సమాజం ఎంత ఆధునికంగా మారితే ప్రకృతి అంత తీవ్రంగా ధ్వంసం మవుతున్నదనేది చరిత్ర చెబుతున్న పాఠం. అడవులను విచక్షణారహితంగా నరకడం, తిరిగి చెట్లను నాటాలనే బాధ్యతను విస్మరించడం, అవసరానికి మించి ప్లాస్టిక్‌ను వాడటం, కర్బన ఉద్గారాలను తగ్గించలేకపోవటం వంటి వివిధ కారణాల వల్ల పర్యావరణం కలుషితమయ్యి నేడు సమస్త మానవాళిపై కన్నెర్ర చేస్తోంది. దీంతో మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యింది.
నేడు త్రాగడానికి మంచినీరు, శ్వాసించడానికి ఆక్సిజన్ దొరకని ఆందోళనకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది మనం గర్వంగా చెప్పుకునే 5జీ ప్రపంచం. మనమంతా ఈ అవనిపై అతిథులం అనే సత్యాన్ని చాలామంది గ్రహించలేపోతున్నారు. భవిష్యత్ తరాలకు బతుకునీయాలంటే, బతుకు ఉండాలంటే ప్రపంచ దేశాలు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రకృతితో స్నేహం చేయాలి. పచ్చదనాన్ని పరిమళించేలా చేయాలి.
మనం నాటే చెట్ల ఎదుగుదలే మానవ నాగరికత ప్రగతిగా భావించాలి. చెట్లను నాటినట్లు నటించడం మానేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించాలి. జల వనరులను సంరక్షించాలి. అడవులను కాపాడుకోవాలి. సౌర విద్యుత్ వినియోగం పెంచాలి. వాయు కాలుష్యం తగ్గించాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి. ఓజోన్ పొరను కాపాడాలి.
సాంకేతికంగా ఎదుగుతూనే పర్యావరణ పరిరక్షణపై ప్రపంచదేశాలు కలిసి పనిచేయాలి. భావి పౌరులైన విద్యార్థులకు మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. ప్రకృతి ప్రాణంతో ఉంటేనే మనమంతా జీవంతో ఉంటాము. లేదంటే ప్రకృతి ప్రదర్శించే విధ్వంసాన్ని ఆపడం అసాధ్యం. ‘ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది, మన అంతులేని కోరికలను కాద’ని ఏనాడో గాంధీజీ అన్నారు. కాబట్టి మనిషి ప్రకృతిని దురాశతో కొల్లగొట్టి ధ్వంసం చేయకుండా అవసరం మేరకే దానిపై ఆధారపడాలి. అప్పుడు లోకం పచ్చగా ఉంటుంది. – ఫిజిక్స్ అరుణ్ కుమార్, నాగర్ కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment