షరతులన్నింటికీ రష్యా అంగీకరిస్తే తప్ప చర్చల ప్రసక్తి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వాదిస్తూ వచ్చారు. స్విట్జర్లాండ్ శాంతి సమావేశాలకు రష్యాను ఆహ్వానించలేదు. అలాంటిది రష్యాతో చర్చలు అవసరం కావచ్చునని అన్నారు. అంతేనా? నవంబరులో నిర్వహించనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రతినిధులను పంపవలసిందిగా రష్యాను కోరారు. ఆ రాయబారం కోసమే తన విదేశాంగ మంత్రిని చైనా పంపారు. ఇంతకూ జెలెన్‌స్కీ ఎందుకు చర్చలంటున్నారు? యుద్ధంలో రష్యాది పైచేయి అవుతోంది. ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. పాశ్చాత్య దేశాలు పైకి ఏమన్నా, అంతర్గతంగా విముఖత పెరుగుతోంది. ఈ తరహా సహాయాలకు వ్యతిరేకి అయిన ట్రంప్ అధికారానికి రావచ్చుననే అంచనాలు మరో కారణం.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్‌స్కీ రష్యాతో రాజీ మార్గం వైపు మళ్లుతున్నారనే మాట ఆశ్చర్యంగా తోస్తుంది. రెండున్నరేళ్లు రాజీలేని యుద్ధం చేసిన ఆయన నిజంగానే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 20న తమ దేశ ప్రజలను ఉద్దేశించి, రష్యాతో చర్చలు అవసరమని సూచించటం. తాను వచ్చే నవంబరులో నిర్వహించనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రతినిధులను పంపవలసిందిగా రష్యాను కోరటం. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఈ నెల 24 నుంచి నాలుగు రోజుల పర్యటన కోసం చైనా వెళ్లి, వారి విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమై, చర్చల కోసం రష్యాను ఒప్పించవలసిందిగా కోరటం.
తమ షరతులన్నింటికి రష్యా అంగీకరిస్తే తప్ప చర్చల ప్రసక్తి లేదని జెలెన్‌స్కీ వాదిస్తూ వచ్చారు. షరతులు తాము విధిస్తాముగానీ, రష్యా ఎటువంటి షరతులు పెట్టరాదన్నారు. యుద్ధం మొదలైన కొత్తలో ఒకసారి జరిగిన చర్చలు రెండు వైపుల నుంచి ఇటువంటి వైఖరులు వల్లనే విఫలమయ్యాయి. ఆ తర్వాత రష్యాపై దౌత్య పరమైన ఒత్తిళ్ల కోసం ఉక్రెయిన్ అనేక ప్రయత్నాయి చేసింది. అమె రికా, యూరోపియన్ యూనియన్ల ద్వారా అనేక ఆర్థిక ఆంక్షలు విధింపజేశారు. యుద్ధానికి అమెరికా కూటమి ఆయుధ సరఫరాలు, ఆర్థిక సహాయాలు సరేసరి. జూన్ 15–16 తేదీలలో వాషింగ్టన్‌లో జరిగిన నాటో కూటమి 75 సంవత్సరాల ఉత్సవాలలో ఉక్రెయిన్‌కు తిరుగు లేని మద్దతు ప్రకటించింది. జెలెన్‌స్కీని అతిథిగా ఆహ్వానించి ప్రసంగింపజేసింది. ఆ తర్వాత జూలై 9న స్విట్జర్లాండ్‌లో జెలెన్‌స్కీ సుమారు 90 దేశాలతో శాంతి సమావేశాలు నిర్వహించి అక్కడ కూడా రాజీ లేకుండా మాట్లాడారు.
అటువంటిది కేవలం 10 రోజులు గడిచేసరికి, రష్యాతో చర్చలు అవసరం కావచ్చునని అన్నారు. మరొక విశేషం ఏమంటే, తను స్వయంగా నిర్వహించిన స్విట్జర్లాండ్ శాంతి సమావేశాలకు రష్యాను అసలు ఆహ్వానించలేదు. ఆ విషయమై ప్రశ్నించిన వారిని అందువల్ల ఉపయోగమేమిటని ఎదురు ప్రశ్నించారు. సరిగా ఆ రోజులలో రష్యా పర్యటనకు వెళ్లి భారత ప్రధాని మోదీని, ఒక రక్త పిపాసిని ఆలింగనం చేసుకున్నారంటూ తీవ్రంగా ఆక్షేపించారు. మోదీని ఢిల్లీలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కూడా విమర్శించారు. తీరా జరిగిందేమిటి? రష్యాను ఆహ్వానించకపోవటం వల్ల ప్రయోజనం ఉండదంటూ చైనా కూడా పాల్గొనలేదు. పాల్గొన్న దేశాలలో ముఖ్యమైనవి అనేకం ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేయలేదు. ఆ విధంగా అ సమావేశం ఒక నిష్ఫలయత్నంగా మిగిలింది.
ఇంత జరిగినాక ఇంతలోనే జెలెన్‌స్కీ రష్యాతో చర్చలని అంటూ, రష్యాను ఈసారి చర్చలకు రావలసిందిగా మౌఖికంగా అహ్వానిస్తు న్నారు. ఆ పని రానున్న రోజులలో లిఖిత పూర్వకంగా చేయగలరని భావించవచ్చు. అయితే, అందుకు మొదటి అడుగు నవంబర్ విస్తృత సమావేశాలలో రష్యా పాల్గొనటం అయితే, అంతా సజావుగా సాగిన పక్షంలో ఇరువురి మధ్య ముఖాముఖి చర్చలు రెండవ అడుగు అవుతాయి. ఈ రెండింటికి సన్నాహక ప్రయత్నాల సమయంలో ఇరువురూ ఏవైనా షరతులు ముందస్తుగానే పెడతారా? షరతులుఉంటే ఏమిటవి? అనేవన్నీ చిక్కుముడులు. ఈ రాజీ ప్రయత్నాల పట్ల అమెరికా కూటమి వైఖరి ఏమి కావచ్చుననేది అంతకన్న కీలకమైన ప్రశ్న. ఎందుకంటే, రష్యాను ఏ విధంగానైనా లొంగతీయాలన్నది ఉక్రెయిన్ యుద్ధంలోని అమెరికా పరమోద్దేశం. అందుకే నాటోను రష్యా సరిహద్దులకు విస్తరిస్తున్నందున, రాజీ మార్గాన్ని వారు సమ్మతి స్తారా అనే విషయమై చాలామందికి సందే హాలుంటాయి.
ఇదిట్లుండగా, రష్యాతో చర్చలు అవసరమంటూ జెలెన్‌స్కీ చేసిన ప్రసంగానికి గానీ, ఆయన విదేశాంగమంత్రి కులేబా చైనా వెళ్లి వాంగ్ యీతో ప్రతిపాదించినడానికి గానీ, ఈ వ్యాసం రాసే సమయానికి రష్యా నుంచి ఇంకా ఎటువంటి స్పందనా లేదు. చైనా నుంచి కూడా! వారినుంచి రాగల రోజులలో కనిపించే స్పందనలను బట్టి, మును ముందు ఏమి జరగవచ్చుననే దానిపై కొంత సూచన లభిస్తుంది. చైనా వెళ్లిన కులేబా ఇంతకూ అన్నదేమిటి? వాంగ్‌తో సమావేశం తర్వాత మాట్లాడుతూ, ‘‘నిజాయితీగా, సమస్య పరిష్కారానికి దోహదంగా వ్యవహరించే ఉద్దేశం రష్యాకు ఉన్నట్లయితే చర్చలకు తాము సిద్ధమ’’న్నారు. రష్యా నుంచి అటువంటి సంసిద్ధత ఇంతవరకు కన్పించలేదని కూడా అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, సమస్య పరిష్కారానికి ప్రయత్నించవలసిందిగా జెలెన్‌స్కీ ఒకటిరెండుసార్లు చైనాను బహిరంగంగా కోరారు. కానీ ఆయన విదేశాంగ మంత్రి స్వయంగా వెళ్లటం ఇది మొదటిసారి. చైనా స్వయంగా చొరవ తీసుకుని 12 సూత్రాల పథకం ఒకటి నిరుడు ప్రతిపాదించింది. అది ఉభయులు ఎట్లా యుద్ధ విరమణ చేసి చర్చలు ఆరంభించాలనే దానిపైనే తప్ప, అసలు సమస్య పరిష్కారం గురించి కాదు. తమ భూభాగాల నుంచి రష్యా ఉపసంహరించుకోవాలనే మాట అందులో లేదంటూ ఉక్రెయిన్ అందుకు తిరస్కరించింది. పరిష్కార చర్చలు ఉభయుల మధ్య జరగాలి తప్ప బయటి జోక్యం ఉండరాదన్నది చైనా వైఖరి. చర్చలకు తామెప్పుడూ కాదనలేదని, కాని కొన్ని షరతులు తప్పవన్నది రష్యా వాదన.
నిజానికి రష్యా, ఉక్రెయిన్ రెండు వైపుల నుంచి మొదటి నుంచి కొన్ని గట్టి షరతులే ఉన్నాయి. అమెరికా, నాటోలు తమను చుట్టు ముట్టేందుకు నాటోను విస్తరిస్తూ, ఉక్రెయిన్‌ను రెచ్చగొడుతున్నాయనీ, అ దేశాన్ని నాటోలో చేర్చుకొనజూస్తున్నాయనీ, కనుక తమ అత్మరక్షణ కోసం ఉక్రెయిన్‌ను నాటోకు బయట ఉంచాలన్నది రష్యా మొదటి షరతు. తమ నౌకలు చలికాలంలో ప్రయాణించేందుకు వీలయ్యే ఏకైక సముద్ర మార్గం బ్లాక్ సీ అయినందున ఆ మార్గం భద్రంగా ఉండేందుకు అక్కడి క్రిమియా ద్వీపం తమ అధీనంలో ఉండాలనేది రెండవ షరతు.
ఉక్రెయిన్ తూర్పున రష్యా సరిహద్దులో గల డొనెటెస్క్, లూహానస్క్, ఖేర్సాన్, జపోరిజిజియా ప్రాంతాలలో రష్యన్ భాషా సంస్కృతుల వారు పెద్ద మెజారిటీ అయినందున తీవ్ర వివక్షలను ఎదుర్కొంటున్నారని, కనుక ఇప్పటికే పాక్షికంగా తమ ఆక్రమణలో గల ఈ ప్రాంతాలను పూర్తిగా తమకు బదిలీ చేయాలన్నది మూడవ షరతు. ఉక్రెయిన్ వీటన్నింటిని తిరస్కరించటమేగాక, తమ ఆక్రమిత ప్రాంతాలన్నీ తమ స్వాధీనం చేయాలనీ, తాము నాటోలో కూడా చేరగలమనీ షరతులు పెడుతున్నది. రెండు వైపుల నుంచి ఇవన్నీ చాలా చిక్కు షరతులే.
ఇంతకూ జెలెన్‌స్కీ ఇప్పుడు అకస్మాత్తుగా చర్చలు, రాజీలంటూ మాట్లాడటం ఎందువల్ల? క్లుప్తంగా చెప్పాలంటే, యుద్ధంలో రష్యాది పైచేయి అవుతున్నది. పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆయుధాలు, ఎంత ఆధునికమైనవి సరఫరా చేసినా చాలటం లేదు. అందులోనూ ఒక పరిమితిని మించితే అది నేరుగా రష్యాతో యుద్ధంగా మారవచ్చునని అమెరికా సందేహిస్తున్నది. ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించటమే గాక, సైనికులు పెద్దఎత్తున చనిపోతూ కొత్త రిక్రూట్‌మెంట్లు తగ్గుతున్నాయి.
ఉక్రెయిన్‌కు అంతులేని సహాయాలు, అయినా ఉపయోగం లేకపోవడంతో అమెరికా సహా పాశ్చాత్య దేశాలు పైకి ఏమన్నా, అంతర్గతంగా విముఖత పెరుగుతున్నది. ఈ తరహా యుద్ధాలకు, సహాయాలకు బహిరంగ వ్యతిరేకి అయిన ట్రంప్ ఈసారి అధికారానికి రావచ్చుననే అంచనాలు కొత్త భయాలను కలిగిస్తు న్నాయి. ప్రపంచ దేశాలలో మద్దతు తగ్గుతున్నది. స్వయంగా జెలెన్‌స్కీ పట్ల అక్కడి సైన్యంలో, ప్రజలలో నిరసనలు పెరుగు తున్నాయి. ఈ పరిణామాలన్నింటి ఒత్తిడి వల్లనే, ఇక చర్చలు మినహా మార్గం లేదని ఆయన భావిస్తుంటే ఆశ్చర్యమక్కరలేదు.
- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
- టంకశాల అశోక్
Comments
Please login to add a commentAdd a comment