ఈ దేశ మూలవాసులైన ద్రావిడులు మొదట్లో ఉత్తర భారతంలో నివసించేవారు. ఆర్యుల రాక తర్వాత వారు దక్షిణ ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని ఒక విలక్షణమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోది చేశారు. దక్షిణ భారతీయ సమాజం వేల సంవత్సరాలుగా అనేక జాతులతో కలిసి జీవన గమనాన్ని సాగించినప్పటికీ వారి సాంస్కృతిక విలక్షణత మాత్రం పుస్తె కట్టడం నుండి పాడె కట్టడం వరకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో ద్రవిడ జాతులు అత్యంత ప్రాచీనమైన సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ ఈ భాషల్లో సాహిత్యం మాత్రం పదో శతాబ్దానికి అటూ ఇటుగా మాత్రమే లభిస్తోంది. తమిళులు మాత్రమే తమ సంగ సాహిత్యం అత్యంత ప్రాచీనమైనదనీ, ఈ సాహిత్యం క్రీ.పూ. 500 నుండి కనిపిస్తున్నదనీ ప్రకటించుకున్నారు. దాదాపుగా క్రీస్తుశకం ఒకటో శతాబ్దం వాడైన శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించి గుదిగుచ్చిన ‘గాథా సప్తశతి’ అనే ప్రాకృత గ్రంథంలో పిల్ల, పొట్ట, కరణి వంటి తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఆనాటికే తెలుగు భాష సమాజంలో బాగా స్థిరపడిన వ్యవహారిక భాషగా ఉందని చెప్పవచ్చు.
అంతేగాకుండా, సాహిత్య భాషలుగా పేరుపడిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రంథ రూపంలో లభిస్తున్న సాహిత్యం కంటే ముందే మౌఖిక రూపంలో నిక్షిప్తమైన జానపద సాహిత్యం పుంఖానుపుంఖాలుగా తప్పకుండా ఉండి ఉంటుంది. ఉదా హరణకు ఇప్పటివరకు ఉన్న ఆధారాలను అనుసరించి తెలుగులో నన్నయ భారతాన్ని ఆది గ్రంథంగా భావిస్తున్నాం. అయితే, నన్నయ తల్లి పాడిన జోల పాట కూడా మౌఖిక వాఙ్మయంలో ఆనాటికే నెలకొని ఉంది అన్న సత్యాన్ని ఇక్కడ మనం మరచిపోకూడదు.
కాబట్టి, నన్నయకు పూర్వమే తెలుగువారికి విస్తృతమైన మౌఖిక సాహిత్యం కూడా తప్పకుండా ఉంది. ఇటువంటి సాహిత్యం మాత్రమే ఒక జాతికి సంబంధించిన సహజమైన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. అందుచేత, పరిశోధకులు ప్రధానంగా మూల వాసులు మౌఖికంగా నిక్షిప్తం చేసిన జానపద సాహిత్యంపై విరివిగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది.
నేటి భాషా శాస్త్ర పరిశోధకుల అంచనాలకు అందినంతవరకు ద్రావిడ భాషలు 27 కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా మరింత పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతే కాకుండా, ఈ ఆదిమ జాతులు అందించిన సంస్కృతిపై తగినంత పరిశోధన జరగలేదు అన్నది నిర్వివాదాంశం. ఈ లోటును భర్తీ చేయడం కోసమే ప్రొఫెసర్ వీఐ సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ అధికారి కాశీ పాండ్యన్ వంటి మేధావులు కొందరు ద్రవిడ సంస్కృతిపై పరిశోధన కోసం ఒక కేంద్రాన్ని మంజూరు చేయాలని నాటి సీఎం నందమూరి తారక రామారావుని కోరారు. అయితే ద్రవిడ సంస్కృతిపై అత్యంత ఆదరాభిమానాలు కలిగిన రామారావు ఏకంగా ఒక విశ్వవిద్యాలయాన్నే మంజూరు చేశారు. అది 1997 అక్టోబర్ 20న కుప్పంలో ప్రారంభమైంది.
ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యాలలో కొన్ని... ద్రవిడ సంస్కృతిలోని ప్రాచీనత, విలక్షణతను, విశిష్టతను లోక విదితం చేయడం; ద్రవిడ సంస్కృతిపై వివిధ భాషల్లో నేటి వరకు జరిగిన పరి శోధనలు, ప్రచురణలను పదిల పరచడం, ప్రచారం చేయడం; తద్వారా, భావ వినిమయానికి, సంస్కృతీ పరిరక్షణకు బాటలు వేయడం. ద్రావిడ కుటుంబానికి చెందిన గిరిజన భాషలతో సహా లిఖిత భాషలు, మాట్లాడే ద్రావిడ భాషల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం; ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన కళలు, హస్తకళలు, అనుబంధ విషయాలలో ఉన్నత స్థాయిలో బోధనను, శిక్షణను అందించడం. భారత దేశం లోపల, వెలుపల ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతి, ఆధునిక శాస్త్రాలు, వైద్యం, ఇంజనీరింగ్, సాంకేతికత వాటి అనుబంధ విషయాలపై అధ్యయనం చేయాలనుకునే వారికి శిక్షణ ఇవ్వడం. విశ్వ విద్యాలయ లక్ష్యాలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఇతర భాషల సాహిత్యాన్ని ద్రావిడ భాషలలోకి అనువదించడం అలాగే ద్రావిడ భాషల సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించడం.
ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇప్పటికే మూలికా వనం ఏర్పాటయింది. ఈ వనంలో ద్రవిడ సాహిత్యంలోనూ, వైద్యంలోనూ కనిపించే చాలా అరుదైన, వివిధ జాతులకు చెందిన 250 వన మూలికలు సేకరించి, పెంచుతున్నారు. జానపద గిరిజన విజ్ఞానాలపై ప్రత్యేకమైన మ్యూజియం ఏర్పాటు చేశారు. అరుదైన తాళ పత్రాలను సేకరించి భద్రపరిచారు. ఒక ద్రావిడ భాషలో ప్రచురితమైన విలువైన పుస్తకాలను, పదకోశాలను ఇతర ద్రావిడ భాషల్లోకి అనువదించి ముద్రించారు.
ద్రావిడ సంస్కృతిని మరింత మూలాల్లోకి వెళ్లి పరిశోధించడానికి తగిన విధంగా ఏపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ‘తెలుగు ప్రాచీన హోదా కేంద్రా’న్ని ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడానికి గట్టి కృషి చేయాలి. అలాగే, తెలుగు అకాడమీని (ప్రస్తుతం తెలుగు సంస్కృత అకాడమీని) కూడా ద్రావిడ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు భాషా సాహిత్యాలపై జరిగిన, జరుగుతున్న విశేష కృషిని సమన్వయం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సంస్కృత సాహిత్యంలో ప్రవేశించిన ద్రావిడ సాంస్కృతిక మూలాలను కూడా మరింత లోతుగా అన్వేషించే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి అంశాలపై చొరవను చూపినట్లయితే ప్రభుత్వం ద్రావిడ సంస్కృతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నట్లవుతుంది. (క్లిక్ చేయండి: ఆనీ ఎర్నౌ.. ఆమె కథ మన జీవిత కథ)
– డాక్టర్ వేలం పళని
సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం
(అక్టోబర్ 20న ద్రావిడ విశ్వవిద్యాలయం రజతోత్సవాల సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment