ఇంకా రహస్య యుద్ధమే విధానమా? | Sakshi Guest Column On terrorist TTP Attacks On Pakistan | Sakshi
Sakshi News home page

ఇంకా రహస్య యుద్ధమే విధానమా?

Published Sat, Aug 5 2023 4:08 AM | Last Updated on Sat, Aug 5 2023 4:08 AM

Sakshi Guest Column On terrorist TTP Attacks On Pakistan

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి. పాకిస్తాన్‌ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్‌–ఎ– తాలిబన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ) భయంకరమైన దాడులను చేస్తోంది. తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్‌ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి దిగజారుతోంది.

అయినా పాకిస్తాన్‌ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి.

పాకిస్తాన్‌ వాయవ్య ప్రాంతంలోని బజౌర్‌ జిల్లాలో జూలై 30న జమీయత్‌ ఉలేమా– ఎ–ఇస్లాం ఫజల్‌ (జేయూఎల్‌–ఎఫ్‌) సమావేశంపై జరిగిన ఉగ్రదాడిలో 50 మందికి పైగా మరణించారు, దాదాపు 200 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్‌ స్టేట్‌ ఖురాసాన్‌ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) ప్రకటించింది.

గతంలో కూడా జేయూఎల్‌–ఎఫ్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్‌ స్టేట్‌ అనేక దాడులు చేసింది. ఈ దాడులకు ప్రధాన కారణాలలో ఒకటి, అఫ్గానిస్తాన్‌ తాలిబన్లతో జేయూఎల్‌–ఎఫ్‌కు ఉన్న అనుబంధం; మరొక కారణం, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి జేయూఎల్‌–ఎఫ్‌ ఇస్తున్న మద్దతును ఇస్లామిక్‌ స్టేట్‌ వ్యతిరేకించడం అని చెప్పాలి.

బలూచిస్థాన్ లోని ఝోబ్‌ ఆయుధాగారంపై ఇటీవల జరిగిన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్‌ సైనికులు మృతి చెందారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద ముఖచిత్రంలో తాజా ప్లేయర్‌ అయిన తెహ్రీక్‌– ఎ–జిహాద్‌ పాకిస్తాన్‌ (టీజేపీ) ఆ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. టీజేపీ, తెహ్రీక్‌–ఎ–తాలిబన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ)తో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. టీటీపీ పాకి స్తాన్‌ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తున్న భయంకరమైన సంస్థ.

తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్‌ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి మరింత దిగజారుతోంది. గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఖైబర్‌ పఖ్తున్ ఖ్వా, బలూచిస్తాన్‌లలో టీటీపీ దాడులు పెరిగాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి.

తాలిబన్లతో చెడిన మైత్రి
అఫ్గానిస్తాన్‌తో పాకిస్తాన్‌ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2021 ఆగస్ట్‌లో కాబూల్‌ను తాలిబన్‌ స్వాధీనం చేసుకున్న తర్వాత మాజీ పౌర, సైనిక నాయకత్వం వ్యూహాత్మక విజయంగా భావించిన దానికి ఇది విరుద్ధంగా నడుస్తోంది. అమెరికా నిష్క్రమణ తర్వాత పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ సంబంధాలలో రెండు సమస్యలు కీలకంగా ఉన్నాయి. మొదటిది, డ్యూరాండ్‌ రేఖను సరిహద్దుగా గుర్తించడానికి తాలిబన్లు విముఖత వ్యక్తం చేయడంతోపాటు, సరిహద్దుల్లో కంచె వేయడాన్ని వారు ప్రతిఘటించడం.

రెండవది, మిలిటెంట్‌ గ్రూపునకు మద్దతు నిచ్చే స్థావరాన్ని విడిచిపెట్టమని పాకిస్తాన్‌ సైన్యం పదే పదే సందేశం పంపినప్పటికీ, టీటీపీని తాలిబన్‌ ప్రోత్సహిస్తోంది. పైగా కాబూల్‌లో ప్రాతినిధ్య పాలన ఓడిపోయిన తర్వాత టీటీపీ గణనీయంగా బల పడింది. తాలిబన్ తో టీటీపీ బలమైన సైద్ధాంతిక (వ్యూహాత్మక) కూటమిని పంచుకున్నందున ఇది ఊహించదగినదే.

టీటీపీ అనేది అఫ్గాన్‌ తాలిబన్లకు సైద్ధాంతిక విస్తరణ. పైగా ఉగ్రవాదంపై అమెరికా సాగించిన యుద్ధ సమయంలో తాలిబన్లకు ఇది మద్దతునిచ్చింది. కాబట్టి తిరిగి సహాయం చేయడం కోసం టీటీపీకి తోడ్పాటును అందించాల్సిన బాధ్యత అఫ్గాన్‌ తాలిబన్లపై ఉంది. అయితే తాలిబన్లు తమ భూభాగంలో టీటీపీ ఉందనడాన్ని ఖండించారు. అంతేకాకుండా అఫ్గాన్‌ గడ్డపై దాడులను చేయరాదని పాకిస్తాన్ ను హెచ్చరించారు కూడా.

అయినప్పటికీ, టీటీపీకి అఫ్గాన్‌ తాలిబన్లు మద్దతు ఇస్తున్నట్లు పాకిస్తాన్‌ సైన్యం గుర్తించింది. పైగా ఈ విషయంలో తదుపరి చర్యపై బలమైన ప్రకటనలను జారీ చేస్తోంది. ఝోబ్‌ దాడి తరువాత, ‘అఫ్గానిస్తాన్‌లో టీటీపీకి అందుబాటులో ఉన్న సురక్షిత స్వర్గ ధామాలు, కార్యాచరణకు చెందిన స్వేచ్ఛపై తీవ్రంగా ఆందోళన
చెందుతున్నట్లు’ పాకిస్తాన్‌ సైన్యం పేర్కొంది. ఇటువంటి దాడులు సహించలేనివనీ, పాకిస్తాన్‌ భద్రతా దళాలు వీటిపై సమర్థవంతంగా ప్రతిస్పందిస్తాయనీ ప్రకటించింది.

ఉ్రగ్ర సంస్థలు ఏకమయ్యే ప్రమాదం
ఐఎస్‌ఐఎల్‌ (దాయెష్‌), అల్‌–ఖైదా, అనుబంధ గ్రూపులు, వ్యక్తులకు సంబంధించి... ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ‘ది ఎనలిటికిల్‌ సపోర్ట్‌ అండ్‌ శాంక్సన్స్‌ మానిటరింగ్‌ టీమ్‌’ సమర్పించిన 32వ నివేదిక టీటీపీ ఒక ప్రాంతీయ ముప్పుగా మారవచ్చని పేర్కొంది. ‘తాలిబన్‌ నియంత్రణలో దాడి ప్రయత్నాలను తప్పించు కుంటూ, అనేక రకాల విదేశీ సమూహాలు ఏకఛత్రంగా పనిచేస్తాయి లేదా ఐక్యమవుతాయి’ అని ఈ నివేదిక తెలిపింది.

అయితే టీటీపీ గురించిన సైన్యం ప్రతిస్పందనపై పుష్కలమైన ఊహాగానాలు ఉన్నాయి. గత సంవత్సరం, పౌర, సైనిక ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు జారీ చేసింది. ఈ సందర్భంలో మూడు ఎంపికలను విశ్లేషించవచ్చు:

ఒకటి: పాకిస్తాన్‌ ప్రభుత్వం టీటీపీని తిరిగి చర్చల బల్ల వద్దకు తీసుకువచ్చి కాల్పుల విరమణకు ప్రయత్నిస్తుంది. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్న గత ప్రభుత్వం టీటీపీ గ్రూప్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నించి 100 మందికి పైగా టీటీపీ ఖైదీలను విడుదల చేసింది. ఇది టీటీపీ గ్రూప్‌ బలాన్ని పెంచింది. ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాని డిమాండ్లపై రాజీ పడేందుకు టీటీపీ ఎలాంటి సంకేతాన్నీ చూపలేదు. తీవ్రవాద దాడుల పెరుగుదలకు ఇమ్రాన్‌ ఖాన్‌ పదే పదే బాధ్యత వహించారని చెప్పవచ్చు. 

రెండు: అఫ్గాన్‌ తాలిబన్ ను పాకిస్తాన్‌ విశ్వాసంలోకి తీసుకుంటుంది. తరువాత గ్రూపును నియంత్రించే బాధ్యత తీసుకుంటుంది. అయితే తాలిబన్, టీటీపీల మధ్య బలమైన సంబంధాలు, తాలిబన్‌ నుండి టీటీపీ ప్రేరణ పొందడం, పైగా వారిని రోల్‌ మోడల్‌గా చూడటం ఈ అవకాశ సాధ్యా సాధ్యాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అయితే, పాకిస్తాన్ లోని అస్థిర పరిస్థితులను బట్టి, ఇది అక్కడి పాలనా వ్యవస్థకు సాధ్యమైన ఎంపికగానే కనిపిస్తోంది.

మూడు: టీటీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతి–తిరుగుబాటు చేయడం. పాక్‌ మిలిటరీ ఇంతకుముందు 2014లో జర్బ్‌–ఎ–అజ్బ్, 2017లో రద్‌–ఉల్‌–ఫసాద్‌ వంటి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించింది. ఇవి టీటీపీ సంఖ్యను, ఉగ్రవాద దాడులను నిర్వహించగల దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి. అయినప్పటికీ ఈ గ్రూప్‌ తనను తాను నిలబెట్టుకుని తాలిబన్‌ మద్దతుతో వృద్ధి చెందింది. అయితే నాలుగు కారణాల వల్ల పాక్‌ సైనిక ప్రతిస్పందనకు అవరోధం ఏర్పడింది. గిరిజన ప్రాంతాల్లో గణనీయమైన స్థానభ్రంశాలు చోటు చేసుకోవడం; భయంకరమైన ఆర్థిక సంక్షోభం (దాంతో పాటు వరదల వల్ల కలిగిన దుఃస్థితి); ఏ సైనిక చర్య అయినా దేశంపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతర చేయడం; అఫ్గాన్‌ తాలిబన్ల నుండి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు అపారంగా ఉండటం.

కుట్రలో భాగమా?
అయితే టీటీపీ గ్రూప్‌ కార్యకలాపాలను నియంత్రించకపోవడం పాక్‌ సైన్య ఉద్దేశపూర్వక కుట్ర చర్యలో భాగమనీ, ఉగ్రవాద వ్యతిరేక సహాయాన్ని అమెరికా నుంచి ఆకర్షించడానికే ఇలా చేస్తున్నారనే  ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఏమైనా పాక్‌ సైన్యం తన ఎంపికలను అప్రమత్తంగా పరిశీలిస్తుండగా, పాకిస్తాన్‌ మాత్రం తన వ్యూహాత్మక ఎంపికల బురదలో చిక్కుకుందనేది వాస్తవం.

పాకిస్తాన్‌ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి.

శాలినీ చావ్లా 
వ్యాసకర్త డిస్టింగ్విష్డ్‌ ఫెలో, సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ పవర్‌ స్టడీస్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement