వాహనానికి బీమా తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

వాహనానికి బీమా తప్పనిసరి

Published Tue, Nov 26 2024 1:09 AM | Last Updated on Tue, Nov 26 2024 1:09 AM

వాహనానికి బీమా తప్పనిసరి

వాహనానికి బీమా తప్పనిసరి

కాజీపేట: కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి. అనుకోకుండా ప్రమాదంలో వాహనానికి నష్టం వాటిల్లితే కాంప్రహెన్సివ్‌ బీమాతో తగిన పరిహారం పొందే వీలుంది. థర్డ్‌ పార్టీ బీమాతో ప్రమాదం జరిగినట్లయితే డ్రైవర్‌కు లేదా ప్రయాణికులకు, ప్రమాదానికి గురైన వ్యక్తులకు నష్టపరిహారం వర్తిస్తుంది. వాహనాన్ని బట్టి ప్రతి ఏడాది బీమా చెల్లించాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేకపోయినా, రవాణా వాహనాలకు బ్యాడ్జి నంబర్‌ లేకపోయినా, వాహన పత్రాల కాల పరిమితి ముగిసిన తర్వాత ప్రమాదం జరిగినా బీమా కంపెనీలు నష్ట పరిహారం చెల్లించదు. దీనికి వాహన యజమానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తనిఖీల సమయంలో బీమా లేని వాహనానికి అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

బీమాను ఎలా నిర్ణయిస్తారు..

వాహనాలకు బీమా ఎంత లభిస్తుంది అనే దానిని ఇన్సూరెన్స్‌ డిక్లేర్డ్‌ వాల్యూ (ఐడీవీ) అంటారు. వాహనం పోయినా, ప్రమాదంలో పూర్తిగా పనికి రాకుండా పోయినా ఐడీవీని పాలసీదారుడికి చెల్లిస్తారు. వాహన వయస్సు ఆధారంగా ఈ ఐడీవీని చెల్లించాల్సి ఉంటుంది. వాహనం కొనుగోలు చేసిన నెలలోపు అయితే 5 శాతం, ఏడాదిలోపు 15 శాతం, ఏడాది తర్వాత 20, రెండేళ్లు దాటితే 30, మూడేళ్లు దాటితే 40, నాలుగేండ్లకు పైబడితే 50 శాతం తరుగుదల తీసేస్తారు.

థర్డ్‌పార్టీ క్లెయిమ్‌..

ప్రమాదానికి కారణమైన పాలసీదారుడు లేదా బాధితులు లేదా వారి తరఫున మరొకరు ప్రమాద సమాచారాన్ని వెంటనే బీమా కంపెనీకి, పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. థర్డ్‌పార్టీ కింద నష్టపరిహారం పొందేందుకు బాధితులు మోటారు వాహనాలకు సంబంధించిన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. సొంత వాహనానికి ఏమైనా ప్రమాదం కారణంగా నష్టం జరిగితే వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. బీమా కంపెనీ ప్రతినిధులు వచ్చే వరకు వాహనాన్ని ప్రమాద స్థలంలో ఉంచాల్సి వస్తుంది. వాహనానికి సహజంగా జరిగే నష్టానికి బీమా కంపెనీలు నష్ట పరిహారం చెల్లించవు.

బీమా లేని పక్షంలో...

వాహనాలకు బీమా లేని సందర్భంలో రోడ్డుపై ప్రమాదం జరిగితే బాధితులకు ఎటువంటి పరిహా రం అందదు.పోలీసులు కేసు నమోదు చేసినప్పు డు ఇన్సూరెన్స్‌ పేపర్లు పోలీసులకు సమర్పించని పక్షంలో వాహనదారుడు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత విచారణలో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

ప్రమాదం జరిగితే యజమానితో పాటు ఇతరులకు పరిహారం

లేకుంటే జరిమానా తప్పదు

మనం ఉపయోగించే వాహనాలకి తప్పనిసరిగా బీమా చేయించాలి.. కానీ ఈ విషయాన్ని అనేకులు వివిధ కారణాలతో విస్మరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దాదాపు 40 లక్షలకు పైగా వాహనాలుంటే వీటిలో సగం వాహనాలకు ఇన్సూరెన్స్‌ లేదని అధికారులు చెబుతున్నారు. వాహన బీమా ఉపయోగాలు, రకాలు, బీమా చేయించే విధానంపై అందరికీ పూర్తి స్థాయి అవగాహనపై ప్రత్యేక కథనం మీ కోసం..

బీమా రకాలు ఇలా..

బీమా కంపెనీలు వివిధ రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇంజన్‌ ప్రొటెక్షన్‌, ఆయిల్‌ లీకేజీ, వేరే కారణాల వల్ల ఇంజన్‌కు నష్టం జరిగితే ఇంజన్‌ రీప్లేస్‌ చేసే విధంగా బీమా చేసుకునే వీలుంది. వాహనం దొంగతనానికి గురైనా లేక ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన కొత్త వాహనాన్ని పొందే విధంగా పాలసీలు ఉన్నాయి. వాహన ప్రమాదంలో యజమాని లేదా ప్రయాణికులు, ఇతరులు మృతి చెందినా, అంగవైకల్యం పొందినా నష్టపరిహారం పొందేందుకు అనేక రకాల పాలసీలు అందుబాటులోకి వచ్చాయి.

ఏడాదికోసారి బీమా చెల్లించాలి

ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి తమ వాహనానికి సంబంధించి బీమా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. బీమా చేయించలేని వాహనాలను రవాణా శాఖ అధికారులు ఎన్నిసార్లు పట్టుకుంటే అన్నిసార్లు జరిమానా చెల్లించాల్సిందే. మూడేళ్లకో సారి బీమా చేయడానికి కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇందుకు 20 నుంచి 30 శాతం వరకు ప్రీమియంలో మినహాయింపు ఇస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement