హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా పాఠాలనే నేర్పింది. హోరాహోరీగా ఉంటుందని ఊహించిన ఎన్నికలో టీఆర్‌ఎస్ చతికిల పడింది. కాంగ్రెస్ నేల కరిచింది. ఈటెల రాజేందర్ బీజేపీని గెలిపించాడు. కాంగ్రెస్ ప్రభా వమున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటుబ్యాంకును తమకు అను కూలంగా మార్చుకుని కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా చేయాలన్న బీజేపీ లక్ష్యం సంపూర్ణంగా అమలు జరిగింది. ప్రజామోదం కలిగిన నాయకులను పార్టీలోకి ఆహ్వా నించి, తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో బీజేపీ కృత కృత్యమైంది.
కాంగ్రెస్, రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇది కాంగ్రెస్ సహజశైలికి విరు ద్ధంగా జరిగిన ప్రయోగం. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కబళించాలనేది బీజేపీ వ్యూహం అని తెలిసి కూడా తమ ఓటుబ్యాంకును రక్షించుకోవడం పక్కనబెట్టి టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా భావించడం వల్ల కాంగ్రెస్ ఘోరంగా నష్టపోయింది. తెరాసకు మంచి పట్టున్న నియో జక వర్గాలైన దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలలో ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు, కాంగ్రెస్ ఓటు బ్యాంకును అనుకూలంగా మలచుకోవడంతో బీజేపీ విజయం సాధించింది.
బీజేపీ తర్వాత జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రమే 20 శాతం ఓటుబ్యాంకు కలిగి ఉన్నదనీ, దాన్ని నిలుపుకోవడంతో పాటు, పెంచుకోగలగడం కాంగ్రెస్ ముఖ్య లక్ష్యమైతే బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగలదని విశ్లేషిం చారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. దేశంలో మరే పార్టీకి లేని అవకాశం ఒక్క కాంగ్రెస్‌కే ఉన్నదనీ, అలా చేసిన పక్షంలో ప్రాంతీయపార్టీల సహకారంతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశముంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఓటుబ్యాంకు కలిగి ఉండటం తెరాసకు కలిసివచ్చే అంశమనీ, ఆ పార్టీ ఉనికి కోల్పో వడం తమకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందనీ దుబ్బాక ఉప ఎన్నికలోనూ, హుజూరాబాద్ ఉపఎన్నికలోనూ తెరాస గ్రహించివుంటుంది. 2018 సాధారణ ఎన్నికలలో తెరాస ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ నిలిచి 61,121 ఓట్లు సాధిం చింది. ఉప ఎన్నికలో 95.07 శాతం ఓట్లు నష్టపోయి కేవలం 3,014 ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌కు పట్టున్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కనీసం ఇలాంటి చోటైనా పార్టీ జాతీయ నాయకత్వం తమ శక్తియుక్తులు ఉపయోగించి తమ ఉనికిని కాపాడుకోవాలి.
బీజేపీని వదలి, టీఆర్‌ఎస్‌ను మాత్రమే ఓడించడం లక్ష్యంగా పెట్టుకోవడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే. ఓటర్లు సహితం కాంగ్రెస్ క్యాడ ర్‌తో ఈటెలను తద్వారా బీజేపీని గెలిపించారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 58,107 ఓట్లను కోల్పోయింది. ఓటర్లు ఒక పార్టీనుండి ఇంకొక పార్టీ వైపు గంపగుత్తగా మొగ్గు చూపి గెలిపించిన సందర్భమిది. కాంగ్రెస్ కోల్పోయిన ఈ ఓట్లలో 75 శాతం మంది ఈటెల వైపు మొగ్గు చూపి ఉంటారనుకోవ డంలో సందేహం లేదు. ఈటెల సాధించిన మెజారిటీ 23,855. తెరాస గత ఎన్నికలతో పోలిస్తే 19 శాతం ఓటుబ్యాంకును కోల్పోయింది. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య వ్యత్యాసం 11.58 శాతంగా నిలిచింది. కాంగ్రెస్ 40 శాతం ఓటుబ్యాంకు నిలుపుకోగలిగినా పోటీ నువ్వా నేనా అనేటట్లు ఉండటమే గాక, జాతీయ ప్రత్యర్థి బీజేపీకి సవాలుగా మారివుండేది.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ ప్రత్యర్థి బీజేపీయే గానీ టీఆర్‌ఎస్ కాదు. అందుకే ఈ పరిణామాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నిశితంగా పరిశీలించి, బీజేపీ వలలో ఎలా పడ్డారో విశ్లేషించుకోవాలి. ఈ ఉప ఎన్నికలో ఓడిపోవడం వల్ల టీఆర్‌ఎస్‌కు జరిగిన నష్టం పెద్దదేమీ కాదు. ప్రత్యేక పరిస్థితులలో జరిగిన ఎన్నికలలో ఇలాంటి ఓటములు సహజం. దాన్ని ఆ పార్టీ తట్టుకుని నిలబడగలదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాంటిది కాదు. ప్రతి ఎన్నిక వారికి ఒక సవాలు. హుజూరాబాద్‌లో జరిగిన నష్టం జాతీయ నాయకత్వం చిన్నదిగా భావించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టే బీజేపీ వ్యూహ కోరల్లో కాంగ్రెస్ చిక్కుకుందని మాత్రం జాతీయ నాయకత్వం కచ్చితంగా గ్రహించాలి.
వ్యాసకర్త: డా. జి.వి. సుధాకర్ రెడ్డి
ఏపీపీఎస్‌సీ సభ్యులు
కమలం చేతికి చిక్కిన కాంగ్రెస్
Published Thu, Nov 11 2021 1:59 AM | Last Updated on Thu, Nov 11 2021 2:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment