ఇటీవల సోషల్ మీడియా పిచ్చి మాములుగా లేదు. ఎంతలా అంటే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసేందుకు ఎలాంటి పిచ్చి పనులు చేసేందుకైనా వెనకాడటం లేదు. వ్యూస్, లైక్‌లు, ఫాలోవర్లు ఇదే లోకం, లక్ష్యం అన్నట్లుగా ఎలా పడితే అలా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. అది సమంజసమైన వీడియోనేనా, నెటిజన్లకు ఉపయోగపడుతుందా అనేది అనవసరం. కొందరైతే ఘోరం ప్రమాదాలను సృష్టించి ఇతరుల ప్రాణాల రిస్క్‌లో పడేసి మరీ వీడియోలు తీసేస్తున్నారు. ఇలాంటి పనే చేశాడు 17 ఏళ్ల కుర్రాడు.
ఏం చేశాడంటే..అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్‌లో వీడియో వైరల్ చేయాలనే కోరికతో దారుణానికి ఒడిగట్టాడు. వీడియో కోసం అని ఏప్రిల్‌లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్‌ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. సమీపంలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో బీఎన్‌ఎస్‌ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్‌లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి అవి పట్టాలు తప్పాయి.
ప్రమాదం సృష్టించిన ఈ బాలుడే మళ్లీ రైల్వే అధికారులకు ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరో కీలక స్విచ్‌లను మార్చినట్లు గుర్తించారు. ఎందుకనో పోలీసులు అనుమానంతో సమాచారం అందించిన బాలుడినే గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
విచారణలో ఆ బాలుడు..తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించాలనుకున్నట్లు తెలిపాడు. కానీ ఆ స్విచ్ మార్పులతో తనకు సంబంధం లేదని బుకాయించాడు. అయితే అధికారులు అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ప్రమాదానికి ముందు వాహనంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. అతడు బాలుడితో సరిపోలాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఈ ప్రమాదం కారణంగా ఒహామా పబ్లిక్ పవర్ డిస్ట్రిక్ట్‌కు, బీఎన్‌ఎస్‌ఎఫ్ రైల్వేకు దాదాపు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట.
(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?)
Comments
Please login to add a commentAdd a comment