ఎన్‌ఈసీలో ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్
నరసరావుపేట రూరల్: డాక్టర్ విజయనిర్మల మెమోరియల్ ఆధ్వర్యంలో 38వ సౌత్ ఇండియా ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ను నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 650 మంది క్రీడాకారులు, కళాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, సీనీనటుడు నరేష్ ప్రారంభించారు. కుంగ్‌ఫూ, కరాటే, కర్రసాము, యోగా, భరతనాట్యం పోటీలను నిర్వహించారు. డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ సంప్రదాయ, ఆత్మరక్షణ క్రీడలు, కళలను ప్రొత్సహించేందుకు పోటీలను నిర్వహిస్తున్న సినీ నటుడు నరేష్‌ను అభినందించారు. విద్యార్థులు కేవలం చదువు మీదే కాకుండా కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. సినీ నటుడు నరేష్ మాట్లాడుతూ తన తల్లి విజయనిర్మల జ్ఞాపకార్థం ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మార్షల్ ఆర్ట్స్‌కు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఎంఎన్ రవికుమార్, రిటైర్డ్ ఎస్పీలు డాక్టర్ సిహెచ్ చక్రపాణి, కె.రాజశిఖామణి, కళాశాల ఛైర్మన్ మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
మైలవరం: కుటుంబ కలహాలతో పురుగుమందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన జి.కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగల గ్రామానికి చెందిన రావూరి మధుబాబు(37)తో ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చిన నందిగామ గ్రామానికి చెందిన రాజగిరి రమణతో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. మధుబాబు కూలి పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తుండటంతో తన పిల్లలను తీసుకుని ఇటీవల చిన నందిగామలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో భార్యకు నచ్చ చెప్పి తీసుకువెళ్లేందుకు వచ్చిన మధుబాబు శుక్రవారం సాయంత్రం తాను వెంట తెచ్చుకున్న పురుగు మందును కుటుంబ సభ్యులు చూస్తుండగానే తాగాడు. తక్షణమే కుటుంబ సభ్యులు మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మధుబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment