సర్దుకుపోతేనే మణిపూర్‌లో శాంతి! | Sakshi Guest Column On Manipur Issue | Sakshi
Sakshi News home page

సర్దుకుపోతేనే మణిపూర్‌లో శాంతి!

Published Fri, Jun 23 2023 12:26 AM | Last Updated on Fri, Jun 23 2023 5:35 AM

Sakshi Guest Column On Manipur Issue

నెలన్నరగా మణిపూర్‌ మండుతూనే ఉంది. తీవ్రత తగ్గినప్పటికీ హింసాత్మక ఘటనలు పూర్తిగా ఆగిపోలేదు. ఇప్పటివరకూ సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది సహాయ శిబిరాల్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అటు మైతైలతో పాటు ఇటు కుకీలు కూడా ప్రభుత్వ బలగాలు ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నాయన్న అభిప్రాయంలో ఉండటం. ప్రస్తుతం మణిపూర్‌ పరిస్థితిపై ఉన్న సాధారణ అంచనా ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాల్లో దిక్కుతోచడం లేదు. కేంద్రానికి నిబద్ధత కరవైంది! ప్రస్తుత సంక్షోభం మణిపూర్‌లోని తెగల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాలను మరోసారి ప్రపంచానికి ఎత్తి చూపుతోంది.

మణిపూర్‌లో చీకటి రోజులు నడుస్తు న్నాయి. నెలన్నరగా రెండు ప్రధాన తెగలైన మైతై, కుకీల మధ్య  ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న సూచనలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. మొదలైనప్పటి స్థాయిలో కాకపోయినా అక్కడక్కడా రెండు తెగలకు చెందిన గ్రామాలున్న చోట హింస చోటు చేసుకుంటోంది. ఒకప్పుడు ఆప్తమిత్రుల్లా ఉన్న ఈ తెగలిప్పుడు బద్ధశత్రువుల్లా మారిపోయాయి. 

మణిపూర్‌లో ఘర్షణలు మొదలైన తరువాత ఇప్పటివరకూ సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోగా, 45 వేల మంది రిలీఫ్‌ క్యాంపుల్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాంతి సాధనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న భావన ఏర్పడటంతో... క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్న వారిలో నిస్పృహ పెరిగిపోతోంది. ఇప్పుడిది ఆగ్రహంగా పరిణమించి మరిన్ని హింసాత్మక ఘటనలకూ, ఘర్షణ లకూ దారితీసే అవకాశం ఏర్పడుతోంది. ఈ ఆగ్రహం అధికారంలో ఉన్న వారిపైకి మళ్లినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం మణిపూర్‌ పరిస్థితిపై ఉన్న సాధారణ అంచనా ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాల్లో దిక్కుతోచడం లేదు. కేంద్రానికి నిబద్ధత కరవైంది!

ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అటు మైతైలతో పాటు ఇటు కుకీలు కూడా ప్రభుత్వ బలగాలు ఒక పక్షానికి కొమ్ము కాస్తున్నాయన్న అభిప్రాయంలో ఉండటం. రాష్ట్ర ప్రభుత్వ పోలీసు కాని స్టేబుళ్లు, సాయుధ మణిపూర్‌ రైఫిల్స్‌ బలగాలు మైతైలకు అనుకూ లంగా పనిచేస్తున్నాయని అనుకుంటూంటే... కేంద్ర పారామిలటరీ బలగాలు, ముఖ్యంగా అస్సామ్‌ రైఫిల్స్‌ కుకీలకు వత్తాసు పలుకు తున్నాయని భావిస్తున్నారు. వాస్తవానికి జూన్  రెండున జరిగిన ఘర్షణలు పూర్తిగా నివారించదగ్గవి. మణిపూర్‌ పోలీస్‌ కమాండోలు, అసాం రైఫిల్స్‌కు చెందిన ఒక యూనిట్‌ మధ్య జరిగిన ఈ ఘర్షణ దాదాపుగా కాల్పులకు దారితీసింది.

ఈ ఘటనలో అస్సా రైఫిల్స్‌కు చెందిన ఒక బృందం రెచ్చగొట్టే విధంగా సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కార్యాలయ దారిని మూసేసింది. గేట్‌ దగ్గర ఇద్దరు సాయుధ సిబ్బందిని నియమించింది. పరిస్థితి చేయిదాటే సమయానికి ఈబృందం వెనక్కు తగ్గింది. ఈ ఘటన మొత్తం ఒక వ్యక్తి తాలూకూ అసూయ కావచ్చు లేదా ఇంకేదైనా స్థానిక కారణం కావచ్చు.  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మణిపూర్‌ పర్యటన జరిగిన రెండు రోజుల తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 

అమిత్‌ షా హామీ ఇచ్చిన విధంగానే గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ లాంబా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు కావడం స్వాగతించాల్సిన విషయం. మణిపూర్‌ సంక్షోభానికి కారణాలను కనుక్కోవడం, ఎవరి బాధ్యత ఏమిటో తేల్చడం ఈ కమిటీ ఉద్దేశం. అయితే రాష్ట్ర గవర్నర్‌ అన సూయ యుకీ నేతృత్వంలో 51 మందితో ఒక శాంతి కమిటీ ఏర్పాటు చేసే ప్రయత్నం మాత్రం అందరూ ఊహించినట్టుగానే బాలారి ష్టాలను ఎదుర్కొంటోంది. కమిటీ కోసం ఎంపిక చేసినవారు క్రమంగా విరమించుకుంటున్నారు. రాజకీయ ప్రమేయం ఉన్నవారు ఎక్కువవు తున్నందుకే విరమించుకుంటున్నట్లు చెబుతున్నారు. 

కమిటీలోని కుకీ సభ్యులు ముఖ్యమంత్రి ఎన్ . బీరేన్  సింగ్‌ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభానికి ఆయనే సూత్రధారి అనీ, ఆయన కుకీ వ్యతిరేకి అనీ వారి వాదన. ఇంకో విషయం... కమిటీలో ముఖ్యమంత్రిని చేర్చడం ద్వారా ఆయన్ని పదవి నుంచి తప్పించే ఉద్దేశమేమీ తమకు లేదని కేంద్రం చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలూ లేవని తేలిపోయింది. రాష్ట్రంలోని చాలామంది ఈ రెండింటిలో ఏదో ఒకటి సంభవమన్న అంచనాలో ఉండటం గమనార్హం. బీజేపీ పాలిత రాష్ట్రం కావడం వల్లనే ఇవి ఏవీ జరగడం లేదేమో!

ప్రస్తుత సంక్షోభం మణిపూర్‌లోని ఆదిమ తెగల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాలను మరోసారి ఎత్తి చూపుతోంది. ఇది కేవలం తెగల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు మాత్రమే అనుకునేందుకు లేదు. కొండలు, లోయల్లో నివసించే వారి మధ్య ఘర్షణలుగానూ చూడవచ్చు. ఈ విషయంలో నాగాలు, కుకీలు ఒక వైపున ఉంటే మైతైలు ఇంకోవైపున ఉన్నారు. మణిపూర్‌ మొత్తమ్మీద 90 శాతం పర్వత ప్రాంతమే. షెడ్యూల్డ్‌ తెగల కోసం ప్రత్యేకమైన ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. లోయ ప్రాంతాలు రాష్ట్ర భూభా గంలో పది శాతం.

గిరిజన తెగలకు చెందని మైతైల నివాస ప్రాంతాలు ఇవే. ఇటీవలి కాలంలో మైతైల్లో అధికశాతం మంది తమకూ షెడ్యూల్డ్‌ తెగల గుర్తింపు కాంక్షిస్తున్నారు. నాగాలు, కుకీలు దీన్ని వ్యతిరేకిస్తు న్నారు. ఈ వ్యతిరేకత వల్లనే పరిస్థితి ఈ స్థాయికి చేరింది అనేందుకు అవకాశం లేదు. ఎందుకంటే మైతైల డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ మే 3న నిర్వహించిన ర్యాలీలో నాగాలు తమ సంబంధాల హద్దులను దాటలేదు. కుకీలు మాత్రం చురాచంద్రపూర్‌ జిల్లాలో మైతైలున్న ప్రాంతాలపై దాడులు చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. కుకీ యుద్ధ స్మారకం ఒక దాన్ని మైతైలు తగలబెట్టేశారన్న వదంతులతో ఈ విధ్వంసం జరగడం గమనార్హం. 

మైతైలపై కలిసి యుద్ధం చేద్దామని కుకీలు కొన్ని సంకేతాలు పంపినా నాగాలు ప్రస్తుతానికి తటస్థంగానే ఉన్నారు. ఈ తటస్థ వైఖరితోనూ కొన్ని చిక్కులున్నాయి. జూన్  9న రాష్ట్రానికి చెందిన పది మంది నాగా ఎమ్మెల్యేలు సంప్రదింపుల కోసం అమిత్‌ షాను కలిశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు తమ వంతు సాయం అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే కుకీల కోసం ప్రత్యేక పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. దీనికోసం నాగాల భూముల జోలికి మాత్రం రావద్దని వీరు ప్రతిపాదించారు.

మణిపూర్‌లోని పర్వతప్రాంత జిల్లాల్లో మొత్తంగా కుకీ గ్రామాలు విస్తరించి ఉన్నాయి. నాగాలు కూడా చురాచంద్రపూర్‌ మినహా మిగిలిన పర్వతప్రాంత జిల్లాలు తమ మూల నివాసంగా భావిస్తారు. అంటే ఆచరణలో కుకీల డిమాండ్‌ ఏమాత్రం ఆమోదయోగ్యం కానిది అవుతుంది. 1990లో యునైటెడ్‌  నాగా కౌన్సిల్‌ కుకీ గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. నాగాల దృష్టిలో కుకీలు తమ గ్రామాల్లో ఉంటున్న కిరాయిదారులు. ఈ తీర్మానం చివరకు ఘర్షణ లకు దారి తీయడమే కాకుండా, 800 మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైంది.

తటస్థ వైఖరి అనేది హెర్బెర్ట్‌ బి.స్వోప్‌ కథనం ఒకదాన్ని గుర్తు చేస్తోంది. పులిట్జర్‌ ప్రైజ్‌ అవార్డు పొందిన కొన్ని కథనాలను స్వోప్‌ జర్మనీ నుంచి రాసేవారు. ‘న్యూయార్క్‌ వరల్డ్‌’లో ప్రచురితమ య్యాయి. ఆ కాలంలో అమెరికన్లు తటస్థ వైఖరి ప్రకటించడంపై జర్మన్లు గుర్రుగా ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా పాల్గొనేందుకు ఏడాది ముందు ముచ్చట ఇది. అమెరికన్ల తటస్థత జర్మన్ల విషయంలో మెదడు సంబంధి అనీ, మిత్రపక్షాలతో వర్తన మాత్రం హృదయ సంబంధి అనీ జర్మన్లు భావించేవారు. నాగాల పరిస్థితి అలాగే ఉంది.

కుకీల పక్షం వహించబోమని చెబుతూనే, మైతైలతో తమకు భేదాభిప్రాయాలు లేవని అనుకోవద్దంటున్నారు. ప్రస్తుతం మణిపూర్‌ ప్రజల ముందున్న సవాలు ఏమిటంటే... ఘర్షణ పూరిత వాతావరణం తొలగిపోయిన వెంటనే, పరిపాలన వ్యవస్థ నిర్మాణంలో ఏకాభిప్రాయానికి కృషి చేయడం. అప్పుడే దాదాపు 34 భాషాపరమైన సమూహాలున్న మణిపూర్‌లో శాంతి స్థాపన సాధ్యమ వుతుంది. పరస్పరం సహకరించుకోవడం, సర్దుకుపోవడం, ఉమ్మడి విధిని అంగీకరించడం ఇప్పుడు జరగాల్సిన పనులు!

ప్రదీప్‌ ఫన్ జౌబమ్‌ 
వ్యాసకర్త ‘ఇంఫాల్‌ ఫ్రీ ప్రెస్‌’ సంపాదకుడు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement