ఆధునిక జాతీయవాదమే గెలిచింది! | Sakshi Guest Column On Modern nationalism | Sakshi
Sakshi News home page

ఆధునిక జాతీయవాదమే గెలిచింది!

Published Thu, Jun 13 2024 12:39 AM | Last Updated on Thu, Jun 13 2024 12:39 AM

Sakshi Guest Column On Modern nationalism

విశ్లేషణ

ఏ జాతికైనా ఒక జాతీయవాదం ఉండాలనే మాటలో సందేహం లేదు. కానీ ఆ జాతీయవాదానికి ఆధారం ఏమిటన్నది ప్రశ్న. ఫ్యూడలిజం, రాచరికం కాలమేలినపుడు ఒక ప్రధాన భాష, నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దులు అందుకు పనికొచ్చాయి. జాతీయవాదానికి మతం ఆధారం కావాలనేది సంఘ్‌ పరివార్‌ సిద్ధాంతం. మత ఆధారిత జాతీయ వాదాన్ని భారతీయులు స్వాతంత్య్రోద్యమ సమయంలో గానీ, 1947 నుంచి నేటి వరకు గానీ అమోదించలేదు. మోదీ తిరిగి అధికారానికి వచ్చి ఉండవచ్చుగాక. కానీ బీజేపీ సంపూర్ణమైన మెజారిటీ పొందలేకపోయింది. అంతిమంగా ప్రజలు తమకు కావలసింది ఆధునిక, ప్రజాస్వామిక, అభివృద్ధికర జాతీయవాదం తప్ప, మత ఆధారిత జాతీయవాదం కాదని తేల్చి చెప్పారు.

లోక్‌సభ ఫలితాలు చెప్పిన పాఠాలలో ముఖ్యమైనది ఒకటి చర్చకు రావటం లేదు. మత ఆధారిత జాతీయవాద నిర్మాణం జరగాలనే దృష్టి సరైనది కాదనీ, ప్రజాస్వామ్యాన్ని, అభివృద్ధిని ఆధారం చేసుకుంటూ జాతీయవాద నిర్మాణం జరగాలనే ఆధునిక దృష్టి మాత్రమే సరైనదనీ ప్రజలు తీర్పు చెప్పారు. ఏ జాతికైనా ఒక జాతీయవాదం ఉండాలనే మాటలో సందేహం లేదు. అటువంటి జాతీయవాదానికి ఆధారం కావలసింది ఏమిటన్నది ప్రశ్న. మతం ఆధారం కావాలనేది సంఘ్‌ పరివార్‌కు వందేళ్ల క్రితం 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడినప్పటినుంచి గల సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని ఆ సంస్థ రాజకీయ విభాగాలైన జన సంఘ్, బీజేపీలు ప్రభుత్వాధికారం ద్వారా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాయి. 

నరేంద్ర మోదీ మొదట గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానిగా ఆ ప్రయత్నాలను ఉధృతంగా సాగించారు. ఈ క్రమంలో 2014, 2019 ఎన్నికలు గెలవటంతో, ఇక దేశ ప్రజలు మత ఆధారిత జాతీయవాదాన్ని బలపరుస్తున్నారనే భావన బీజేపీలో, సంఘ్‌ పరివార్‌లో బాగా ఏర్పడసాగింది. ఈ 2024లో కూడా (సంపూర్ణ మెజారిటీతో) గెలిచినట్లయితే ఇక తమ తరహా జాతీయ వాద సిద్ధాంతానికి ఎదురులేదని నమ్మేవారు. వాస్తవానికి అటువంటి అజెండాను ఈ ఎన్నికల తర్వాత మరింత బలంగా ముందుకు తీసుకుపోయేందుకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు కూడా.  కానీ, ఎన్నికలలో ప్రజలు అందుకు విరుద్ధమైన తీర్పునిచ్చారు. 

ప్రపంచంలో మధ్య యుగాల కాలంలో ఫ్యూడలిజం, రాచరికం, మత వ్యవస్థలు కాలమేలినపుడు, నెమ్మదిగా జాతిభావనలు కూడా వచ్చినప్పుడు, జాతీయవాదానికి ఆధారంగా మతం, ఒక ప్రధాన భాష, నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దులు తప్ప మరొకటి కనిపించలేదు వారికి. జాతులు కేంద్రంగా గల ఆయా రాజ్యాలలో వైవిధ్యత తక్కువ. 

ఫ్రెంచ్‌ విప్లవం, రెనైజాన్స్, పారిశ్రామిక విప్లవాల వంటివి గానీ, ఆధునికతకు అనుగుణమైన సామాజికాభివృద్ధి సిద్ధాంతాలు గానీ అప్పటికి లేవు. బ్రిటిష్‌ వలస పాలనలో ఉండిన భారతదేశం విషయానికి వస్తే, ఇక్కడ అత్యధిక ప్రజలు హిందూ అనే ఒక మతానికి చెందిన వారైనా, రాచరికాలు, ఫ్యూడల్‌ వ్యవస్థలే రాజ్యమేలుతుండినా, 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్రోద్యమం అనంతరం మరొక 15–20 సంవత్సరాలు గడిచేసరికి దేశంలో ఆధునిక భావనలు ప్రవేశించసాగాయి. 

అది ఎందుకు, ఏ విధంగా ఏ వర్గాలలో అనే వివరాలను పక్కన ఉంచితే, అటువంటి ఆధునిక, ప్రజాస్వామిక భావనల ప్రతిఫలితమే 1885లో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు. తర్వాత గాంధీజీ రంగ ప్రవేశంతో ఈ భావనలు మరింత ఆధునికం, ప్రజాస్వామికం అయ్యాయి. ఆ సరికి ప్రపంచ దేశాలు కూడా ఆధునిక, ప్రజాస్వామిక, అభివృద్ధి దశలోకి ప్రవేశించాయి. ఆ మొత్తం ధోరణులకు భిన్నంగా, మరికొన్ని సంవత్సరాలు గడిచే సరికి సావర్కార్, ఆర్‌ఎస్‌ఎస్‌లు మత ఆధారిత జాతీయ వాదనను ముందుకు తెచ్చారు.

యధాతథంగా మత ఆధారిత జాతీయ వాదాన్ని భారతీయులు స్వాతంత్య్రోద్యమ సమయంలో గానీ, 1947 నుంచి నేటి వరకు గానీ ఏదశలోనూ అమోదించలేదు. మధ్యలో జరిగిందేమంటే, రాజ్యాంగంలో, చట్టాలలో చెప్పుకున్న తరహా పరిపాలన, అభివృద్ధి, ప్రజాస్వామిక విధివిధానాలలో కాంగ్రెస్‌ తదితర పార్టీలు పదే పదే విఫలమైనందువల్ల మాత్రమే బీజేపీ అనే మరొక పార్టీకి ఆ శూన్యంలోకి ప్రవేశించే అవకాశం లభించింది. 

ఆ విధంగా ప్రత్యామ్నాయ రూపంలో వచ్చిన పార్టీ సందర్భవశాత్తు ఒక మతతత్త్వ పార్టీ అయింది. తమ సిద్ధాంతం ప్రకారం మత ఆధారిత జాతీయవాదాన్ని నిర్మించేందుకు ప్రయత్నించింది. ఎన్నికలలో గెలిచే కొద్దీ, అటువంటి వాదానికే ప్రజామోదం లభిస్తున్నట్లు నమ్మసాగింది. కానీ, నిజానికి, అంతకన్న ముందటి పార్టీల వైఫల్యం వల్ల ఏర్పడిన శూన్యంలో తనది అతి«థి పాత్ర మాత్రమే.

ఈ స్థితి గురించి అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్నున్నాయి. ఒకవేళ బీజేపీ నాయకత్వం ఒక ప్రభుత్వంగా, తమ కన్న ముందటి ప్రభుత్వాలు విఫలమైన లోటుపాట్లను తీర్చి ప్రజలను సంతోషపెట్ట గలిగి ఉంటే, అదే తమ ప్రాథమిక బాధ్యత అని గుర్తించి ఉంటే, హిందూత్వ భావనను అందుకు సమాంతరంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసి ఉంటే, ఆ లక్ష్యానిది రెండవ ప్రాధాన్యతే తప్ప మొదటి ప్రాధాన్యత కాదనుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, ఏమి జరిగేదో చెప్పలేము. 

వాజ్‌పేయి, అద్వానీల హయాం వరకు బహుశా అదే విధమైన వ్యూహంతో వ్యవహిరించినట్లు ఇపుడు వెనుకకు తిరిగి చూస్తే అనిపిస్తుంది. కానీ వారికీ, మోదీకీ స్పష్టమైన తేడాలున్నాయి. వారి వ్యక్తిత్వాలు రూపు తీసుకున్న పరిస్థితులు, గుజరాత్‌ కాలం నుంచి మోదీ వ్యక్తిత్వం రూపు తీసుకున్న పరిస్థితులు వేరు.  

‘హిందూ హృదయ సామ్రాట్‌’ అనే బిరుదును గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సంపాదించుకున్న మోదీ (ఆ బిరుదు తన కన్న ముందు బాల్‌ ఠాకరే, కేశూభాయ్‌ పటేల్‌లకు ఉండేది), దేశాన్ని ఒక మత ఆధారిత జాతీయవాద రాజ్యంగా మార్చివేసే బాధ్యతను ప్రధానమంత్రిగా తన భుజాలపై వేసుకున్నారు. అది కూడా వీలయినంత వేగంగా చతురోపాయాలను ప్రయోగించి అయినా సరే. వాజ్‌పేయి, అద్వానీ వంటి వారికి భిన్నంగా తన నేపథ్యం, వ్యక్తిత్వం, స్వభావం అటువంటివి. అందువల్ల పద్ధతులూ భిన్నమైనవే. ఆ ప్రకారం పదేళ్ళలో ఏమేమి జరిగాయో, చివరకు మొన్నటి ప్రచార సమయంలో ఏమి జరిగిందో తెలిసిందే గనుక ఇక్కడ జాబితాలు అక్కరలేదు. 

అంతిమంగా ప్రజలు తమకు కావలసింది ఆధునిక, ప్రజాస్వామిక, అభివృద్ధికర జాతీయవాదం, అటువంటి వ్యవస్థలే తప్ప, మత ఆధారిత జాతీయవాదం కాదని తేల్చి చెప్పారు. మోదీ తిరిగి అధికారానికి వచ్చి ఉండవచ్చుగాక. కానీ సాక్షాత్తూ రామాలయమే గల ఫైజాబాద్‌ నియోజక వర్గంలో ఓటమి, అయోధ్య డివిజన్‌లోని మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలలో పరాజయం, కాశీపురాధీశుడినని నమ్మిన మోదీ మెజారిటీ సగానికి పైగా పడిపోవటం, హిందూత్వకు గుజరాత్‌ తర్వాతి ప్రయోగశాల అని చాటిన ఉత్తరప్రదేశ్‌లో సీట్లు సగానికి తగ్గిన పరాభవం చెప్తున్నదేమిటి? హిందూ మెజారిటీ దేశానికి కూడా కావలసింది ఆధునిక ప్రజాస్వామిక జాతీయవాదమే తప్ప, మతవాద ఆధారిత జాతీయవాదం కాదు. అంతెందుకు, ఈ 10వ తేదీన జరిగిన యూరోపియన్‌ యూనియన్‌ ఎన్నికల ఫలితాలను చూడండి. మితవాద పార్టీల బలం కొంత పెరిగిన మాట నిజం. కానీ ఆ పార్టీల అజెండాలో ఉన్నవి ఇతర అంశాలే తప్ప మతం కాదు.

మరొక విశేషాన్ని గమనించాలి. మోదీ నాయకత్వాన బీజేపీ బలం పెరుగుతుండిన దశలో కొందరు మేధావులు ‘నిమ్న వర్గాల హిందూయిజం’ (సబ్‌ ఆల్టర్న్‌ హిందూయిజం) అనే సూత్రీకరణలు చేశారు. ఆ వర్గాలు ఆ పార్టీకి ఓటు చేశాయి గనుక వారిలో హిందూత్వ వ్యాపిస్తున్నదని వారి మాట. ఇపుడు ఇందులోనే ఆ వర్గాలు వ్యతిరేకంగా ఓటు చేశాయి. ఇందుకు వారి వివరణ ఏమిటో చూడాలి. వారు గుర్తించవలసిందేమంటే, పైన చెప్పుకున్నట్లు, ఈ వర్గాలు గత ్రçపభుత్వాల వైఫల్యం వల్ల కలిగిన జీవిత సమస్యలతో బీజేపీకి ఓటు చేశారు. 

ఆ పార్టీ విఫలమవుతున్నట్లు అర్థమై ఇపుడు దూరమవుతున్నారు. నిమ్న వర్గాల మత విశ్వాసాలు గానీ, జాతీయతా భావనలు గానీ ఏవిధంగా ఉంటాయో ఈ ఫలితాల వెలుగులో అర్థం చేసుకోవలసి 
ఉంటుంది. అదే విధంగా తిరిగి అధికారానికి వచ్చిన తర్వాత అమలు చేయదలచిన అల్ప సంఖ్యాక వర్గాల వ్యతిరేక చట్టాలు, ఆ వర్గాలపై మరింత విజృంభించాలనుకున్న సంఘ్‌ పరివార్‌ ప్రణాళికల విషయంలో పునరాలోచనలు అవసరమవుతాయి. 

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement