అటవీ అమర వీరుల త్యాగాలను వృథా కానివ్వం
గుంటూరు ఎడ్యుకేషన్: అటవీ సంపద దోచుకునే వారిని ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలర్పించిన అటవీ అధికారులు, ఉద్యోగుల త్యాగాలను వృథా కానివ్వబోమని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరులోని జిల్లా కలెక్టర్ బంగ్లారోడ్డులో ఉన్న అరణ్య భవన్‌లో ఆదివారం జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. అటవీ సంపద పరిరక్షణలో ఒక ఐఎఫ్‌ఎస్ అధికారితోపాటు 23 మంది సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రకృతి సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుదైక కుటుంబమని, భూమిపై మనతోపాటు జీవిస్తున్న జంతువులు, చెట్లు, చేమలు, పశు పక్ష్యాదులను రక్షించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. సిబ్బంది, నిధుల కొరత ఉన్నా అధిగమించి అటవీ శాఖను బలోపేతం చేస్తామని తెలిపారు. అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకులు వారి ముందర కాళ్లకు బంధాలు వేయకుండా వాళ్ల పని వాళ్లను చేసుకోనిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు.
సంజీవని స్కీమ్‌కు నిధులు
అటవీ సంపద సంరక్షణలో ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పందిళ్లపల్లి శ్రీనివాస్ సహా 23 మంది ఫారెస్ట్ అధికారులు అశువులు బాసారని చెప్పారు. గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్‌తో పోరాటం చేసి ప్రాణాలు వదిలిన శ్రీనివాస్ సహా సిబ్బంది త్యాగాలను మనతోపాటు భావి తరాలు మరిచిపోకూడదని అన్నారు. భవిష్యత్ తరాలు గుర్తించుకునేలా విగ్రహాల ఏర్పాటు, నగర వనాలు, అటవీ శాఖ భవనాలకు వారి పేర్లు పెడతామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి తీసుకుచ్చిన సంజీవని పథకానికి పారిశ్రామికవేత్తలు, దాతలతో మాట్లాడి రూ.ఐదు కోట్ల నిధులు సమీకరిస్తామని వెల్లడించారు. వాటితో అమరవీరుల స్తూపాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
బిష్ణోయ్ తెగలా పోరాటం చేద్దాం
చెట్లు, వన్య ప్రాణులను కాపాడుకోవడానికి బిష్ణోయ్ తెగ ఎంత వరకైనా వెళ్తుందని, జోద్‌పూర్ రాజు చేపట్టిన చెట్లు నరికివేతకు వ్యతిరేకంగా అమృతా దేవి నాయకత్వంలో బిష్ణోయ్ తెగ శాంతియుతంగా పోరాడి వందల సంఖ్యలో ప్రాణాలను అర్పించిందని గుర్తు చేశారు. ఆ కోవకు చెందిన వ్యక్తులే మన అమరవీరులన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకునే అటవీ సంపద సంరక్షణ కోసం సుందర్ లాల్ బహుగుణ చిప్కో ఉద్యమం చేశారని పేర్కొన్నారు. అటవీశాఖలో సంస్కరణలు తీసుకొస్తానని చెప్పారు. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం పంచాయతీ పరిధిలో సహజ వనరులు ఇష్టారాజ్యంగా తవ్వేశారని, ఈ దోపిడీ వల్ల వ్యక్తులు బలపడుతుండగా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. పంచాయతీలకు సీనరేజ్ రావడం లేదన్నారు. దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టేందుకు ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చామన్నారు. స్మగ్లర్ల నుంచి స్వాఽధీనం చేసుకున్న ఎర్ర చందనాన్ని త్వరలో అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా వేలం వేస్తామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు ఎండీ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బి.రామాంజనేయులు, జేసీ భార్గవ్‌తేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, నగర డిప్యూటీ మేయర్ సజిల, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి, ఉన్నతాధికారులు కజురియా, ఎస్‌ఎస్.శ్రీధర్, రాహుల్ పాండే తదితరులు పాల్గొన్నారు.
వారి కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలుస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
Comments
Please login to add a commentAdd a comment