ప్రజలకు మేలు చేసే చట్టాల రూప కల్పన బాధ్యతే కాకుండా అన్ని రాజ్యాంగ వ్యవస్థలకు ఆదర్శప్రా యంగా నిలవాల్సిన గురుతర బాధ్యత పార్లమెంట్‌పై ఉంది. భిన్న ఆలోచనల సంఘర్షణతో, మేలిమి చర్చ సంవాదాలతో ఏకాభిప్రాయ సాధన ద్వారా ఆమోదం పొందా ల్సిన కీలక బిల్లులు, యాంత్రికంగా సంఖ్యాబలంతో ఆమోదం పొందడం ప్రజాశ్రేయస్సుకు గొడ్డలిపెట్టు. ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో అత్య ధికశాతం ఆర్డినెన్సులు తగిన చర్చ లేకుండానే చట్టాలుగా రూపొందాయి. కీలక బిల్లులపై సమగ్ర చర్చ లేకుంటే చట్టంలో తప్పులు దొర్లుతాయి. తిరిగి సవరణలు చేయా ల్సిన అవసరం ఏర్పడుతుంది. వ్యవసాయరంగానికి సంబం ధించిన మూడు బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టినపుడు జరిగినంత గందరగోళం గతంలో ఎన్నడూ జరగలేదు. పర్య వసానంగా సభ్యులను సస్పెండ్ చేశారు. తమ భాగస్వామ్య పక్షాలైన అకాలీదళ్, అన్నాడీఎంకే వంటి పార్టీలు సైతం బిల్లును వ్యతిరేకించడాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తేలిగ్గా తీసు కోవడం ఆశ్చర్యం. రైతాంగంలో నెలకొన్న భయాందోళనల్ని తొలగించడానికి, ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ను ఓ చక్కని వేదికగా మలుచుకొని ఉంటే ప్రయోజనం కలిగేది. ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్లనే పాలకపక్షం ఆత్మరక్షణలో పడిపోయిందనే భావన సర్వత్రా వ్యక్తం అయింది.
పార్లమెంట్ సమావేశాలలో దిగజారుతున్న ప్రమా ణాలను దృష్టిలో ఉంచుకొని 1993లో 24 శాశ్వత పార్లమెం టరీ స్టాండింగ్ కమిటీల్ని ఏర్పాటు చేశారు. అయితే, పార్లమెంట్ సమావేశాల మాదిరిగానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు సైతం నామమాత్రంగా పనిచేస్తున్నా యని పలు అధ్యయనాలలో వెల్లడయింది. గత పదేళ్లలో పార్లమెంట్ సమావేశాల సంఖ్య సగటున 67 రోజులకు కుదించుకుపోయింది. పార్లమెంట్ ఏర్పడిన మొదట్లో బడ్జె ట్‌పై సగటున 132 గంటలు చర్చ జరగగా గడచిన దశా బ్దంలో ఆ వ్యవధి 39 గంటలకు క్షీణించింది. 35% బిల్లుల్ని గంటసేపు కూడా చర్చించకుండానే ఆమోదించారు. ప్రభు త్వంలోని కీలకమైన రక్షణ, ఆర్థికం, వ్యవసాయం, గ్రామీణా భివృద్ధి, విదేశీ వ్యవహారాలు, పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్స్, రైల్వేస్ మొదలైన 24 ప్రభుత్వశాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ప్రధానంగా 1) ప్రభుత్వం పార్లమెం ట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల పరిశీలన 2) మంత్రిత్వశాఖలకు జరిపే బడ్జెట్ కేటాయింపులపై వాస్తవిక పరిశీలన 3) నిర్దిష్ట అంశాలపై నివేదికల రూపకల్పన చేస్తాయి. ఈ స్టాండింగ్ కమిటీలలో అధికార, విపక్ష పార్టీల సభ్యులు కలిపి ఒక్కో కమిటీలో 31 మంది వరకు ఉంటారు. 10 మంది రాజ్యసభ నుండి, 21 మంది లోక్‌సభ నుంచి నామినేట్ అవుతారు. పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్స్ వంటి కమిటీలకు చైర్మన్లుగా వివిధ పార్టీల సీనియర్ సభ్యులను నియమించడం మన ప్రజాస్వామ్య విశిష్టత.
ఇటీవల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల కాలవ్యవధిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించాలని కీలక ప్రతిపాదన చేశారు. ఈ నేపథ్యంలోనే స్టాండింగ్ కమిటీలలో సభ్యులుగా ఉన్న వారి హాజరీ ఏవి ధంగా ఉంది, సమావేశాలు సజావుగా సాగుతున్నాయా, లేదా? అనే అంశాలపై ‘ఇండియాస్పెండ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఓ అధ్యయనం జరిపినపుడు విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. ఎన్డీఏ గత ఐదేళ్ల తొలివిడత పాలనలో, అంటే 16వ లోక్‌సభ సమయంలో వ్యవసాయ రంగంపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆ ఐదేళ్లలో గరిష్టంగా 120 గంటలపాటు సమావేశం కాగా, పబ్లిక్ అండర్ టేకింగ్స్ స్టాండింగ్ కమిటీ కనిష్టంగా 40 గంటలు మాత్రమే సమావేశమయ్యింది. 15వ లోక్‌సభ కాలంలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సమావేశ మొత్తం కాలంకంటే 16వ లోక్‌సభ కాలంలో 22% తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ కమిటీలలో ఉండే సభ్యులకు చైర్మన్‌తో సహా అందరికీ విమాన టికెట్లు, హోటల్ వసతి, ఇతర అలవెన్స్‌లు కల్పిస్తున్నప్పటికీ వారి హాజరీ సగటున 70% మించడం లేదని తేలింది. 16వ లోక్ సభలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల పరిశీలనకు 41 బిల్లులు, 331 గ్రాంట్స్ అభ్యర్థనలు, 503 యాక్షన్ టేకెన్ రిపోర్టులు పంపించగా ప్రస్తుత 17వ లోక్‌సభ మొదలై
15 నెలలు కావస్తున్నప్పటికీ ఇంకా పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఏర్పడకపోవడం ఆశ్చర్యం.లాక్‌డౌన్ నుంచి ఆగస్ట్ చివరి వరకూ ఏ ఒక్క స్టాండింగ్ కమిటీ కూడా సమావేశం జరగలేదని వెల్లడయింది. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని స్టాండింగ్ కమిటీ సమావే శాలు నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ కూడా స్కైప్, జూవ్‌ు వంటి సాధనాల ద్వారా పలువురు ఎంపీలు టీవీ చానళ్లు నిర్వహించే చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ, వర్చువల్‌గా నిర్వహించుకునే అవకాశం ఉన్నా స్టాండింగ్ కమిటీల సమా వేశాలను మాత్రం నిర్వహించడం లేదు. ఈ సమావేశాలు జరగనట్లయితే ఆయా మంత్రిత్వశాఖలకు అందించే బడ్జె ట్లను వాస్తవిక ప్రాతిపదికన రూపొందిస్తున్నారా? ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతున్నాయా? సంబంధిత శాఖలో దేనిని ప్రాధాన్యతగా తీసుకున్నారు? తదితర కీలక అంశా లను పరిశీలించే అవకాశం కమిటీలకు లేకుండాపోతుంది.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకున్న విశిష్టత ఏమి టంటే వివిధ బిల్లుల్లో సాంకేతిక అంశాలు ఉన్నట్లయితే వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మార్పులుచేర్పులు సూచించడానికి ఆయా అంశాల్లో నిష్ణాతులైన వ్యక్తుల సేవ లను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ‘బిల్లు’ ఏ వర్గానికైతే లాభం లేదా నష్టం కలిగించే అవకాశం ఉంటుందో ఆ ‘స్టేక్‌హోల్డర్స్’ను పిలిపించుకొని వారి అభిప్రాయాలు స్వీకరిస్తాయి.అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఇటీవలికాలంలో రాజకీయ వైరుధ్యాలు పెరిగిపోవడంతో చాలామంది సభ్యులు స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరుకావడం లేదు. అసమ్మతిని తెలియజేయడానికి కమిటీ సమావేశాలను బహిష్కరించడం అంటే రాజ్యాంగ బాధ్యత నుండి సభ్యులు వెనక్కు మరలడంగానే పరిగణించాలి. పార్లమెంట్ సమా వేశాలు అర్థవంతంగా జరగడానికి అన్ని పార్టీలు బాధ్యత స్వీకరించాలి. పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యుల చర్చ లకు ప్రసార మాధ్యమాల్లో అధిక ప్రాధాన్యం కల్పించాలి. పార్లమెంట్ ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తే ప్రజాస్వా మ్యానికి అంత మేలు జరుగుతుంది.
డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ప్రభుత్వ చీఫ్ విప్,
ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్
Comments
Please login to add a commentAdd a comment