ఆ చిత్రాలను చూస్తే మన కనులకు ఆహ్లాదం మన మనసుకు ఆనం దం. సప్తవర్ణ సోయగాలు బొమ్మలుగా సాక్షాత్కరిస్తాయి. విశాలంగా రెక్కలార్చిన పక్షులూ, శరవేగంగా పరుగులెత్తే జింకలూ ఎలా కాన్వా స్‌పై రంగుల్లో నిలిచిపోతాయో, గలగల సెలయేరులూ గంగానది ప్రవా హాలు కళ్ళ ముందు నిలుస్తాయి. అభిజ్ఞాన శాకుంతల కావ్యమైనా, రామాయణ భారత భాగవతాది కథలైనా వారి కుంచె విన్యాసాల్లో ఒదిగిపోతాయి. కోతుల నాడించే మదారి అయినా, పల్లెటూరి జంట అయినా, అరకు లోయలో అందాలైనా వారి బొమ్మల్లో గమ్మున కూర్చుంటాయి.
వీరనారి ఝాన్సీ రాణీ, మహా పరాక్రమశాలి మహారాణి రుద్రమదేవీ పౌరుషంగా నిలబడతారు. నన్నయ్య, పోతన, వేమన ఇదిగో మేము ఇలా ఉంటాం అంటూ చిత్రాలై వస్తారు. ప్రకృతి చిత్రాల సోయగాల నుండి, సంప్ర దాయ చిత్రాల ఆలోచనల నుండి, సామాజిక చింతన చేతనత్వం వరకు కొండపల్లి శేషగిరి రావు 40వ దశకం నుండి, 2000వ దశకం వరకు 70 ఏళ్ళు చిత్ర కళా జగత్తుకు నిలువెత్తు చిత్రమై నిలిచారు.
కొండపల్లి శేషగిరిరావు 1924 జనవరి 27న వరంగల్ జిల్లా మానుకోట దగ్గర ఉన్న పెనుగొండ గ్రామంలో జన్మించారు. పుట్టింది సంపద గల ఇల్లే అయినా, పదేళ్ల బాలుడు అయ్యేసరికి అనివార్య కారణాలతో పేదరి కంలో పడిపోయింది కుటుంబం. పదవ తర గతి వరకు హనుమకొండలో వారాలబ్బా యిగా బ్రతుకు సాగించి చిత్రకళపై ఉన్న మక్కువతో హైదరాబాదుకు ధైర్యాన్ని వెంట బెట్టుకొని నడిచారు. కొందరు ప్రముఖుల సహకారంతో మెహదీ నవాజ్ జంగ్ గారికి పరిచయమై వారి సహాయంతో రెడ్డి హాస్టల్లో జాయిన్ అయి, ‘హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్’లో విద్యా ర్థిగా చేరి నూతన అధ్యాయాన్ని తెరుచుకున్నారు. ఐదేళ్ల చదువును పూర్తి చేసుకుని ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై, చిత్రకారునిగా ఎదిగి, మెహదీ ఫర్మా యిషితో కలకత్తాకు పయనమయ్యారు.
రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ’శాంతినికేతన్’లో శేషగిరిరావు విద్యార్థి అయ్యారు. ప్రముఖ చిత్రకారులు నందాలాల్ బోస్, అవనీంధ్ర నాథ్ ఛటోపాధ్యాయుల ప్రియ శిష్యుడూ అయ్యారు. తరువాత తాను చదువుకున్న ఫైనార్ట్స్ కళాశాలలోనే అధ్యాపకునిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపల్‌గా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. రిటైర్ అయిన తర్వాత ఎన్నో వందల చిత్రాలను వేశారు. హైదరాబాద్ పరిసరాలలో కనిపించకుండా పోయిన కొండలు, గుట్టలు శేషగిరిరావు చిత్రించిన చిత్రాల్లో వందలాదిగా దర్శనమిస్తాయి. ఆక్వాటెక్చర్‌లో, కలర్ గ్రాన్యూల్స్ మ్యూరల్ పెయింటింగ్స్‌లో ఎన్నో కొత్త కొత్త ప్రయో గాలు చేశారు. అమీర్ పేట్ దగ్గర మైత్రి భవన్ హుడా కాంప్లెక్స్ ముఖ ద్వారం రెండువైపులా గోడలపై కనిపించే విశ్వరూప సంద ర్శనం, లవకుశులు చేజిక్కించుకున్న అశ్వమేధ యాగాశ్వ పెయిం టింగ్ ఇప్పుడూ చూసి ఆనందించవచ్చు.
‘చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర’ అనే పుస్తకానికి ముందుమాటగా ‘కుంచె సామ్రాజ్య మహారాజు’ అంటూ ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసంలో ‘రావి నారాయణ రెడ్డి పైన నీలా కాశం తేలి, మబ్బుల కాంట్రాస్టులో ఆదర్శమంత ఎత్తెగురు తున్న ఎర్రని జెండా, దానిపై హత్తిన తెల్లని సుత్తి కొడవలి. కళ్ళు నిండిపోతాయి’, ‘నుదుట నామం దిద్దుకుని పరమ సాంప్రదాయకంగా కనిపిస్తూ చిత్రాలు గీసే ఈ పవిత్ర బ్రాహ్మణ మూర్తికి ఎర్రజెండా జబ్బు ఎలా సోకిందబ్బా? అని ఓ నాయకుడిని అడిగాను, ఇలాంటి పెద్ద కమ్యూనిస్టు నాయకులు ఎందరో ఆయనకు జిగిరీ దోస్తులు అని చెప్పాడు’ అన్నారు. ఈ మాటలు శేషగిరి రావు నిండైన సామాజిక మూర్తి మత్వానికి అద్దం పట్టాయి అని చెప్ప వచ్చు.
‘కాకి పడిగెలు’ జానపద చిత్రకళను వెలుగులోకి తెస్తూ రచించిన పరిశోధనాత్మక వ్యాసమైన ‘ఆంధ్రదేశంలో చిత్రకళ’, ‘తెలంగాణాలో చిత్రకళ’, ‘కళ – కల్పనా వైచిత్రి’ వంటి ఎన్నో గొప్ప వ్యాసాలను రచిం చిన కవి, రచయిత కూడా శేషగిరిరావు. ‘చిత్ర శిల్పకళా రామణీ యకము’ వ్యాస సంపుటి వీరి పాండితి గరిమకు నిదర్శనం. మొట్ట మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ‘తెలుగు తల్లి’ విగ్రహానికి రూపకల్పన చేశారు. 2012 జూలై 26న తుది శ్వాస విడిచారు. నేడు ఆ అద్భుత చిత్రకారుడు పుట్టిన రోజు సందర్భంగా శత జయంతి వేడుకలు జరుపుతున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి ‘ రచయిత్రి, సంపాదకురాలు
(నేడు కొండపల్లి శేషగిరిరావు శతజయంతి వేడుక జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాదులో ఉదయం 11 గంటలకు జరగనుంది .)
Comments
Please login to add a commentAdd a comment