తాన్వీ హన్స్, శ్వేతా సుబ్బయ్య. ఒకరు ఫుట్ బాల్ క్రీడాకారిణి, మరొకరు ఫిట్‌నెస్ ట్రైనర్. ఈ ఇద్దరు ఏడేళ్ల క్రితం బెంగళూరులో మహిళల కోసం సరదాగా ఓ స్పోర్ట్స్ సెషన్‌ను ఏర్పాటు చేశారు.అది మొదలు ఇప్పుడు దేశం అంతటా మహిళల కోసం స్పోర్ట్స్ సెషన్ లు, నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 5000 మందికి పైగా ఈ మహిళా నెట్‌వర్క్ ఉమెన్ స్పోర్ట్స్ కమ్యూనిటీని విస్తరించడానికి ట్రావెల్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తుంటారు. 14 ఏళ్లలోపు అమ్మాయిల నుంచి అరవై ఏళ్లకు పైగా వయసున్న బామ్మలు కూడా వీరి గ్రూప్‌లో సభ్యులు. ఈ నెల నుంచి సెప్టెంబర్ వరకు మహిళల్లో క్రీడాస్ఫూర్తి నింపడానికి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు తాన్వి, శ్వేత.
క్రీడల ద్వారా కనెక్ట్ అయిన మహిళల సంఘంగా తాన్వి, శ్వేతలు ఏర్పాటు చేసిన ‘సిస్టర్స్ ఇన్ స్వెట్’ గురించి చెప్పుకోవచ్చు ప్రోఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన తాన్వీ హన్స్ 2017లో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లింది. అక్కడ ఆమెకు శ్వేత సుబ్బయ్య పరిచయం అయ్యింది. తన ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్‌లలో శ్వేత ఒకరు. కొద్దిరోజుల్లోనే వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ‘‘ఒకసారి జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో లేడీస్ అంతా ‘మాకు కూడా క్రీడలు నేర్పించవచ్చు కదా! అని అడిగారు. దాంతో ఆ వీకెండ్‌లో ఒక గ్రౌండ్ బుక్ చేసి, కొంతమంది మహిళలను ఆహ్వానించాం. అదొక ఫన్ సెషన్ అనుకున్నాం. నలుగైదుగురు వస్తారు అనుకుంటే ఏకంగా 17 మంది మహిళలు వచ్చారు’ అని నాటి రోజులను గుర్తుచేసుకుంటుంది తాన్వి.
సరదాగా మొదలై..
35 ఏళ్ల వయసున్న మహిళల కోసం గంటన్నర స్పోర్ట్స్ సెషన్‌ను మొదటిసారి ఏర్పాటు చేశారు. ఆ సమయంలో శ్వేత ఫిట్‌నెస్ ట్రైనర్‌గా... తాన్వి క్రీడల కోసం మహిళలు తమ శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో వివరించింది. అంతా సరదాగా జరిగిన ఈ కార్యక్రమం తర్వాత కొత్త ఆలోచనకు దారి వేసింది. ‘ఆ మొదటి సెషన్ తర్వాత లేడీస్ మా వద్దకు వచ్చారు. ఈప్రోగ్రామ్ చాలా బాగుందని, ప్రతి వారాంతంలో తమకోసం ఓ సెషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలా ఈ కమ్యూనిటీ మొదలైంది’ అని వివరిస్తుంది తాన్వి. స్కూళ్లు, కాలేజీల తర్వాత క్రీడల నుండి తప్పుకుంటున్న మహిళల ఆలోచనల్లో తిరిగి స్పోర్ట్స్ పట్ల జీవం పోయడమే తమ ధ్యేయంగా చెబుతారు వీరు. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, టచ్ రగ్బీతో సహా ఇతర స్పోర్ట్స్ ఫార్మాట్‌లతో ఈ గ్రూప్ రన్ అవుతోంది.
అన్ని వయసుల వారూ.. .
‘‘2017లో మొదటి సెషన్‌ప్రారంభమైనప్పుడు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు అని మాత్రమే అనుకున్నాం. ఆ తర్వాత సగటు వయసు 25 నుంచి 30కి చేర్చాం. కానీ, మాతో ఆడుకోవడానికి ఉత్సాహం చూపే 12–14 ఏళ్ల వయసున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాగే, 65 ఏళ్ల మహిళలు కూడా ఆసక్తి చూపారు. అలా చిన్న వయసు నుంచి సీనియర్ మహిళల వరకు అందరూ మా గ్రూప్‌లో ఉన్నారు. వీరితోపాటు పరిశ్రమల యజమానులు, తల్లులు, గృహిణులు, విద్యార్థులూ ఉన్నారు. కాలేజీల్లో ఆడుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉందని మొదట్లో మేం అనుకునేవాళ్లం.
కానీ, అలాంటి వ్యవస్థ చాలా వరకు మన విద్యా సంస్థల్లో లేదని తెలిసింది. మొత్తమ్మీద వివిధ రకాలప్రోఫైల్స్ మా వద్దకు చేరాయి. సాధారణంగా క్రీడలు అబ్బాయిలు, పురుషుల కోసమే అనే ఆలోచన మన సంస్కృతిలో పాతుకుపోయాయి. స్కూల్ స్థాయిలో మన దగ్గర కొన్ని విద్యా సంస్థలు అమ్మాయిలకు క్రీడల్లో అవకాశాలను ఇస్తాయి. కానీ, వారి ఎంపికలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కాలేజీల్లోనూ ఇదే తేడా కనిపిస్తుంది. అందువల్లే, క్రీడల్లో పాల్గొనాలని ఉన్నా మహిళలు డ్రాప్‌ఔట్ అవుతుంటారు. వీటన్నింటినీ ఆలోచించి మేం ఈ ఏర్పాటు చేశాం’ అని తాన్వి చెబుతుంది. ‘మహిళలు ఇతర మహిళలతో ఆడుకోవడానికి మేం అవకాశాలు కల్పిస్తున్నాం. దీని వల్ల వారు సుఖంగా, సురక్షితంగా ఉంటారు. తమ కోసం మంచి సమయం గడుపుతారు’ అంటుంది శ్వేత.
బెంగళూరులో ప్రతివారం ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, టచ్ రగ్బీ సెషన్స్ నిర్వహిస్తున్నారు ఈ టీమ్. అలాగే, ప్రతి ఆదివారం, మూడు నెలలకోసారి సైక్లింగ్ ఈవెంట్‌లను నిర్వహిస్తున్నారు. స్విమ్ సెషన్స్ కూడా నిర్వహిస్తూ తమ బృంద సభ్యులను మరింత ఉల్లాసపరుస్తున్నారు. ఇందుకోసం స్పెషల్‌గా తమలోనే కోచ్‌లను నియమించుకుంటున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా వీరి బృందంలో చేరవచ్చు. ‘ఈ స్పోర్ట్స్ కమ్యూనిటీలో చేరడానికి మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. క్రీడల్లో పాల్గొనడానికి మాత్రం నామమాత్రపు రుసుము చెల్లించాలి’ అని చెబుతున్నారు తాన్వీ, శ్వేత. ప్రతి ఈవెంట్‌కు స్పాన్సర్లను వెతకడం, వాటి ద్వారా ఖర్చులు తగ్గించడం వల్ల క్రీడల్లో పాల్గొనే మహిళలు ఈ సెషన్స్‌లో సంతోషంగా పాల్గొంటున్నారని వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment