భూమి ఇచ్చి.. సహకరించండి | - | Sakshi
Sakshi News home page

భూమి ఇచ్చి.. సహకరించండి

Published Fri, Nov 8 2024 12:58 AM | Last Updated on Fri, Nov 8 2024 12:58 AM

భూమి

భూమి ఇచ్చి.. సహకరించండి

సాక్షి, వరంగల్‌: మామునూరు విమానాశ్రయానికి ‘భూ సేకరణే పెద్ద టాస్క్‌’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం స్పందించింది. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతోపాటు వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, మేయర్‌ గుండు సుధారాణి, కలెక్టర్‌ సత్యశారదతో పాటు రెవెన్యూ అధికారులు మామునూరు విమానాశ్రయానికి సేకరించాల్సిన స్థలాన్ని గురువారం పరిశీలించారు. ఆతర్వాత నక్కలపల్లిలోని ఓ టౌన్‌షిప్‌ హాల్‌లో భూమి కోల్పోతున్న రైతులతో సమావేశమయ్యారు. గాడిపల్లి గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామస్తులతో సమావేశమై విమానాశ్రయ ఏర్పాటుకు కావాల్సిన 253 ఎకరాల భూసేకరణ కోసం రైతులతో మాట్లాడారు. రైతులు తమ డిమాండ్లు చెబితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకెళ్తామన్నారు. భూమికి బదులు భూమి, లేదంటే రిజిస్ట్రేషన్‌ విలువపై 30 శాతం అదనంగా చెల్లిస్తామని పేర్కొన్నారు. భూమి కోల్పోతున్న 233 మంది రైతులు, ప్లాట్ల యజమానులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు ఇతర భూమి కేటాయించి, వారు కోరినట్లుగా మౌలిక సదుపాయాలైన రహదారులు, డ్రెయినేజీ, విద్యుత్‌, ఇతర సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే రైతులకు భూమి కావాలా, లేదా పరిహారం తీసుకుంటారా? అనేది వెల్లడిస్తే ఆ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ప్రయాణికుల సర్వీసులతోపాటు కార్గో సర్వీసులు అందించేలా ఎయిర్‌ పోర్ట్‌ అందుబాటులోకి వస్తే వరంగల్‌ నగర శివారు రూపురేఖలు మారుతాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండు చందన పూర్ణచందర్‌, ఈదురు అరుణ విక్టర్‌, చింతాకుల అనిల్‌, సురేష్‌ జోషి, బైరబోయిన ఉమా దామోదర్‌, భోగి సువర్ణ సురేశ్‌, ముష్కమల్ల అరుణ సుధాకర్‌, ఓని స్వర్ణలత భాస్కర్‌, సోమిశెట్టి ప్రవీణ్‌, పల్లం పద్మ రవి, ఫుర్ఖాన్‌, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

రైతుల డిమాండ్‌ ఏంటంటే...

‘భూమికి బదులు భూమి ఇవ్వాలి. అదే సమయంలో ప్లాట్లు, గుంట నుంచి ఐదు గుంటల వరకు ఇప్పటికే క్రయవిక్రయాలు ప్రజల మధ్య జరిగిన కొనుగోలు, అమ్మకాల రేట్లు ఇవ్వాలి. గతంలోనూ అభివృద్ధి కోసమని ప్రభుత్వాలు భూములు తీసుకున్నాక అక్కడ అభివృద్ధి జరగలేదు. వ్యవసాయం చేసుకోనివ్వలేదు. పరిహారం కూడా అందించని ఘ టనలు ఉన్నాయి. విమానాశ్రయ అభివృద్ధికి సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ గతంలో మాదిరిగా కాకుండా వెంటనే పట్టాలు అందించాలి. భూముల్లో బోర్లు, బావులు ఉంటే ప్రభుత్వం ఇచ్చే భూముల్లోనూ ఏర్పాటు చేయాలి’ అని రైతులు డిమాండ్‌ చేశారు. దీనిపై మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. అందరికీ న్యాయం చేస్తామని, ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వరంగల్‌కు వస్తున్నారని, అదే వేదికపై పాస్‌ పుస్తకాలు సీఎం చేతులమీదుగా రైతులకు అందిస్తామని తెలిపారు. మీరు తొందరగా అంగీకారం తెలిపితే కేంద్రం నుంచి అనుమతి వస్తుందని, వెంటనే నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు.

రైతులందరికీ ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తాం

అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

మామునూరు విమానాశ్రయ

స్థల పరిశీలన.. రైతులతో ముఖాముఖి

No comments yet. Be the first to comment!
Add a comment
భూమి ఇచ్చి.. సహకరించండి1
1/2

భూమి ఇచ్చి.. సహకరించండి

భూమి ఇచ్చి.. సహకరించండి2
2/2

భూమి ఇచ్చి.. సహకరించండి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement