ఈడెన్‌బర్గ్‌ కామెడీ అవార్డుని గెలుచుకున్న తొలి భారతీయురాలు! | Urooj Ashfaq Wins Best Newcomer At Edinburgh Comedy - Sakshi
Sakshi News home page

ఈడెన్‌బర్గ్‌ కామెడీ అవార్డుని గెలుచుకున్న తొలి భారతీయురాలు!

Published Sat, Sep 2 2023 10:16 AM

Urooj Ashfaq Wins Best Newcomer At Edinburgh Comedy - Sakshi

కామెడీ చేసే  స్త్రీలు తక్కువ. దానికి కారణం ఎప్పటి నుంచో స్త్రీల నవ్వు మీద  అదుపు ఉండటమే. నవ్వని స్త్రీలు ఎదుటి వారిని ఏం నవ్విస్తారు? థ్యాంక్స్‌ టు స్టాండప్‌ కామెడీ. ఇటీవల కొంతమంది స్టాండప్‌ కామెడీలో పేరు గడిస్తున్నారు. ముంబై కమెడియన్‌ ఉరుజ్‌ అష్వాక్‌ ఏకంగా ఈడెన్‌బర్గ్‌ కామెడీ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు ఇలా భారతీయులకు రావడం ఇదే మొదటిసారి.

‘ఈడెన్‌ బర్గ్‌ కామెడీ అవార్డ్స్‌’ను కామెడీ ఆస్కార్‌గా భావిస్తారు. అందువల్ల 28 ఏళ్ల ఉరుజ్‌ అష్వాక్‌ 2023 సంవత్సరానికి ‘బెస్ట్‌ న్యూకమర్‌’ అవార్డును గెల్చుకోవడం చాలా పెద్ద విషయంగా చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం ఈడెన్‌బర్గ్‌లో జరిగే జూలై, ఆగస్టుల్లో జరిగే ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఒక రకంగా సంప్రదాయ ఫెస్టివల్స్‌ మీద తిరుగుబాటు లాంటిది. ఇక్కడ ఎంట్రీలు, ఎగ్జిట్‌లు ఉండవు. ఎవరైనా వచ్చి తమ కళను ప్రదర్శించవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్త కళకారులు భారీగా తరలివచ్చి తమ కళలను ప్రదర్శిస్తుంటారు. వాటిని చూడటానికి జనం పోటెత్తుతారు. ఈ సందర్భంగానే కామెడీ అవార్డ్స్‌ ఇస్తారు. ఈసారి ఉరుజ్‌ అష్వాక్‌ చేసే ‘ఓ.. నో’ అనే షో బెస్ట్‌ న్యూ కమర్‌ అవార్డ్‌ గెల్చుకుంది. భారతీయులలో అందునా స్త్రీలలో ఇలా అవార్డు గెలుచుకున్నవారు ఇంతకు మునుపు లేరు. 

అబూదాబి నుంచి
ఉరుజ్‌ అష్వాక్‌ అబూదాబిలో పుట్టి పెరిగి స్వదేశమైన భారత్‌కు తల్లిదండ్రులతో పాటు 12 ఏళ్ల వయసులో తిరిగి వచ్చింది. ఆ తర్వాత చదువంతా ముంబైలో సాగించింది. చిన్నప్పటి నుంచి చాలా మాటకారి అయిన ఉరుజ్‌ సైకాలజీలో డిగ్రీ చేశాక  2014 నుంచి స్టాండప్‌ కామెడీ చేయడం మొదలెట్టింది. స్టాండప్‌ కామెడీ అప్పుడప్పుడే ఒక ఉపాధిగా మారుతున్నా అది మగవాళ్ల వ్యవహారంగానే ఉండింది. అందువల్ల ఆమెకు కంటెంట్‌ రాసే పని ఎక్కువగా దొరికేది తప్ప షో దొరికేది కాదు. అయినప్పటికీ ఉరుజ్‌ చిన్నా చితకా సందర్భాలలో దొరికిన సమయంలో నవ్వించే ప్రయత్నం చేసేది. అయితే 2017 కేవలం మహిళా స్టాండప్‌ కమెడియన్స్‌ కోసం నిర్వహించిన ‘క్వీన్స్‌ ఆఫ్‌ కామెడీ’లో ఉరుజ్‌ చేసిన కామెడీ విపరీతంగా గుర్తింపు పొందింది. ఇక ఆమె వెను తిరిగి చూళ్లేదు. 

మైక్రోఫోనే ఆయుధం
స్టాండప్‌ కామెడీ చేసేవాళ్ల దగ్గర మైక్రోఫోన్‌ తప్ప వేరే ఆయుధం ఉండదు. ఆ మైక్రోఫోన్‌లో వారు పలికే ప్రతి మాట ఎదురుగా ఉన్న ఆడియెన్స్‌ను వ్యంగ్యంగా, పదునుగా తాకి హాస్యం పుట్టించాలి. అయితే ఇక్కడ మనోభావాలు దెబ్బ తీయకూడదు. అలాగే పిచ్చి జోకులు వేయకూడదు. అలా చేస్తే నవ్వు కాస్త నవ్వుల పాలవుతుంది. అయితే ఉరుజ్‌ ప్రత్యేకత ఏమిటంటే ఆమె చాలా వేగంగా మాట్లాడుతూ సందర్భానికి తగినట్టుగా పంచ్‌ వేసి ఆకట్టుకుంటుంది. ఆమెవన్నీ స్వీయ జీవితంలోని సంఘటనలే.

వాటినే చెప్తూ నవ్విస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలోని మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో చెప్తే అందరూ భుజాలు తడుముకుంటూ వింటారు. ‘క్యాజువల్‌ రిలేషన్‌షిప్స్‌’ పేరుతో ఈకాలపు స్త్రీ–పురుష సంబంధాలను ఆమె విమర్శించే తీరు ఆలోచింప చేసింది. తనను తాను నాస్తికురాలిగా చెప్పుకునే ఉరుజ్‌ నిర్బంధ సంప్రదాయాలపై కూడా జోకులు పేల్చడం కద్దు. ‘మర్యాదస్తులను ఒక్కోసారి చిన్నబుచ్చడానికి వెనుకాడను. సరిహద్దుల్లోనే ఉంటే హాస్యం పుట్టదు. గీత దాటాలి’ అనే ఉరుజ్‌ కత్తి మీద సాము వంటి హాస్యంలో ఒక స్త్రీగా రాణిస్తూ ఉండటం కచ్చితంగా మెచ్చుకోవాల్సిన సంగతి.  

(చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!)

Advertisement
 
Advertisement
 
Advertisement