సుమారు 19,000 మంది టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధ ‘జనరేటివ్ ఏఐ’పై ఆందోళన వెలిబుచ్చుతూ బహిరంగ లేఖ రాశారు. జీపీటీ4 లాంటి టెక్నాలజీలను కనీసం ఆరు నెలల పాటు నిలిపేయాలని కోరారు. మనం చాలా టెక్నాలజీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాం. మానవ క్లోనింగ్, జన్యుమార్పిడి, అణు టెక్నాలజీలు వీటిల్లో కొన్ని మాత్రమే. కానీ ఈ నిలిపివేత వల్ల ప్రపంచం మొత్తానికి దాదాపుగా ఉచితంగా, అది కూడా పర్యావరణ కాలుష్యం లేకుండా అందివ్వగల కేంద్రక సంలీన ప్రక్రియను సాకారం చేసే జీపీటీ7, జీపీటీ8 వంటి అత్యాధునిక జనరేటివ్ ఏఐ మోడళ్లు రావడం ఆలస్యం కాదా? అత్యద్భుత మేధతో మాత్రమే పరిష్కారం కాగల పెద్ద పెద్ద సమస్యల మాటేమిటి? అందుకే దీనిమీద గట్టి చర్చ జరగాలి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఫిలాసఫర్ నిక్ బోస్ట్రోమ్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పేరుతో ఓ పుస్తకం రాశారు. అదొక బెస్ట్ సెల్లర్. అననుకూల వాతావరణంలో మనుగడ కష్టమై బెదిరిపోయిన పిచ్చుకల గుంపు కథ ఇందులో ఉంది. సమస్యలను అధిగమించేందుకు ఆ పిచ్చుకల గుంపు ఓ గుడ్లగూబను దత్తత తీసుకోవాలని నిర్ణయిస్తుంది. ఆ గుడ్లగూబ తమ గూళ్లు కట్టి పెడుతుందనీ, వేటాడేందుకు వచ్చిన జంతువులను భయపెట్టి తరిమే స్తుందనీ, ఆహారాన్ని వెతుక్కునేందుకు సాయపడుతుందనీ ఆ పిచ్చు కలు భావిస్తాయి.
ఇదేదో భలే ఉందే అనుకున్న పిచ్చుకల గుంపు గుడ్లగూబ లేదా దాని గుడ్డు వెతకాలని నిర్ణయించుకుంటాయి. అయితే గుంపులో స్క్రాన్ ఫింకెల్ అనే పిచ్చుక ఈ ఆలోచనతో అంగీ కరించదు. గుంపులో గుడ్లగూబ ఉంటే సమస్యలు తప్పవనీ, అందుకే ముందు ఆ గుడ్లగూబను నియంత్రించడమెలా, మచ్చిక చేసుకోవడం ఎలా అన్నది ఆలోచించాలనీ ప్రతిపాదిస్తుంది. మిగిలిన పిచ్చుకలు ఈ అభ్యంతరాలను పట్టించుకోవు. గుడ్లగూబను వెతికి తెచ్చుకోవడమే పెద్ద విషయమనీ, మచ్చిక, నియంత్రణలను ఆ తరువాత చూసు కోవచ్చుననీ అంటాయి.
సానుకూల ఫలితాలే ఉంటాయా?
అచ్చం ఇలాంటి కథే వాస్తవంలోనూ నడుస్తోంది. కానీ ఇందులో ఇప్పటివరకూ కనీసం 19,000 స్క్రాన్ ఫింకెల్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి... ఈ మధ్యకాలంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఛాట్ జీపీటీపై! టెక్నాలజీ రంగ దిగ్గజాలు ఎలాన్ మస్క్, స్టీవ్ వోజ్నియాక్, స్టూవర్ట్ రస్సెల్ వంటి మరెందరో కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ జీపీటీ4పై, స్థూలంగా ‘జనరేటివ్ ఏఐ’పై తమ ఆందోళన వెలి బుచ్చారు. అక్కడితో ఆగలేదు. ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ‘పవర్‌ఫుల్ ఏ.ఐ. సిస్టమ్స్’ పేరుతో ఓ బహిరంగ లేఖ కూడా రాశారు.
అన్ని సానుకూల ఫలితాలుంటాయనీ, ఎదురయ్యే ప్రమాదాలను నియంత్రించేందుకు అవకాశముంటుందన్న నమ్మకం కుదిరిన తరువాత మాత్రమే జీపీటీ4 లాంటి టెక్నాలజీలను మరింత అభివృద్ధి చేయాలనీ వారు ఈ లేఖలో స్పష్టం చేశారు. జీపీటీ4ను అభివృద్ధి చేస్తున్న సంస్థ ‘ఓపెన్ ఏఐ’ స్వయంగా ‘‘ఏదో ఒకదశలో దీనిపై స్వతంత్ర సమీక్ష ఒకటి జరపడం చాలా ముఖ్యమవుతుంది. జీపీటీ4 లాంటి వ్యవస్థలకు మరింత శిక్షణ ఇచ్చే ముందు ఇది జరగాలి.
అలాగే ఇలాంటి వ్యవస్థల కోసం ఉపయోగించే గరిష్ఠ కంప్యూటింగ్ శక్తిని కూడా మదింపు చేయాలి’’ అని చెప్పడాన్ని వీరు తమ లేఖలో ఉదహరించారు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందన్నది టెక్ దిగ్గజాల అంచనా. ఈ విషయమై కృత్రిమ మేధపై పని చేస్తున్న అన్ని కంపెనీలకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. జీపీటీ4 కంటే ఎక్కువ శక్తిమంతమైన అన్ని కృత్రిమ మేధ వ్యవస్థలకు శిక్షణ ఇవ్వ డాన్ని కనీసం ఆరునెలలు ఆపాలనీ, అది వెంటనే జరగాలనీ కోరారు. అలా సాధ్యం కాని పక్షంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కూడా సూచించారు. (అయితే ‘ట్విట్టర్’ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఒక ఏఐ వేదిక ప్రారంభించనున్నట్టూ, దానికి ట్రూత్ జీపీటీ అని పేరు పెడు తున్నట్టూ వెల్లడించడం గమనార్హం).
బోస్ట్రోమ్ పిచ్చుకల కథకూ, దీనికీ కొంచెం తేడా ఉందంటారు ‘న్యూయార్క్ టైమ్స్’ కాలమిస్ట్ రాస్ డౌదాట్. పిచ్చుకలకు కనీసం గుడ్లగూబ ఎలా ఉంటుంది, ఏ రకమైన హాని చేయగలదన్న విష యమైనా తెలుసుననీ, జీపీటీ4 వంటి కృత్రిమ మేధ విషయంలో మనకు ఆమాత్రం కూడా తెలియదనీ వివరించారు. ఐఫోన్ , ఫేస్‌బుక్, టిక్‌టోక్‌లు అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా వాటితోనూ కొన్ని దుష్ప్రభావాలు ఉండగలవని ఎవరు ఊహించారు?
ఆచితూచి వ్యవహరించాల్సిన టెక్నాలజీలు జీపీటీ4 లాంటి జనరేటివ్ ఏఐ టెక్నాలజీ అతితక్కువ సమయంలో అత్యద్భుతమైన ఫలితాలను ఎలా ప్రదర్శిస్తోందో టెక్ కంపెనీలకు సైతం ఇంకా తెలియకపోవడం గమనార్హం. ‘‘కొంచెం జాగ్ర త్తగా ఉండక తప్పదు. దీని (ఏఐ) గురించి మనమూ భయపడు తున్నామని తెలిస్తే ప్రజలు కొంత సంతోషంగా ఫీల్ అవుతారు’’ అంటారు ‘ఓపెన్ ఏఐ’ సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్ . ఇదేదో అమాయ కమైన చిన్న పిచ్చుక లాంటి వ్యవహారం కాదు, ప్రమాదకరమైనది అని ఆయన స్పష్టంగా హెచ్చరించారు.
టెక్ దిగ్గజాలు రాసిన బహిరంగ లేఖలో ఒక్క విషయాన్నయితే అంగీకరించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో మనం చాలా టెక్నా లజీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాం. కొన్నింటి పురోగతిని నిలిపివేసే ప్రయత్నమూ చేశాం. మానవ క్లోనింగ్, జన్యుమార్పిడి టెక్నాలజీలు వీటిల్లో కొన్ని మాత్రమే. భూమండలాన్ని ధ్వంసం చేసే సామర్థ్యమున్న రసాయన, జీవాయుధాలు, అణ్వస్త్ర టెక్నాలజీలను కూడా అడ్డుకున్నాం. అణ్వస్త్ర టెక్నాలజీనే తీసుకుంటే... శక్తిమంతమైన కృత్రిమ మేధలాగే, అణువును విభజించడంలో లాభాలెన్నో, నష్టాలూ అన్నే.
అనంతమైన విద్యుత్తు ఇవ్వగలగడం సానుకూల అంశమైతే, విధ్వంసం దీనికి మరోవైపున కనిపిస్తుంది. ఈ రెండో రూపాన్ని గుర్తించేందుకు హిరోషిమా, నాగసాకి వంటి భయంకరమైన అణుబాంబు దాడుల్ని చూడాల్సి వచ్చింది. ఈ ఘటన తరువాత దేశాలన్నీ ఒక్కతాటిపై వచ్చి ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం వంటి వాటిద్వారా అణ్వస్త్రాలపై నిషేధం, నియంత్రణలు తేగలిగాయి. తద్వారా మరిన్ని హిరోషిమా, నాగ సాకీలు జరక్కుండా ఇప్పటివరకూ నిరోధించగలిగాం.
అణు టెక్నాలజీకి సంబంధించిన ఇంకో పార్శ్వమూ ఉంది. విధ్వంసం, వినాశనాలకు బెదిరి మనం వాడకాన్ని మరీ పరిమితం చేసేశాం. ఫలితంగా వాతావరణ మార్పులకు కారణమైన శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ముప్పు తప్పించుకునేందుకు ఇంకోముప్పును కొని తెచ్చుకున్నట్టు అన్నమాట!
అత్యాధునిక మోడళ్లను ఆపడమా?
కృత్రిమ మేధ టెక్నాలజీపై ఆరు నెలల విరామం వల్ల ఏం ఫలితం ఉండగలదని చాలామంది ప్రశ్నించవచ్చు. ఒక వేళ ఆరునెలల పాటు నిలిపేసినా చైనా లాంటి దేశాలు దీన్ని అనుసరిస్తాయా? తాత్కాలిక నిలిపివేత వల్ల ప్రపంచం మొత్తానికి దాదాపుగా ఉచితంగా, అది కూడా పర్యావరణ కాలుష్యం అనేది లేకుండా అందివ్వ గల కేంద్రక సంలీన ప్రక్రియను సాకారం చేసే శక్తి ఉన్న జీపీటీ7, జీపీటీ8 వంటి అత్యాధునిక జనరేటివ్ ఏఐ మోడళ్లు రావడం ఆలస్యం కాదా? వాతావరణ మార్పులు మొదలుకొని అత్యద్భుత మేధతో మాత్రమే పరిష్కారం కాగల పెద్ద పెద్ద సమస్యల మాటేమిటి? ఈ ప్రశ్నలపై చర్చోపచర్చలు దీర్ఘకాలం కొనసాగుతాయి.
అందులో సందేహం లేదు. అయితే జనరేటివ్ ఏఐ విషయంలో మనం నైతిక అంశాలపై మొట్టమొదట మాట్లాడుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త జనరేటివ్ ఏఐ మోడళ్లను విడుదల చేసినంత వేగంగా, అత్యవ సరంగా ఈ అంశంపై చర్చ జరగాలన్నది నా అభిప్రాయం. సాధారణ పరిస్థితుల్లోనైతే అత్యంత శక్తిమంతమైన టెక్నాలజీ మదింపునకు అంతర్జాతీయ సంస్థలు బోలెడంత సమయం తీసుకునే అవకాశ ముంది.
అందుకే ప్రభుత్వాలు కలుగజేసుకోవాలి. ఆరునెలల తాత్కాలిక నిషేధం గొప్ప పరిష్కారం కాకపోవచ్చు. కానీ టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నట్టుగా జనరేటివ్ ఏఐ అనే గుడ్లగూబను నియంత్రించడం, మచ్చిక చేసుకోవడం ఎలాగో తెలుసుకున్న తరువాతే మను షులనే పిచ్చుకల గుంపులోకి దాన్ని తీసుకురావడం మేలు. ఈ విషయమై ప్రపంచం స్థిమితంగా ఆలోచించాల్సిన అవసరం, సమయం వచ్చేసింది!
జస్‌ప్రీత్ బింద్రా
వ్యాసకర్త రచయిత; ‘ఏఐ అండ్ ఎథిక్స్’ అంశంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్నాతకోత్తర విద్యను అభ్యసిస్తున్నారు.
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment