తోడు దొంగలు.. తోడల్లుళ్లు
రూ.9 లక్షలతో ఇల్లు కొనుగోలు
కృష్ణా జిల్లా కృత్తివెన్ను పీఎస్ పరిధిలో చోరీకి పాల్పడిన బంగారాన్ని గుంటూరు లాడ్జికూడలి, బ్రాడీ పేటలోని ఓ గోల్డ్ ఫైనాన్స్ సంస్థలో విక్రయించగా వచ్చిన రూ.9 లక్షలతో శ్రీను వట్టిచెరుకూరు మండలం అనంతవరం గ్రామంలో ఇల్లు కొన్నట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ ఇంటిని కూడా కేసులో అటాచ్మెంట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజు, సీఐలు సుబ్బారావు, అల్తాఫ్హుస్సేన్, బత్తుల శ్రీనివాస్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.
ఇద్దరి వయసూ
ముప్పైరెండే
● ఒకరిపై 50కిపైగా కేసులు
● మరొకరిపై 35కిపైగా..
● ఎర్రచందనం, ఇళ్లల్లో చోరీలు చేయడంలో దిట్టలు
● చోరీ నగదుతో ఇల్లు కొనుగోలు
● అంతరాష్ట్ర పాత నేరస్తులు అరెస్ట్
● రూ.28 లక్షలు విలువైన
బంగారం, వెండి ఆభరణాలు,
ఆటో, బైక్ స్వాధీనం
● ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆ ఇద్దరు తోడు దొంగలు.. ఆ తర్వాత తోడల్లుళ్లయ్యారు. ఇద్దరి వయసూ ముప్పైరెండే. చోరీలు చేయడంలో ఘనాపాఠీలు. అతర్రాష్ట్ర పాత నేరస్తులు. ఇద్దరిపైనా కలిపి 85కిపైగా కేసులు ఉన్నాయి. ఎట్టకేలకు వీరిద్దరినీ గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రూ.28 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు, ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సతీష్‌కుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
ఇటీవల జిల్లాలో ఇంటి దొంగతనాలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశారు. ప్రస్తుతం గుంటూరు కొత్తపేట సాయిభాస్కర్ ఆస్పత్రి సమీపంలో ఉంటున్న వైఎస్సార్ జిల్లా పొద్దుటూరుకు చెందిన ఆకుల శ్రీను, వైఎస్సార్ జిల్లా చింతగుమ్మదిన్నె మండలం అశ్వతుగారిపల్లికి చెందిన నాగదాసరి మహేష్ ఇళ్ల చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నల్లపాడు, పెదకాకాని, మంగళగిరి, వట్టిచెరుకూరు, గుంటూరు లాలాపేటల్లో వీరు చోరీలకు పాల్పడ్డారని సీసీటీవీ పుటేజీ, స్థానికంగా లభ్యమైన ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి, సుమారు 318 గ్రాముల బంగా రం, 1.5 కిలోల వెండి ఆభరణాలు, ఆటో, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.28 లక్షలు ఉంటుంది. ఇదిలా ఉంటే మరో చైన్ స్నాచర్ తమిళనాడు వెల్లోర్ జిల్లా పెర్నంభట్టు మండలం పన్నీర్కొటైకు చెందిన చంద్రన్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. అతని ఆచూకీ గుర్తించేందుకు ప్రత్యేక పోలీస్ బృందం తమిళనాడు వెళ్లినట్లు తెలిపారు.
అక్కా, చెల్లెళ్లతో పెళ్లి
అరెస్టయిన ఆకుల శ్రీను, నాగదాసరి మహేష్ స్నేహితులు. వీరిద్దరూ లారీడ్రైవర్లు. వచ్చే సంపాదన చాలక చోరీలు మొదలుపెట్టారు. శ్రీనుపై రాష్ట్ర వ్యాప్తంగా 50కిపైగా కేసులు, మంగళగిరి గ్రామీణ పీఎస్‌లో సస్పెక్ట్ షీట్ ఉంది. నాగదాసరి మహేష్‌పైనా సుమారు 35కిపైగా కేసులు నమోదయ్యాయి. గతంలో కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్ర చందనం కేసుల్లో అరెస్టయ్యారు. 2021లో వీరిద్దరూ గుంటూరుకు వలస వచ్చారు. కొత్తపేటలోని సాయిభాస్కర్ ఆసుపత్రి సమీపంలో ఉంటున్నారు. ఇటీవల అదే ప్రాంతంలోని అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. పగటి వేళల్లో రెక్కీ చేసి, తాళాలేసిన ఇళ్లను గుర్తించి చోరీలు చేయడం వీరి నైజం. శ్రీను స్క్రూడ్రైవర్‌తో బీరువా తాళాలు తీయడంలో నేర్పరి. అతను లోపల చోరీ చేస్తుంటే మహేష్ కాపలా ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment