15 Easy And Best Home Remedies To Remove Dandruff Naturally In Telugu - Sakshi
Sakshi News home page

Dandruff Home Remedies: ఇలా చేస్తే .. ఎప్పటినుంచో వెంటాడుతున్న చుండ్రు సమస్య పరార్‌!!

Published Fri, Oct 29 2021 11:29 AM | Last Updated on Fri, Oct 29 2021 12:58 PM

These Simple Home Remedies To Get Rid Of Dandruff - Sakshi

How To Cure Dandruff Tips In Telugu: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, ప్రాంతాలలో చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యలలో చుండ్రు ఒకటి. చుండ్రు ఒకప్పుడు చలికాలం మాత్రమే వచ్చే సమస్య. ఇప్పుడు కాలాలు, వాతావరణాలతో, వయసుతో సంబంధం లేకుండా అందరినీ చుట్టు ముట్టేస్తోంది. ఇదేమీ పెద్ద అనారోగ్య సమస్య కాదు... ప్రాణాంతక వ్యాధి అసలే కాదు, కాని చాలా చిరాకు కలిగించే సమస్య. కొందరిలో ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది! దేనికైనా అది రావడానికి కారణాలు తెలిస్తే నివారించడం సులభం... చుండ్రు ఎందుకు వస్తుంది? దానిని ఎలా నివారించవచ్చనే దానిపై అవగాహన కోసం...

చుండ్రు అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది?
చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనే హానిలేని సూక్ష్మజీవి. ఇది అందరిలో ఉంటుంది. కానీ తలలో అధికంగా ఉండే నూనె, మృత కణాలని ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతుంది. దీనిమూలంగా మృత కణాలు ఎక్కువై తల నిండా పొట్టు లాగా కనపడుతుంది. దీనినే చుండ్రు అంటారు.

Dandruff Home Remedies 

ఆహారంలో గణనీయమైన మార్పులు, తరచు ప్రయాణాలు చేయడం, నీటి మార్పు, వాతావరణ మార్పు వంటివి ఇప్పుడు ఇంచుమించు అందరి జీవితంలో తప్పనిసరి అయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో జుట్టుని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవటానికి ఖచ్చితంగా కొంత టైం కేటాయించాలి.

చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ!

నివారణ చర్యలు 
►ఇతరుల దువ్వెనలను, హెయిర్‌ బ్రష్‌లను, తువ్వాళ్ళను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. వారానికి ఒకసారి స్వచ్ఛమైన కొబ్బరినూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ను గోరువెచ్చగా చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలు లేదా శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి.

►తలస్నానం చేసే నీళ్ళు పొగలు కక్కేంత వేడిగా లేదా వణుకు పుట్టించేంత చల్లగా ఉండకూడదు. గోరువెచ్చని నీరు చాలా మంచిది. 
ప్రకటనలలో చూపించారు కదా అని గాఢమైన రసాయనాలు కలిసిన హెయిర్‌ ఆయిల్స్‌ను, షాంపూలను ఇష్టం వచ్చినట్లు వాడటం కూడా తలపై ఈస్ట్‌ పెరిగేందుకు అవకాశం కలిగిస్తుంది. 

►మాసిపోయిన దుప్పట్లను, తలగడలను వాడటం, దుమ్ము, ధూళి పడే ప్రదేశంలో పని చేయడం, పోషకాహారం తీసుకోకపోవడం, మానసిక ఆందోళన, కొన్ని రకాల మందులను వాడటం చుండ్రుకు దారి తీసే కారణాలలో ప్రధానమైనవి. 

►చుండ్రుతో బాధపడేవారు తలగడ గలీబులను వేడినీటిలో నానబెట్టి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేయాలి. పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.

చదవండి: Health Tips: ఈ విటమిన్‌ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..

Dandruff Home Remedies In Telugu

మందార ఆకులు : జుట్టుకు కండిషనర్‌ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్‌ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్‌ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.

Dandruff Remedies

మెంతి: మెంతి ఆకును దంచి పేస్ట్‌ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.

Dandruff Tips

వేపాకు: తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేస్తే  చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.

కాసిని గసగసాలు తీసుకొని, సన్నని మంట పై వేయించి, గోరువెచ్చటి నీటిలో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని, తలకు పట్టించి, గంట ఆగి తల స్నానం చేయాలి.
నాణ్యమైన వెనిగర్‌ బాటిల్‌ తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్‌ చొప్పున కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే చుండ్రు సమస్య నుంచి తొందరలోనే బయట పడవచ్చు.  

చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..!

ఈ చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి..
►చుండ్రుతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరి పొడిని కలిపి తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

►రెండు టేబుల్‌ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానపెట్టి, ఉదయం దానిని పేస్టులా చేసుకుని ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.

►అలోవెరా జెల్‌ని తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే చుండ్రు తొలగి తల శుభ్రంగా ఉంటుంది.     

►తీక్షణమైన ఎండ వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు తలకు ఆచ్ఛాదనగా టోపీ పెట్టుకోవడం లేదా బట్టను కట్టుకోవడం మంచిది.

►పోషకాహార లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి.

►నిద్రలేమి ఏర్పడకుండా చూసుకోవాలి. తల దువ్వుకునే దువ్వెనలో పళ్ళ మధ్య మట్టి పేరుకోకుండా శుభ్రపరుస్తూ, దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది.

►వెంట్రుకల కుదుళ్ళలోకి ఇంకేటట్లుగా కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్ళతో సున్నితంగా మసాజ్‌ చేయాలి.

►వేసవిలో చెమట వల్ల, వానాకాలంలో తల తడవడం వల్ల తల తొందరగా మాసిపోతుంది కాబట్టి వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది. 

చదవండి: మళ్లీ వచ్చేశాయ్‌.. ఏ చీరకాకాసు.. తళతళల కాసులు!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement