మానవాళి సహజవనరుల వినియోగంలో సంయమనం పాటించకపోతే మొత్తం జీవజాతి మనుగడే ప్రమాదంలో పడుతుంది. భూతాపం పెరుగుదలకు విచక్షణా రహితమైన ఇంధన వినియోగం ముఖ్య కారణం. ఈ సంగతిని గుర్తించింది కాబట్టే భారత్ కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్య సాధనలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉంది.
ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్యం వంటివి కర్బన ఉద్గారాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం, ఇంధన పొదుపు సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో... అన్ని ప్రభుత్వ శాఖలలో ఇంధన సంరక్షణా విభాగాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ 89 జారీ చేసింది.
వేగంగా అభివృద్ధి సాధించాలన్న తాపత్రయంతో విచక్షణారహితంగా సహజవనరులను కొల్లగొడుతుండడంతో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోయి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. రానున్న కాలంలో భూతాపోన్నతి 1.5 డిగ్రీలు దాటి 2.6–4.8 డిగ్రీ సెంటిగ్రేడ్‌లకు పెరిగిపోయే అవకాశం ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 నుంచి 45 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వచ్చే 10 ఏళ్ళలో ఇది 480 నుంచి 490 గిగా టన్నులకు చేరే అవకాశం ఉంది. ఈ ఉద్గారాలు 500 గిగా టన్ను లకు మించి పెరిగితే వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభ విస్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల పరి మితిని దాటకూడదనే లక్ష్యంతో కాప్–27 పర్యావరణ సదస్సు నిర్దేశిం చిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించాయి.
కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా శాతానికి చేర్చాలని మన దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వాలు మనకున్న పరిమితమైన ఇంధన వనరులను కాపాడటం, గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన కాలుష్య కారకాలను తగ్గించడంపై దృష్టి పెడు తున్నాయి. ఇంధన భద్రత సాధించడంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తాయి.
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి దోహదపడతాయి. కాలుష్య కారక ఇంధనాలను పునరు త్పాదక ఇంధన వనరులతో భర్తీ చేయడం, ఇంధన కొరతను ఎదుర్కోవటం, పర్యావరణాన్ని కాపాడడం అనేవి.. ఇంధన పరిరక్షణ అత్యంత చవకైన, తక్షణ పరిష్కారాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
విద్యుత్, ఇతర ఇంధన వనరుల ఉత్పత్తిలో సహజ వనరుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. సహజ వనరులను కాపాడుకోవ డంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్యం అత్యంత ప్రయోజన కరంగా ఉంటాయి. విద్యుత్తును ఆదా చేస్తే సహజ వనరులను పెద్ద ఎత్తున పరిరక్షించినట్లే. ఇంధన పరిరక్షణ వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించగలుగుతాం.
ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే, ఆర్థిక ప్రగతిని సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ఆయన ప్రకటించారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్‌ను 2027 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని కూడా ప్రకటించారు. ఇంధన సామర్థ్య కార్య క్రమాలను ప్రోత్సహించడం, ఇంధన పొదుపు సంస్కృతిని పెంపొం దించే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖలలో ఇంధన సంరక్షణ విభాగాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ 89 జారీ చేసింది. అటవీ పర్యావరణ శాఖను పర్యవేక్షిస్తున్న ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కాలుష్యం తగ్గించేందుకు టార్గెట్లను పెట్టడం కూడా మంచి పరిణామమే.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన పొదుపునకు పెద్ద ఎత్తున అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసియెన్సీ గుర్తించింది. రాష్ట్రంలో 2030 నాటికి 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్ (ఎంటీఓఈ) ఇంధనాన్ని పొదుపు చేయా లని రాష్ట్రానికి లక్ష్యంగా నిర్ణయించింది.
ఈ లక్ష్య సాధనకు అవస రమైన అన్ని చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్, పారిశ్రామిక సంస్థలలో ఇంధన సామర్థ్య కార్య క్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. విద్యుత్తు, ఇతర ఇంధన వనరులపై చేసే వ్యయాన్ని తగ్గించడం, విద్యుత్ డిమాండును తగ్గించడంలో ఇంధన సామర్థ్యం తక్షణ, చౌకైన పరిష్కారంగా పేర్కొనవచ్చు.
ఇంధన సామర్థ్యం, ఇంధన సంరక్షణ కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ డిమాండ్ 65,830 మిలియన్ యూనిట్లలో సుమారు 25 శాతం (16,450 ఎంయూ) ఆదా చేసే అవకాశం ఉంది. దీని విలువ సుమారు రూ. 11,480 కోట్లుగా అంచనా వేశారు. ఏపీ ఇప్పటికే ఎంపిక చేసిన భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ‘పాట్’ (పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్) పథకం అమలు చేస్తోంది. దీని వల్ల రాష్ట్రం ఇప్పటికి 0.818 (ఎంటీఓఈ) ఇంధనాన్ని ఆదా చేయగలిగింది.
రాష్ట్రంలో ఇప్ప టికే నిర్వహించిన ఎల్‌ఈడీ వీధి లైట్లు, ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ, పాట్ వంటి కార్యక్రమాల ద్వారా రూ. 3,800 కోట్ల విలువైన దాదాపు 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసింది.
ఇంధన సామర్థ్య రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సులో 29 ఇంధన సామర్థ్య ఫైనాన్సింగ్ ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది. వీటిలో 14 ప్రాజెక్టులకు ఇప్పటికే రూ. 411 కోట్లు పెట్టుబడి వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ అంచనా వేసింది.
మిగిలిన ప్రాజెక్టుల పెట్టుబడి అంచనా వ్యయాన్ని అది త్వరలో ప్రకటించనుంది. ఈ సదస్సులను క్రమం తప్పకుండా నిర్వ హించటం ద్వారా రాష్ట్రానికి ఇంధన సామర్థ్య పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దేశంలో తొలిసారిగా ఏపీ నిర్వహించిన ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తరహా సదస్సులు నిర్వహించడానికి బీఈఈ సమాయ త్తమైంది.
ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ఉన్న విస్తృత ప్రయోజనాల దృష్ట్యా – ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రజ ల్లోనూ ఇంధన పరిరక్షణ, ఇంధన పొదుపు ఆవశ్యకతపై పెద్దఎత్తున అవగా హన కల్పించే లక్ష్యంతో ఈ నెల 14 నుండి 20 వరకు జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను జరుపుకొంటున్నాం. దీనిలో వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులను, స్వయం సహాయక సంఘాలను భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఇంధన పొదుపు, ఇంధన భద్రత సాధించే ప్రయత్నంలో రాష్ట్రం లోని ప్రతి పౌరుడినీ భాగస్వాములుగా చేయాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రజల్లో ఇంధన పొదుపు జీవన శైలిపై అవగాహన కల్పిం చడం, తద్వారా కలిగే ప్రయోజనాలను వివరించేందుకు వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇళ్లలో విద్యుత్ వృథాను అరికట్టడం ఒక భాధ్యతగా భావించాలి.
వినియోగంలో లేనపుడు లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం, ఎయిర్ కండీషనర్ 24 డిగ్రీల వద్ద సెట్ చేయడం వంటి పొదుపు చిట్కాలను తప్పక పాటించాలి. ఎల్‌ఈడీ లైట్లు, ట్యూబ్ లైట్లు, స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలను వినియోగించడంతో విద్యుత్ ఆదా అవుతుంది.
ఒక యూనిట్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే 800 గ్రాముల బొగ్గు అవసరం. దీని వల్ల 700 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ వెలువ డుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రజానీకాన్ని ఇంధన సామర్థ్య కార్యకలాపాలలో భాగస్వా ములుగా చేయడం; ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రవేశపెట్టడం, ఇంధన పొదుపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలుచేసే విధంగా ఏపీఎస్‌ఈసీఎం ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేస్తోంది.
రాష్ట్రం విద్యుత్ వినియోగంలో 25 శాతం పొదుపు సాధించడమే ఈ రోడ్ మ్యాప్ లక్ష్యం. రాష్ట్రాన్ని ఇంధన పొదుపులో దేశానికి ఆదర్శంగా నిలిపేలా చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వాములమవుదాం.
ఎ. చంద్రశేఖర రెడ్డి
వ్యాసకర్త సీఈఓ, ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్
(ఇంధన పొదుపులో ఏపీ ప్రభుత్వం రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు అందుకుంటున్న సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment