్షేత్రస్థాయిలో వాలిడేట్ చేసింది. గ్రాంట్లు పొందటానికి నలుగురు ఆవిష్కర్తలకు తోడ్పడింది. 8 స్టార్టప్‌లకు ఈక్విటీ ఫండింగ్ అందించింది అగ్రిహబ్. cco@ag-hub.co 040 23014515
-అగ్రిహబ్ సీఈవో విజయ్
ప్రయోగాత్మకంగా సోలార్ సేద్యం!
రైతుల వ్యవసాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపకరించే అగ్రిటెక్ స్టార్టప్‌ల సాంకేతికతలను పొలాల్లో వినియోగించి, వాటి ప్రయోజకత్వాన్ని ధృవీకరించటం అగ్రిహబ్ ప్రత్యేకత. ఇప్పటికి 8 సాంకేతికతలను వాలిడేట్ చేశారు. ఈ క్రమంలో.. అగ్రి ఫొటో ఓల్టాయిక్ (ఎపివి) సిస్టం వాలిడేషన్ ప్రక్రియ అగ్రిహబ్‌లో గత రబీ కాలం నుంచి కొనసాగుతోంది. పొలాల్లో పంటల సాగుతో పాటే ఏకకాలంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ పద్ధతిని అగ్రివోల్టాయిక్స్ లేదా సోలార్ సేద్యంగా చెప్పుకోవచ్చు. సౌర కాంతిని పంటల సాగుతో పాటు విద్యుత్తు ఉత్పత్తికి కూడా వాడుకోవటం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంది. అయితే, సాధారణ సోలార్ ఫలకాల నీడ కింద పంటలు పెరగవు.
అందుకే వాటిని బంజరు భూముల్లోనో, కాలువల మీదనో పెడుతున్నారు. పంట పొలాల్లో కూడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలంటే సౌర ఫలకాలు ఎండను కిందికి ప్రసరింపజేసేలా పారదర్శకమైనవై ఉండాలి. ఇటువంటి వినూత్న ఫలకాలనే రూపొందించింది బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ రెన్‌బ్యూక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫలకాలను వినియోగించి అగ్రిహబ్ ద్వారా పిజెటిఎస్‌ఎయులోని వాటర్ టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్ డా. అవిల్ కుమార్ పర్యవేక్షణలో గత ఏడాది (2022–23) రబీ కాలం నుంచి పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.
క్యాబేజి, బ్రోకలి, కాళిఫ్లవర్, క్యారట్, చెట్టుచిక్కుడు, వేరుశనగ, మిరప వంటి సుమారు 15 రకాల పంటలను 65 వాట్ల సామర్థ్యం గల 40 సోలార్ ప్యానళ్ల కింద 300 చ.మీ. విస్తీర్ణంలో గత నవంబర్ నుంచి పలు పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికి రబీ, ఖరీఫ్ పంటలు సాగు చేశారు. మళ్లీ రబీ పంటలు ఇటీవలే వేశారు. ‘రెన్‌బ్యూక్ సోలార్‌ప్యానల్స్ నుంచి ప్రసరించే సూర్యరశ్మిలో 70% వరకు నేల మీద పంటలపై పడుతోంది. సాధారణ సోలార్ ప్యానళ్ల కన్నా ఈ ప్యానళ్ల ద్వారా 10–12% అదనంగా విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ ప్యానళ్ల కింత సాగైన క్యారట్ పంట దిగుబడి ఏమీ తగ్గలేదు. వేరుశనగ వంటి పంటల్లో కొంచెం తగ్గింది. నీటి వినియోగంలో మార్పు లేదు. అయితే, మరికొన్ని పంటకాలాలు పండించిన తర్వాత ఏయే పంటలకు ఈ సోలార్ సేద్యం అనుకూలమో తెలుస్తుంది’ అన్నారు డా. అవిల్ కుమార్(99513 35111).
గ్రామీణులకు ప్రత్యేకం..
గ్రామీణ ఆవిష్కర్తలకు ఇంక్యుబేషన్ సేవలందించటం కోసం జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో అగ్రిహబ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామీణ యువత, రైతులు, ఎఫ్‌పిఓలు, కోఆపరేటివ్‌ల నిర్వాహకులు తమ కలలను అగ్రిహబ్ తోడ్పాటుతో సాకారం చేసుకోవటానికి ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని అగ్రిహబ్ ఎండీ డా. కల్పనా శాస్త్రి తెలిపారు.
పేటెంట్లకూ తోడ్పడుతున్నాం!
ఎంటర్‌ప్రెన్యూర్లు, శాస్త్రవేత్తల అగ్రిటెక్ స్టార్టప్‌లతో పాటు రైతులు, గ్రామీణుల ఆవిష్కరణలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తున్న ఏకైక ఇంక్యుబేషన్ సంస్థ అగ్రిహబ్ ఒక్కటే. సాంకేతిక ఆవిష్కరణలతో పాటు రైతుల వంగడాలకు కూడా పేటెంట్లు పొందేందుకు మేం తోడ్పడుతున్నాం. ఇన్నోవేటర్ల తరఫున ఇప్పటికి మొత్తం 13 పేటెంట్లకు దరఖాస్తు చేశాం.
– డా. కల్పనా శాస్త్రి, మేనేజింగ్ డైరెక్టర్, అగ్రిహబ్ ఫౌండేషన్, పిజెటిఎస్‌ఎయు, హైదరాబాద్
ఇవి చదవండి: మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్నా.. తిరిగి విరగ్గాసిన సేంద్రియ పత్తి!
Comments
Please login to add a commentAdd a comment