ప్రజాస్వామ్య భారతదేశంలో విద్వేషాలకు, దౌర్జన్యాలకు, హింసలకు ఆశ్రయం కల్పిస్తున్న కొందరు స్వార్ధ రాజకీయనేతల చెడు ఆలోచనలను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైనది. న్యాయవాద వృత్తి అత్యంత పవిత్రమైన వృత్తి. సామాజిక అభివృద్ధిలో న్యాయవాదుల పాత్ర చాలా క్రియాశీలమైనది. ఒకరకంగా చెప్పాలంటే న్యాయవాదులు సామాజిక ఇంజ నీర్లు. ప్రజాజీవితంలో అన్ని వర్గాలవారితో ఉండే సత్సంబంధాలు, సాన్నిహిత్యాల వల్ల వారికి ప్రజాజీవి తంతో విడదీయలేని అనుబంధం ఉంటుంది.
మన దేశ స్వాతంత్ర పోరాట సమయంలో న్యాయవాదుల పాత్ర చాలా క్రియాశీలమైనది. వారి ఆలోచనలు, కార్యాలు, త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం. అలాంటి న్యాయవాదులకు సరైన భద్రత, రక్షణ, గౌరవం కల్పించాల్సిన బాధ్యత మన సభ్యసమాజంలో ప్రతి ఒక్కరిదీ. న్యాయవాదులు కక్షిదారులకు న్యాయం చేకూర్చే విధిలో ఉంటూ న్యాయాన్ని అందించాలనే ఒక బృహత్తర కార్యంలో అహర్నిశలు పని చేస్తుంటారు. ప్రజాప్రయోజనాలకోసం, కక్షిదార్లకు న్యాయం చేకూర్చడానికి తమ అమూల్యమైన సమయాన్ని, మేధోశక్తిని వెచ్చిస్తూ ఎంతో అంకితభావంతో పని చేస్తూంటారు. ఒక గురుతర బాధ్యతతో తమ సేవలను సమాజ శ్రేయస్సుకు వెచ్చించేవారు న్యాయవాదులు.
తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు ఆయన సతీమణి నాగమణిని రోడ్డు మార్గంలో వెళుతుండగా అడ్డగించి అత్యంత పాశవికంగా వధిం చడం యావత్ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. గట్టు వామనరావు తన స్వగ్రామం మంథని నియోజకవర్గంలో ఉన్న గుంజపడుగు గ్రామంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై ఒక గ్రామస్తుడిగా, వృత్తిరీత్యా ఒక న్యాయవాదిగా అడ్డుకొని ప్రశ్నించేసరికి అక్కడి స్థానిక రాజకీయనాయకులకు మింగుడు పడకుండా పోయింది. వారు చేస్తున్న అక్రమాలపై, అన్యాయాలపై, ఆరాతీస్తూ, ప్రజాప్రయోజనాల వాజ్యాలు, సివిల్, క్రిమినల్ కేసుల ద్వారా చట్టపరంగా, న్యాయపరంగా వారి దురాక్రమణలను నిలువరిస్తుండటమే గట్టు వామనరావు దంపతుల తప్పయిపోయింది. న్యాయపరంగా ఆ కేసులను ఎదుర్కునే శక్తి లేక దుండగులు నిరాయుధులైన వారిని హత్య చేశారు.
వామనరావు దంపతులు తమపై దాడి జరగనుందని ముందే ఊహించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించవలసినదిగా స్థానిక పోలీసులను కోరినా వారు పట్టించుకోకపోవడంతో నిందితులకు మరింత ఊతమిచ్చినట్టయ్యింది. స్థానిక పోలీసులు సరైన సమయంలో చర్యతీసుకుని ఉంటే ఈరోజు గట్టు వామనరావు దంపతులు బతికి ఉండేవారేమో మరి. ప్రజల ప్రాణాలకు అండగా తాము ఉన్నామని భరోసా కల్పించే రక్షకభట వ్యవస్థ సరైన సమయంలో, జవాబుదారిగా వ్యవహరించి ఉంటే ఈరోజు ఈ దారుణాన్ని చూసివుండేవాళ్లం కాదు. ఒక మహిళా న్యాయవాదిని అత్యంత అమానుషంగా హత్య చేయటమే దారుణం కాగా, ఈ హత్యోదంతం జరుగుతున్నప్పుడు అటుగా వెళుతున్న రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు, ఇతర వాహనదారులు చోద్యం చూస్తూ కూర్చోవడం షాక్ కలిగిస్తోంది.
గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో ఎటువంటి భేషజాలు లేకుండా.. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎంతటివారైనాసరే కఠిన శిక్షను విధించి అతి త్వరలో వాటిని అమలు చేసేలా చర్యలను తీసుకోవాలి. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే విధంగా కేసును సీబీఐకి అప్పగిస్తే దోషులందరికి శిక్షపడేలా చేయవచ్చు. న్యాయవాదులపై ఇలాంటి నేరాలు పునరావృత్తం కాకుండా ఉండటానికి న్యాయవాదుల రక్షణ చట్టంను తీసుకువచ్చి అమలు చేయాలి. ప్రజాప్రయోజన వాజ్యాల రూపంలో అన్యాయాలను ప్రశ్నించే గొంతుకలను కాలరాస్తున్న నేరగాళ్ళను అన్ని పార్టీలనుండి బహిష్కరించి వారి కార్యకలాపాలపై డేగ కన్ను వేసి ఉంచే బాధ్యత ప్రతి ఒక్క రాజకీయపార్టీపై ఉంది. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రాజకీయపార్టీ సభ్యులందరికి క్రమశిక్షణా తరగతులను నిర్వహిం చాలి. సమాజ శ్రేయస్సుకు ఏ రకమైన విలువలతో కృషి చేయాలో, అలాంటి మంచి విలువలతో కూడిన రాజకీయ శిక్షణాతరగతులను బోధించే సంస్కరణలకు ప్రతి రాజకీయ పార్టీ పూనుకోవలసి ఉంది.
కె. శివచరణ్
అడ్వకేట్
మొబైల్ : 95158 90088
Comments
Please login to add a commentAdd a comment