ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కొంతమంది ముఖ్యమంత్రులది ప్రత్యేక స్థానం. సీఎంలుగా పనిచేసిన వారిలో రాష్ట్రాన్ని ప్రజారంజకంగా, ప్రమోదభరితంగా, ప్రగతిదాయకంగా పరిపాలించిన వారు చరితార్థులవుతారు. వారి పేర్లను జిల్లాల పేర్లగా ప్రకటించి, గౌరవించుకోవటం ఆనవాయితీ. ఆ ఘనత దక్కించుకున్న ముఖ్యమంత్రులు ఇద్దరే ఇద్దరు. వారు ప్రకాశం పంతులు, డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి. ప్రతిపక్షాలకు చెందినవారైనా సరే.. కోరి వచ్చి సాయం అడిగినవారిని, ఆయన నిరాశ పరి చింది ఎన్నడూ లేదు. ముఖ్యమంత్రి సహాయనిధిని నిజ మైన సేవానిధిగా మార్చింది ఆయనే. తనను కలిసారంటే వారి కోరిక క్షణాల్లో నెరవేరేది. క్యాంపు కార్యాలయం సామాన్య ప్రజలతో బారులు తీరి, నిత్యం కిటకిటలాడేది. బడుగు బలహీన వర్గాలవారూ, వ్యాపారులూ, ఉద్యోగులూ ప్రతీ ఒక్కరూ ఆనందంగా జీవించిన కాలమది. ‘మా ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టిన రోజులు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవైతే, అవి పూర్తయిన రోజే నాకు నిజమైన పుట్టినరోజు’’ తన జన్మదినం రోజున వైఎస్సార్ స్పందన ఇది. తెలుగు ప్రజలపైన, రాష్ట్ర భవితవ్యం పైన ఆయనకున్న మమకారం తాలూకు నిలువెత్తు విశ్వరూపం ఇది. గుండెలోతుల్లో నిక్షిప్తమైన ప్రేమాభిమానాలకు నిజరూప దర్శనమిది.
‘‘ప్రతీ పథకాన్నీ ప్రారంభించేముందు లేదా రూపకల్పన చేసేముందు ఈ పనివలన పేదవాడి ముఖంలో వెలుగు నిండుతుందా, వారికి ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుందా అని నన్ను నేను ప్రశ్నించుకుని, తర్వాతే అమలు చేస్తానన్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనా విధానాన్నే వైఎస్ కూడా ఆచరించారన్నది సుస్పష్టం. తన ప్రతీ పథకం ప్రయోజనకరంగా రూపుదిద్దుకుని, ప్రజల మన్ననలను పొందిందంటే అదే కారణం. ఈ రకంగా పుట్టుకొచ్చినవే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి వినూత్న పథకాలు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు! కడుపు నిండకుండానే ఎవరికైనా ఓ పూట గడవచ్చేమో కానీ వైఎస్సార్ పేరు తలవకుండా ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ఒక్కరోజు కూడా గడవదు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన, ఏదో ఒక సందర్భాన ప్రతి వ్యక్తీ ఆయన ప్రస్తావన తెస్తూనే ఉంటారు. ప్రజలు ఆయన్ని ఎంతగా ఆరాధిస్తున్నారో, ఆయన ఆకస్మిక అదృశ్యాన్ని ఎంతటి దుఃఖంగా భావిస్తున్నారో దీన్నిబట్టి అవగతమవుతుంది.
వైఎస్సార్‌ని అర్థంతరంగా కోల్పోయి, వేదనలో ఉన్న ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన విశిష్ట పరిపాలనతో సాంత్వన చేకూరుస్తూ ఆ లోటును తీరుస్తున్నారు. భౌతికంగా ఆయన దూరమైనా, రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుని మానసికంగా మన చెంతనే ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాల పేర్లతో వైఎస్సార్ పేరు కలిసి వుండడం, మరింత శోభనిస్తూ ప్రజల ప్రయోజనాల్ని నెరవేరుస్తూ ఉండటం, మరణించినా ఆయన బ్రతికి ఉన్నారన్నట్లుగా భావిస్తూ, నిరంతరం గుర్తుకు తెచ్చుకోవటం ఆ మహామనిషి సేవాస్ఫూర్తికి మనమిచ్చే ఘనమైన నివాళి.
డా. ఎమ్.వి.జె. భువనేశ్వరరావు, ప్రముఖ కథారచయిత
తెలుగు వెలుగుల రేడు వైఎస్సార్
Published Thu, Jul 8 2021 3:07 AM | Last Updated on Thu, Jul 8 2021 3:07 AM
Comments
Please login to add a commentAdd a comment