ఇంటి గుట్టు లంకకు చేటు అని సామెత. అంటే ఇంట్లో ఉండవలసిన సమాచారాన్ని అవతలి వారికి చేరవేయడం వల్ల అది ఆ ఇంటికంతటికీ అనర్థదాయకం అన్నమాట. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత గోప్యత ఉండాలి. అది పాటించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన ధర్మాల విషయంలో కూడా కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనివ్వ కూడదనేవారు.
మూడోకంటికి తెలియకుండా అని కూడా తరచు వాడేవారు. గోడకు చెవులుంటాయి కనుక కాస్త చూసుకుని మాట్లాడటం మంచిది అనేవారు. జీవితాన్ని కనీసం కొంతవరకైనా గోప్యంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
ఇప్పుడున్నంత ఓపెన్‌గా ఒకప్పుడు ఉండేది కాదు ఏ విషయమైనా. దురదృష్టవశాత్తూ సోషల్ మీడియా చొచ్చుకు వచ్చినప్పటి నుంచి అంతా బహిరంగమే అయిపోయింది. చిన్నవారి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని పబ్లిక్‌గా మార్చేసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రైవసీని కోల్పోతున్నారు. దానివల్ల చిక్కుల్లో పడుతున్నారు.
గోప్యత అంటే..?
గోప్యత అంటే ఏదయినా ఒక ముఖ్యమైన సమాచారాన్ని రహస్యంగా ఉంచడం లేదా బహిర్గతం చేయకుండా ఉండటం. గోప్యత అనేది కేవలం ఆ సమాచారాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచే చర్య.
పాటించడం ఎలా?
రహస్య విషయాలను చర్చిస్తున్నప్పుడు ఎవరూ వినలేదని నిర్ధారించుకోండి. పనిని సాధించడానికి అవసరమైన కనీస సమాచారాన్ని మాత్రమే భాగస్వామ్యం చేయండి. కొంతమంది నిపుణులు... వైద్యులు, న్యాయవాదులు, అకౌంటెంట్లతో సహా వారి వృత్తిపరమైన స్థానం ద్వారా వ్యక్తులు లేదా సంస్థల గురించి సమాచారాన్ని పొందుతారు. ఉదాహరణకి వైద్యులకు వారి రోగుల పరిస్థితులు, చికిత్సల వివరాలు తెలుసు ∙న్యాయవాదులకు వీలునామాలు, కోర్టు కేసుల వివరాల గురించి తెలుసు, వాటిలో కొన్ని చట్టం ద్వారా రక్షించబడవచ్చు; ∙ట్యాక్స్ కన్సల్టెంట్లు తమ ఖాతాదారుల పన్ను, ఆదాయం గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ తమకు తెలిసినప్పటికీ ఆయా వృత్తి నిపుణులు తరచు వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళితో ΄ాటు అధికారిక చట్టపరమైన అవసరాలకు కట్టుబడి ఉంటారు. ఉండాలి కూడా.
ఎందుకు అవసరం?
మానసిక ఆరోగ్యానికి, వ్యక్తి ఎదుగుదలకు చాలా ముఖ్యమైన వాటిలో గోప్యత కూడా ఒకటి.. ఎవరినైనా విశ్వసించడం లేదా వారికి రహస్యాలు చెప్పడం అనేది గోప్యతను బయట పెట్టుకోవడమే. ఎందుకంటే గోప్యత అంటే రహస్యంగా ఉంచవలసిన సమాచారం. దీనిని బహిరంగ పరచుకోవడం అంటే తమకు తామే నష్టాన్ని కొని తెచ్చుకోవడమే! జీవితాన్ని గోప్యంగా ఉంచుకున్నప్పుడు ఆలోచనలు, భావాలు, అనుభవాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం లభిస్తుంది. ఇది మన విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది!
వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడం వల్ల ప్రశాంతత, స్థిరత్వం లభిస్తాయి. ఇవి మనల్ని మనం అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. మనలోని నెగటివ్ ఆలోచనల నుంచి ఉపశమనం పొందుతాము. ఇది మన మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచి జీవితాన్ని సానుకూలం చేస్తుంది. జీవితాన్ని కాస్తంత గోప్యంగా ఉంచుకున్నప్పుడు మనలోని సున్నితత్వాన్ని మనం అనుభవిస్తాం. దీనివల్ల మన ఆలోచనలు, భావాలు మనతోనే కనెక్ట్ అవుతాయి. ఇది ఇతరుల పట్ల సున్నితంగా వ్యవహరించడానికి సహాయపడుతుంది. మన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
వ్యాపారంలో, ఉద్యోగంలో గోప్యత పాటించడం వల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. మనపై ఎవరూ పెత్తనం చెలాయించడానికి అవకాశం ఉండదు. దీనివల్ల ఆత్మవిశ్వాసం బలపడుతుంది. మానసిక ఆరోగ్యం, ఎదుగుదల బాగుంటుంది. గోప్యత లోపించిన మన ప్రార్థనలు, దానధర్మాలు, ఉపవాస దీక్షలు వ్యర్థమే అని చెప్పవచ్చు. అవి ఈనాడు బహిరంగ ప్రచార వేదికలయ్యాయి, వాటివల్ల బోలెడు పేరు ప్రఖ్యాతులైతే వస్తాయేమో కాని వాటి అసలు ఫలాలు, ఆశీర్వాదాలు మాత్రం లభించవు.
ఇతరులకు ఒక చేతితో చేసే సహాయం, మరో చేతికి తెలియకూడదని, అదంతా రహస్యంగా జరగాలని మతగ్రంథాల ఆదేశం. మనం మన పొరుగువారికి, పేదలకు చేసే సహాయం లేదా ధర్మం ఎంత రహస్యంగా ఉంటే దానివల్ల దేవుని ఆశీర్వాదాలు మనకు అంత ధారాళంగా ప్రతిఫలంగా లభిస్తాయని బైబిల్ చెబుతుంది. ఇది ఏ మతంలోనైనా వర్తిస్తుంది. చివరగా... గోప్యంగా ఉండమన్నారు కదా అని వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు మీ జబ్బులను మాత్రం గోప్యంగా ఉంచకండి. డాక్టర్ల వద్ద అన్నీ చెప్పుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment