మౌలిక సదుపాయాలకు రూ.180 కోట్ల నిధులు
వరంగల్ అర్బన్: ఉమ్మడి జిల్లాలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.180.80 కోట్ల నిధులు మంజూరు చేస్తూ సోమవారం సాయంత్రం జీఓ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ నగరంలో ఐదు రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ.49.50 కోట్లు విడుదల చేసింది. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ కేంద్రం నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.65 కోట్లు, మహబూబాబాద్ జిల్లా గూడూరు నుంచి కేసముద్రం వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.40 కోట్లు మంజూరు చేసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘాన్‌పూర్ ఇంటిగ్రేటెడ్ డివిజన్ భవన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరైంది.
టెన్త్ పరీక్షల ఫీజు గడువు 28
విద్యారణ్యపురి: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న టెన్త్ వార్షిక పరీక్షల ఫీజు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించవచ్చని హనుమకొండ డీఈఓ డి.వాసంతి సోమవారం తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 10వరకు, రూ.200తో డిసెంబర్ 19వ తేదీవరకు, రూ 500తో డిసెంబర్ 30వ తేదీ వరకు సంబంధిత ఉన్నతపాఠశాలల హెచ్‌ఎంలకు చెల్లించాల్సింటుందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాల్సి ఉంటుందని, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ పరీక్ష ఫీజుతోపాటు రూ.60 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఎస్సీ,ఎ స్టీ బీసీ విద్యార్థులు పట్టణాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.24వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలలోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే ఫీజునుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.
ముగిసిన గ్రూప్ –3 పరీక్షలు
విద్యారణ్యపురి: గ్రూప్–3 పరీక్షలు సోమవారం ముగిశాయి. హనుమకొండ జిల్లాలోని హనుమకొండ, హసన్‌పర్తి, కాజీపేట మండలాల్లో రెండో రోజు సోమవారం జరిగిన పరీక్షకు 32,864మంది అభ్యర్థులకుగాను 17,292మంది (52.62శాతం) హాజరుకాగా, 15,572 మంది గైర్హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో మూడో పేపర్ పరీక్షకు 5,452 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై
షార్ట్ టర్మ్ ప్రోగ్రాం
కాజీపేట అర్బన్ : వరంగల్ నిట్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిట్ వరంగల్, మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ సౌజన్యంతో ‘ఆర్టిిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ హెల్త్‌కేర్ అప్లికేషన్స్’ అంశంపై షార్ట్‌టర్మ్ ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, కేఎంసీ ప్రిన్సిపాల్ కె.రామ్‌కుమార్‌రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ మాజీ డీన్ కృష్ణమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి షార్ట్‌టర్మ్ ప్రోగ్రాంను ప్రారంభించి, సావనీర్‌ను విడుదల చేశారు. నిట్ ప్రొఫెసర్ కిషోర్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా శక్తి మేళా
ప్రారంభం
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మంగళవారం నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి సభను పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన మహిళా శక్తి మేళాను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. సెర్ఫ్, మెప్మా ద్వారా మహిళలు స్వశక్తితో రూపొందించిన 40 రకాల వస్తువులతో కూడిన 20 స్టాళ్లను మేళాలో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులకు మహిళలు డప్పు చప్పుళ్లతో, కోలాట విన్యాసాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు నాలుగు మండలాల
స్కూళ్లకు సెలవు
విద్యారణ్యపురి: కాజీపేట, హనుమకొండ, ధర్మసాగర్, హసన్‌పర్తి పరిధిలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలకు డీఈఓ ఆదేశాల మేరకు మంగళవారం సెలవు (లోకల్ హాలీడే) ప్రకటించారు. సీఎం రేవంత్ హనుమకొండ పర్యటనతో భారీగా ట్రాఫిక్ ఉంటుందన్న కారణంతో సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ నాలుగు మండలాల పరిధిలోని స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు సోమవారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment