డాక్టర్: నీ టెడ్డీబేర్‌కు ఏమైంది?
చిన్నారి: కాలు నొప్పి
డాక్టర్: ఎక్కడ?
చిన్నారి: ఇక్కడ
డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది...
ఇలాంటి క్లినిక్‌లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్‌లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్‌లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్‌లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్‌ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్‌లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్‌కు తీసుకెళితే డాక్టర్‌కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్‌కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్‌లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి?
టెడ్డీ బేర్ క్లినిక్స్
యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్‌లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్‌లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్‌కు టీమ్‌గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్‌లో ఎంత చక్కగా టెడ్డీ బేర్‌లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది.
మంగుళూరులో ట్రెండ్
గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్‌గా ఈ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్‌లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్‌ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి.
తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్‌లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్‌కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్‌కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్‌ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్‌ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్‌మెంట్‌ను స్కూల్ సాయంతో పేరెంట్స్‌కు పంపుతారు.
కంటి, పంటి పరీక్ష
చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్‌ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది.
మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment