ప్రయి‘వేటు’ పడగ నీడ!  | Dileep Reddy Article On Unemployment | Sakshi
Sakshi News home page

ప్రయి‘వేటు’ పడగ నీడ! 

Published Fri, Apr 16 2021 1:19 AM | Last Updated on Fri, Apr 16 2021 9:49 AM

Dileep Reddy Article On Unemployment - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. దీంతో ప్రపంచం లోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. చిత్తశుద్ది ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి– ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరూపించింది. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడం విచిత్రం. ప్రభుత్వ రంగ సంస్థల స్థిరాస్తుల మీద కన్నేసిన కార్పొరేట్‌ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించుకుంటాయి?

కార్యదక్షత తెలిసేది కష్టకాలంలోనే! అన్నీ సాఫీగా నడిచినపుడు కాక సంక్షుభిత సమయాలే పాలకుల్లో సమర్థత ఉందో, లేదో అద్దంపడుతాయి. ప్రజల పట్ల ప్రభుత్వాల నిబద్ధతను నిగ్గు తేలు స్తాయి. మాటకి–చేతకి పొంతన ఎంతో తేల్చి చెబుతాయి. ప్రపంచంలోనే అత్యధిక శాతం యువ జనాభా ఉన్న భారతదేశం ఇప్పుడు నిరుద్యోగితతో అల్లాడుతోంది. కోవిడ్‌ మహమ్మారి కొట్టిన దెబ్బకు దేశంలోని కోట్లాది కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. సంవత్సరాల నుంచి ఉద్యోగమో, ఉపాధో అని నిరీక్షిస్తున్న కుటుంబాల గతి ఇప్పటికే దీనంగా ఉంటే, ఉన్న ఉద్యోగం–ఉపాధి కోవిడ్‌ వల్ల కోల్పోయి రొడ్డున పడ్డ జీవితాలు దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నాయి. తమ ఉద్దీపన చర్యలతో కోలుకుంటోందని ప్రభుత్వాలు ఊదరగొట్టిన ఆర్థిక వ్యవస్థ, కోవిడ్‌ రెండో విజృంభణతో వెనక్కి జారుతోంది. పూర్తి మూసివేత (లాక్‌డౌన్‌) లేకపోయినా... దాదాపు అలాంటి పరిస్థితినే తలపిస్తున్న నిర్బంధాలు, నిషేధాలు, కఠిన ఆంక్షలు వివిధ కార్య కలాపాల్ని స్తంభింపజేస్తున్నాయి.

సామాన్యుల మనుగడ దుర్భరం చేస్తూ ఆర్థిక వృద్ధిని అడ్డగిస్తున్నాయి. దినకూలీల ఉపాధి ఉట్టెక్కుతోంది. ఉద్యోగాలు ఊడుతున్నాయి. రాబడి తగ్గిన ఈ కష్టకాలం లోనే.. ఖర్చులు రమారమి పెరిగాయి. అత్యధికుల బతుకు దుర్భర మౌతోంది. ప్రకృతి దెబ్బకు ప్రభుత్వాల నిర్వాకంతోడై సమాజంలో ఆర్థిక అంతరాలు అధికమౌతున్నాయి. సంపన్నులు మరింత సంపన్ను లవుతుంటే, పేదలు నిరుపేదలవుతున్నారు. మధ్యతరగతి జీవులు దీనంగా దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నారు. అశాంతి ప్రబలుతోంది. ఈ నెల 11తో ముగిసిన వారం నమోదైన జాతీయ నిరుద్యోగిత 8.58 శాతానికి చేరింది. గత నెలా ఖరుకున్న 6.65%పైన ఇది దాదాపు 2% పెరుగుదల. నగర–పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత సుమారు పది శాతానికి చేరుకున్నట్టు ‘భారత ఆర్థిక నిర్వహణ కేంద్రం’ (సీఎంఐఈ) అధ్యయనం చెబుతోంది. ఇవి ప్రమాద సంకే తాలు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలి.

సర్కార్ల చిత్తశుద్ధే ముఖ్యం!
ఆత్మహత్యలు ఏ సమస్యకూ పరిష్కారం కావు. కనుకే, అందుకు తలపడవద్దని, పోరాడి నిలిచి–గెలవాలనీ అందరూ చెబుతారు. అయినప్పటికీ ఆత్మహత్య చేసుకునే వారి మానసిక పరిస్థితి గురించి ఒక క్షణం ఆలోచించాలి. ‘నేను చాతకాక చావటం లేదు, నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి.. ఆరేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఏ యత్నమూ ఫలించలేదు, సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తేవాలని...’ అంటూ వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్న కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి సునీల్‌ నాయక్‌ ఒక హెచ్చరిక! మరో నిరుద్యోగి, నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, దుస్థితి తట్టుకోలేక తానూ బలవన్మరణంతో తనువు చాలించిన అతని భార్య అక్కమ్మ... ఇవన్నీ సమస్య తీవ్రతకు ప్రతీకలే!  

ప్రబల శక్తిగా ఉన్న యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన తమ బాధ్యతను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఎన్నెన్నో మార్గాల్లో యువతకు ఉపాధి–ఉద్యోగాలు కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరూపించింది. వాలంటీర్లు, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులు, నర్సులు, టీచర్లు, పోలీసులు, సర్వీసు కమిషన్‌ ద్వారా ఉన్నతస్థాయి ఉద్యోగులు... ఇలా వివిధ విభా గాల్లో కలిపి రెండేళ్ల కాలంలోనే 4 లక్షల మందికి పైగా ఉద్యోగ–ఉపాధి కల్పించింది. వారంతా, రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడపడంలో భాగమౌతున్నారు. ఎందుకో అన్ని ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టక పోవడం విస్మయం. ఖాళీలు భర్తీ చేయరు. వాటిని ఖాళీగా చూపించడం ఇష్టం లేక, విమర్శల్ని ఎదుర్కోలేక పోస్టుల్నే రద్దు చేస్తారు. అయినా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కింద కలిపి సుమారు 60 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం దేశవ్యాప్తం ఖాళీగా ఉన్నట్టు ఓ లెక్క! వాటిని భర్తీ చేసే ప్రయత్నం జరగటం లేదు.

ఎన్నికవడానికి ముందు దేశ ప్రజలకు హామీ ఇస్తూ, ‘ఏటా కోటి నుంచి రెండు కోట్ల ఉద్యోగాలి స్తాం’ అన్నారు, ఏవీ? అలాంటిదే మరో ఎన్నికల హామీ, ‘రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం’ అన్నారు, అవెక్కడ? తెలంగాణలో పాలక– విపక్షాల మధ్య ఇదో నిత్యరగడ! ఆరేళ్లలో 1.35 లక్షల మందికి ఉద్యోగ –ఉపాధి కల్పించామని పాలకపక్షం అంటే, నిజానికి ఆ సంఖ్య 35 వేలే అని విపక్షాలంటున్నాయి. ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాలూ తమ ఘనతే అంటే, అక్కడ ఊడిపోతున్న అవకాశాలకూ సర్కార్లు బాధ్యత వహించాలి, వహిస్తాయా?

పెరగాల్సిన ఉద్యోగులు తగ్గితే?
ఏటా లక్షలాది మంది డిగ్రీలు పొంది ఉద్యోగాల కోసం వీధుల్లోకి వస్తు న్నారు. తగినన్ని అవకాశాలు ఉండటం లేదు. 2017–18 లో నిరుద్యోగిత తీవ్రస్థాయికి చేరింది. 1972–73 తర్వాత, 45 ఏళ్లలో ఇదే అత్యధికమని జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) వెల్లడించింది. 2017 నుంచి 2018 కి వచ్చే సరికి పెరగాల్సింది పోయి, 1.09 కోట్ల మంది ఉద్యోగులు తగ్గినట్టు సీఎంఐఈ అధ్యయనం తెలిపింది. ఖాళీలు భర్తీ చేయడం లేదు. ప్రయివేటు రంగంలోనూ విస్తరణలు ఆశించిన స్థాయిలో లేవు. పెద్ద కార్పొరేట్లు మధ్యతరహా పరిశ్రమల్నీ మననీయటం లేదు. ఉద్యోగిత పెంచే చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రభుత్వాలు తగినంత ప్రోత్సహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటివరకు దాదాపు 3 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయని ఒక అంచనా! 1.91 లక్షల ఖాళీలున్నాయని ఇటీవల పీఆర్సీ నివేదికే చెప్పింది. 25 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోర్టల్‌లో రిజిష్టర్‌ చేసుకున్నారు.


దేశవ్యాప్తంగా కోట్లాది యువకులు ఉద్యోగ–ఉపాధి అవకాశాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో.. కోవిడ్‌ పెద్ద దెబ్బే కొట్టింది. మొదటి విజృంభణలో గత సంవత్సరం కష్ట నష్టాలకోర్చి స్వగ్రామాలకు వెళ్లిన వలస కార్మికుల్లో 38.6 శాతం మంది మాత్రమే, తమ పని ప్రదేశాలకు తిరిగి వెళ్లినట్టు ఓ అధ్య యనం చెప్పింది. ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకమే (ఎన్నార్‌ఈజీ) అత్యధికుల్ని ఆదుకుంది. ఈ పథకం ద్వారా 2019–20 లో 7.88 కోట్ల మంది, 2020–21 లో 11.17 కోట్ల మంది శ్రామిక ప్రజలు లబ్ధి పొందారు.

కాలం మారుతోంది, కర్కశంగా...
ఇదివరకెన్నడూ లేని విధంగా, ‘అవునూ, అన్నీ ప్రైవేటుపరం చేస్తాం, ఏమిటి తప్పు?’ అని దర్జాగా, ధాటిగా సర్కార్లు ఎదురు ప్రశ్నించే కాలం వచ్చింది. సంక్షేమ రాజ్యం–జవాబుదారీతనం అర్థాలే మారుతున్నాయి. ‘‘ప్రభుత్వ నిర్వాకాల వల్ల నష్టాలొస్తున్నాయి, అందుకే పబ్లిక్‌ రంగ సంస్థల్ని ఎంతో ‘సామర్థ్యం’ ఉన్న ప్రైవేటుపరం చేస్తు న్నామం’’టున్నారు. అంతటా ప్రైవేటు రంగానికి అంతటి సామర్థ్యమే ఉంటే, వాళ్లు తీసుకున్న అప్పులు, ఇన్నిన్ని బ్యాంకుల్లో ఇన్నేసి లక్షల కోట్లు నిరర్థక ఆస్తులు (ఎన్పీయే)గా ఎందుకు మారుతున్నాయి? ప్రజాధనాన్ని ఎందుకిలా కొల్లగొడుతున్నారు?

ఇప్పటికే నదులు, సముద్రాలు, అడవులు, కొండలు, కోనలు, ఖనిజాలు.. ఇలా సహజ వనరుల్ని ప్రైవేటుపరం చేసి, కొత్త ఆశ్రిత వర్గాల్ని బలోపేతం చేసు కుంటున్నారు. పరిశ్రమలని, సెజ్‌లని, ఫార్మాసిటీలని ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కొని కార్పొరేట్‌ శక్తుల కిచ్చేస్తున్నారు. కర్షకులు, కార్మికులు, ఇతర పౌర సమాజం పోరాడి సాధించుకున్న చట్టాల్ని, హక్కుల్ని క్రమంగా నీరుగారుస్తున్నారు. చట్టాల్ని మారుస్తూ, ప్రజల దృష్టి ఏమారుస్తూ... ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు.

అరవై, డెబ్బై ఏళ్లుగా ప్రజాధనం వెచ్చించి, ఇటుక ఇటుకగా పేర్చి అభివృద్ధి చేసిన పబ్లిక్‌రంగ సంస్థల్ని (వ్యూహాత్మ కమైనవి తప్ప) అన్నింటినీ ప్రైవేటుకు అమ్మేస్తున్నారు. పప్పు బెల్లాలకు ధారా దత్తం చేస్తున్నారు. అందులో నష్టాలొచ్చేవే కాదు, లాభాలు గడించేవీ ఉన్నాయి! వాటి స్థిరాస్తులమీద కన్నేసిన కార్పొరేట్‌ శక్తులు.. రేపు ఫక్తు వ్యాపారం చేస్తాయి తప్ప, ప్రజాప్రయోజనాలు ఎందుకు పట్టించు కుంటాయి? జీతాలు కోస్తే అడిగేదెవరు? ఉద్యోగుల్ని తొలగిస్తే పట్టించుకునేదెవరు? అది పరోక్షంగా నిరుద్యోగితకే దారి తీస్తుంది. అందుకే అంటారు, విప్లవం ప్రత్యక్ష ఉత్పత్తి కాదు, విప్లవ పరిస్థితుల ఉప ఉత్పత్తి అని!

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement