సాంకేతిక అద్భుతాలు చూడవచ్చు | sakshi guest column technology in 2023 | Sakshi
Sakshi News home page

సాంకేతిక అద్భుతాలు చూడవచ్చు

Published Sat, Dec 31 2022 12:39 AM | Last Updated on Sat, Dec 31 2022 5:03 AM

sakshi guest column technology in 2023 - Sakshi

2023లో సాంకేతిక పరిజ్ఞాన పెరుగుదల ఎంత ఉంటుందో ఊహించలేం. న్యాయ, అకౌంట్ల సంబంధిత రంగాల్లో; ఉద్యోగుల ఎంపిక వంటి అంశాల్లో కృత్రిమ మేధను పెద్ద ఎత్తున వాడే అవకాశం ఉంది. టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో 5జీ విప్లవాత్మక మార్పులు తేనుంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఓ సిరీస్‌ పూర్తి సీజన్‌ను ఒక్క నిమిషంలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

గిగాబైట్ల సైజులో ఉండే వైద్యసంబంధిత నివేదికలను ఎక్కడో ఉన్న స్పెషలిస్టు డాక్టరు దగ్గరికి ఇట్టే చేర్చవచ్చు. తద్వారా టెలీమెడిసిన్‌కు మంచి ఊపు వస్తుంది. ఇక విద్యుత్తుతో నడిచే ద్విచక్రవాహనాలతోపాటు నగరంలో సరుకుల రవాణాకు ఉపయోగించే ఆటోరిక్షా, చిన్నసైజు ట్రక్కులు ఎక్కువ కానున్నాయి. 

సాంకేతిక పరిజ్ఞాన రంగం ఈ ఏడాది కొంత స్తబ్ధుగానే గడిచిందని చెప్పాలి. క్రిప్టో కరెన్సీ సుమారు రెండు లక్షల కోట్ల డాలర్ల సంపదను తుడిచి పెట్టేసింది. క్రిప్టో కరెన్సీ ఆది నుంచీ ఎండమావేనని కొందరు వాదించవచ్చు. ‘క్రంచ్‌ బేస్‌’ అంచనాల ప్రకారం వెంచర్‌ క్యాపిటల్స్‌ మద్దతుతో నడుస్తున్న కంపెనీలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సుమారు 290 కోట్ల డాలర్ల నష్టాలు చవిచూశాయి. ఈ రకమైన మందగమన పరిస్థితులు ఇప్పుడప్పుడే సర్దుకుంటా యన్న సూచనలు కనిపించడం లేదు. మరోవైపు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు పెద్ద ఎత్తున పెడుతున్న కోతలూ కొనసాగు తున్నాయి. ఏడాది ముగిసి 2023లోకి అడుగుపెడుతున్న సమ యంలో నేర్చుకున్న పాఠాలను ఒక్కసారి నెమరేసుకుని... భవి ష్యత్తు కోసం ఎదురుచూడాలి.

నా అంచనా ప్రకారం వచ్చే ఏడాది టెక్నాలజీ కంపెనీలకు బాగానే ఉండనుంది. జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని అనుకుంటున్నాను. ప్రపంచ స్థాయిలో స్థూల ఆర్థిక వ్యవస్థ ఒడి దుడుకుల ప్రభావం కొంత ఉన్నప్పటికీ భారత్‌లో ఆర్థిక వ్యవస్థ, మరీ ముఖ్యంగా కార్పొరేట్‌ రంగం డిజిటలీకరణ వేగం పుంజుకుంటూం డటం ద్వారా ఐటీ రంగానికి లాభం చేకూరనుంది. ఈ నేపథ్యంలో భారతీయ దృక్కోణం నుంచి చూస్తే ఐదు రంగాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
ఐటీ సేవల రంగానికి ఢోకా లేదు
ఐటీ సేవల రంగంలోని కంపెనీలు మందగమనం ప్రభావాన్ని దాటేయగలవు. 2000-01 నాటి డాట్‌కామ్‌ సంక్షోభాన్నీ, 2008-09 నాటి ఆర్థిక మాంద్యాన్నీ కూడా గట్టెక్కగలిగిన 2,500 కోట్ల డాలర్ల విలువైన ఐటీ సేవల రంగం ఇప్పటికే అసంఖ్యాకమైన టెక్నాలజీ, బిజినెస్‌ మోడళ్లలో మార్పులను చవిచూసిన విషయం తెలిసిందే. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని ఐటీ సేవల రంగం నిత్యం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. అంతేకాదు, ఈ కాలపు కంపెనీలు కల గనే స్థాయిలో నెట్‌ మార్జిన్లు కూడా 20 శాతం వరకూ నమోదు చేశాయి. ‘టీసీఎస్‌’ను ఉదాహరణగా తీసుకుంటే... 2008-09లో ఈ కంపెనీ 23 శాతం వృద్ధి చెందింది.

అప్పట్లో ఇది కేవలం 600 కోట్ల డాలర్ల కంపెనీ మాత్రమే. ఇప్పుడది ఏకంగా 2,000 కోట్ల డాలర్ల కంపెనీ. అంతేస్థాయిలో రెండంకెల వృద్ధి అంచనాలు వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా నడుస్తున్నప్పుడు కంపెనీలు తమ ఖర్చులు తగ్గించు కునేందుకుగాను ఔట్‌సోర్సింగ్‌ను ఎక్కువ చేస్తాయి. ఇది భారతీయ ఐటీ కంపెనీలకు లాభదాయకం. అంతేకాకుండా, భారతీయ కంపెనీలు క్లౌడ్‌ వంటి ఈ కాలపు టెక్నాలజీల్లోనూ ముందువరసలో ఉండటమే కాకుండా, కంపెనీల డిజిటలీకరణలోనూ కీలకంగా ఎదిగాయి.

దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిజిటల్‌ మౌలిక సదుపాయాలు చక్కగా అమరి ఉన్నాయిప్పుడు. అకౌంట్‌ అగ్రిగేటర్‌ కూడా అందుబాటులోకి రానుంది. ఫలితంగా చిన్న చిన్న వ్యాపా రులకు కూడా రుణాల లభ్యత మెరుగయ్యే అవకాశాలున్నాయి. అలాగే కొంచెం పేద కుటుంబాలకూ... అకౌంట్‌ అగ్రిగేటర్‌ వల్ల రుణాలు తీసుకోవాలని అనుకున్న వారి వివరాలు వారి అనుమతితో ఇతరులకు అందుబాటులోకి వస్తాయి.

దీనివల్ల ఇతర కంపెనీలు మెరుగైన రీతిలో రుణాలు అందించే ప్రయత్నం చేస్తాయి. సమాచార లేమి కారణంగా ఇప్పటివరకూ ఇది సాధ్యం కాలేదు. ఈ రుణ వితరణ పెంపు మొత్తం ఫిన్‌టెక్‌ కంపెనీల ఆధ్వర్యంలోనే జరుగు తుంది కాబట్టి, వినియోగం కూడా పెరుగుతుంది. ఇళ్ల కొనుగోళ్లు, పొదుపు మొత్తాలు ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడులుగా చేరతాయి. ఈ దృష్టితో చూస్తే ఫిన్‌టెక్‌ కంపెనీలపై రానున్న ఏడాది నిత్యం ఓ కన్నేసి ఉండటం అవసరం. 

కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుంది
ఈ ఏడాది జన సామాన్యానికి కూడా కృత్రిమ మేధ తాలూకూ సామర్థ్యాన్ని పరిచయం చేసింది ‘ఓపెన్‌ ఏఐ’ తాలూకూ ‘ఛాట్‌- జీపీటీ’ వేదిక. మెషీన్‌ లెర్నింగ్, కృత్రిమ మేధ తాలూకూ టెక్నా లజీలను విస్తృత స్థాయిలో వాడేందుకు అవకాశం కల్పిస్తాయి ఇలాంటి వేదికలు. మానవ వనరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన రంగాల్లో ఈ ఏడాది కృత్రిమ మేధ వాడకం ఉంటుందన్నది నా అంచనా. న్యాయ, అకౌంట్ల సంబంధిత రంగాలు అన్నమాట!

దీంతో పాటే... ఆర్థిక వ్యవస్థలో మోసాలను పసిగట్టేందుకు; మార్కెటింగ్‌ ఆటోమేషన్, ఉద్యోగుల ఎంపిక, నియామకం వంటి అంశాల్లో కృత్రిమ మేధను పెద్ద ఎత్తున వాడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక స్టార్టప్‌ కంపెనీ గురించి చెప్పాలి. దాని పేరు ‘వాయిస్‌-ఓసీ’. వైద్య సహాయం అవసరమైన వారు కంప్యూటర్‌తో మాట్లాడటం ద్వారా డాక్టర్‌ అపాయింట్‌మెంట్లు బుక్‌ చేసుకోవచ్చు దీంతో. ఆ తరువాత వాట్సాప్‌ ద్వారా సంప్రదింపులు, టెస్ట్‌లు బుక్‌ చేసుకోవం, చెల్లింపులు జరపడం వంటి పనులు చేయవచ్చు. 

విద్యుత్తు వాహనాల జోరు
ఈ ఏడాది విద్యుత్తుతో నడిచే ద్విచక్రవాహనాలతోపాటు నగరంలో సరుకుల రవాణాకు ఉపయోగించే ఆటోరిక్షా, చిన్నసైజు ట్రక్కులు ఎక్కువ కానున్నాయి. ‘రీసెర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ డాట్‌కామ్‌’ అంచనా ప్రకారం విద్యుత్తుతో నడిచే ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు ఏడాదికి 29 శాతం చొప్పున పెరగ నున్నాయి. అది కూడా 2027-28 వరకూ! అయితే మార్కెట్‌ సామర్థ్యం విషయంలో ఇది కూడా చాలా మితమైన అంచనా అని అనుకుంటున్నా.

బ్యాటరీ టెక్నాలజీ మెరుగుపడుతూండటం, ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ విస్తృతమవుతున్న నేపథ్యంలో 2023లో విద్యుత్తుతో నడిచే కార్లకూ డిమాండ్‌ బాగా ఉండే అవకాశముంది. ఇప్పటివరకూ కార్ల అమ్మకాల్లో విద్యుత్తు వాహనాల వాటా 1 - 2 శాతం మాత్రమే ఉన్నప్పటికీ రానున్న సంవత్సరాల్లో ఇది గణ నీయంగా పెరగనుంది. మొత్తమ్మీద చూస్తే 2023లో విద్యుత్తు రవాణా రంగం గుర్తుంచుకోదగ్గ స్థాయి వృద్ధిని సాధించనుంది!

చివరగా... టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో 5జీ విప్లవాత్మక మార్పులు తీసుకురానుందనడం నిస్సందేహం. ఈ నెట్‌వర్క్‌ పెరుగుతున్న కొద్దీ జరిగే మార్పులు మన ఊపిరిని నిలబెట్టే స్థాయిలో ఉంటాయని అనవచ్చు. వీడియోలు, ఇతర మాధ్యమాల వినియోగం ఎంత పెరుగుతుందో ఒక్కసారి ఊహించండి! ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఓ టెలివిజన్‌ సీరియల్‌ పూర్తి సీజన్‌ను ఒక్క నిమిషంలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవడం 5జీ ద్వారా సాధ్యమవుతుంది. గిగాబైట్ల సైజులో ఉండే వైద్యసంబంధిత నివేదికలు (ఎంఆర్‌ఐ వంటివి) ఎక్కడో ఉన్న స్పెషలిస్టు డాక్టరు దగ్గరికి ఇట్టే చేరగలవు. తద్వారా టెలీమెడిసిన్‌కు మంచి ఊపు వచ్చే అవకాశం ఉంటుంది.

ఫేస్‌బుక్‌ మొదలుపెట్టిన వివాదాస్పద మెటావర్స్‌ మళ్లీ పట్టాలెక్కవచ్చు. ఎందుకంటే విని యోగదారుల మనో భావాలు తెలుసుకునేందుకు ఇది మెరుగైన వేదిక అని కంపెనీలు భావిస్తాయి మరి. బ్యాండ్‌విడ్త్‌ అనేది ఒకప్పటి మాదిరిగా అరుదైందో, అపురూపమైందో కాకుండా... కావాల్సిన వారికి కావాల్సినంత లభిస్తుంది. అది కూడా చాలా తక్కువ ధరలో, ఇంకోలా చెప్పాలంటే దాదాపు ఉచితంగా దొరకవచ్చు. వ్యాపారం, వైద్యం, పిల్లల విద్య తదితర అనేక రంగాల్లో ఇది ఎన్నెన్ని మార్పులు తీసుకురాగలదో ఊహించండి!

ఏతావాతా... 2023 సంవత్సరం కొన్ని సవాళ్లు విసరనుంది. అయినప్పటికీ భారతీయుల దృష్టిలోంచి చూస్తే మాత్రం ఎన్నో అద్భు తాల కోసం ఎదురు చూడవచ్చు. డిజిటల్‌ ఇండియా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది మరి!

జైదీప్‌ మెహతా 
వ్యాసకర్త పెట్టుబడిదారు, టెక్నాలజీ రంగ పరిశీలకుడు
(‘మింట్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement