ఎల్ఆర్ఎస్.. వసూళ్లు
వరంగల్ అర్బన్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో కొంత మంది వార్డు ఆఫీసర్లు అక్రమ వసూళ్లకు తెరలేపారు. స్థలాల మార్కెట్ విలువల తేడాలను చూపిస్తూ.. ఫీజుల హెచ్చు, తగ్గింపు పేరుతో యజమానులతో బేరసారాలకు దిగుతున్నారు. ‘కొంత మేరకు ఫీజు బెనిఫిట్ చేస్తాం.. ఫైల్ క్లియర్ చేయిస్తాం.. ఫీజులు కడితే చాలు ప్రొసీడింగ్ కాపీ తెచ్చి మీ చేతుల్లో పెట్టే బాధ్యత మాది’ అంటూ భరోసా కల్పిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుదారు నుంచి రూ.5వేల నుంచి రూ.10 వేలు దండుకుంటున్నారు. మరికొందరు ఫార్మాలిటీ పేరుతో పచ్చనోట్లను డిమాండ్ చేస్తున్నారు. ఫైళ్ల ప్రాసెసింగ్ తొలి దశలోనే వార్డు ఆఫీసర్లు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మార్కెట్ విలువలో తేడాలు..
గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖకు చెందిన ఽవీఆర్ఏ, వీఆర్ఓలపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఆ వ్యవస్థను రద్దు చేసింది. వీరిలో ఆరుగురు వీఆర్ఓలు, 38 మంది వీఆర్ఏలను ఏడాదిన్నర క్రితం బల్దియా ఉద్యోగులుగా విలీనం చేశారు. వివిధ విభాగాల్లో 22 శాశ్వత ఉద్యోగులు, 44 మంది వీఆర్ఏ, వీఆర్ఓలు మొత్తం 66 మందిని వార్డు ఆఫీసర్లుగా నియమించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం 11 మంది టీపీబీఓలు, టీపీఎస్లతోపాటు 61 మంది వార్డు ఆఫీసర్లకు డ్యూటీలు అప్పగించారు. 90 వేల దరఖాస్తులకు 72 బృందాలను ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పర్యవేక్షిస్తున్న వారు.. స్థల యజమానులకు మొబైల్ ఫోన్లో సమాచారం ఇస్తున్నారు. సంబంధిత స్థలాల వద్ద యజమాని ఫొటో, కోడ్స్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. కొంత మంది వార్డు ఆఫీసర్లు ఇదే అదనుగా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
బ్లాక్మెయిల్ దందా..
నిబంధనల ప్రకారం యజమాని స్థల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో నమోదైన మొత్తం సొమ్ముపై 14 శాతం ఫీజుగా విధిస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో ఉన్న మార్కెట్ వాల్యూ మేరకు రెగ్యులరైజేషన్, మెయిన్ రోడ్డు, దాని వెనకాల, రెండు, మూడు లైన్ల మేరకు వేర్వేరుగా మార్కెట్ ఽఫీజు విలువను పరిగణనలోకి తీసుకుని లెక్కించాలి. కానీ.. మామూళ్ల కోసం కొంత మంది వార్డు ఆఫీసర్లు బ్లాక్ మొయిల్ చేస్తున్నారు. 2020 సంవత్సరానికి బదులుగా 2024 మార్కెట్ విలువ, ఇష్టమొచ్చినట్లు రోడ్ల వివరాల పేరుతో లెక్కలు వేస్తున్నారు. ఈ విధానం వల్ల కొంత మేరకు ఫీజు అధికమవుతోంది. ‘ఫార్మాలిటీ’ ఇస్తే అదనంగా పడే ఫీజు తక్కువ చేస్తామని, లేకపోతే ఎలా ఉంటే అలానే ఫీజు విధిస్తామంటున్నారు. అంతేకాకుండా ఎల్–1 టీపీబీఎస్, రెవెన్యూ ఆర్ఐలు, ఇరిగేషన్ ఏఈలను, ఎల్–2 ఏసీపీ, ఎల్–3 డిప్యూటీ కమిషనర్లందరికీ ప్రతీ ఫైలుకు ఎంతో కొంత సొమ్ము ముట్టజెబితే ఫైల్ క్లియర్ అవుతుందని చెబుతూ కొర్రీలు పెడుతున్నారు. ‘అందరినీ చూసుకుంటాం.. ప్రొసీడింగ్ కాపీ ఇప్పిస్తాం’ అని హామీ ఇస్తున్నారు. వారు అడిగిన సొమ్ము చెల్లించేందుకు కొందరు యజమానులు అంగీకరించకపోవడంతో 2024 మార్కెట్ విలువతో ఫీజు విధిస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన ముగ్గురు స్థలాల యజమానులు లైసెన్స్ సర్వేయర్లను ఆశ్రయించి లెక్కలు వేయించారు. మార్కెట్ విలువ, రోడ్డు నెట్ వర్క్‌లో తేడాలు తదితర అంశాల తప్పుడు లెక్కలపై యజమానులు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వారి సూచన మేరకు రాష్ట్ర కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం ఇచ్చారు. తీరా వీళ్లకు డబ్బులు చెల్లించిన తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఆపై ఆఫీసర్ల సంగతి ఎలా? ఉంటుందోననే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి.
ఏం లేదా మరి?
కొంత మంది వార్డు ఆఫీసర్లు ‘ఫార్మాలిటీ’ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించి, ప్రత్యేక యాప్‌లో అప్లోడ్ చేసినందుకు గాను ఏమీ లేదా? ఇంత దూరం వచ్చాం.. అంటున్నారు. చేసేదిలేక ఎంతో కొంత ఇవ్వకపోతే ఎక్కడ కొర్రీలు పెడతారోనంటూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.500 నుంచి రూ.1,000 చొప్పన వసూలు చేస్తున్నారు.
ఎవరికీ డబ్బులివ్వొద్దు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో ఎవరికీ డబ్బులివ్వొద్దు. నిబంధనల మేరకు డాక్యుమెంట్లు, స్థలం ఉంటే ఫైల్ ప్రాసెస్ జరుగుతుంది. తదుపరి ఫీజు ఎంత చెల్లించాలనే విషయం మొబైల్ ఫోన్లో సమాచారం వస్తుంది. ఆ ఫీజులు చెల్లిస్తే వెంటనే ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ జారీ అవుతుంది. ఫిర్యాదులు వస్తే విచారణ చేపట్టి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.
– రవీందర్ వాడేకర్,
బల్దియా ఇన్చార్జ్ సిటీ ప్లానర్
స్థలాల మార్కెట్ విలువ పేరుతో బేరసారాలు
క్షేత్రస్థాయిలో కొందరు
వార్డు ఆఫీసర్ల నిర్వాకం
చేతులు తడపకుంటే
యజమానులకు కొర్రీలు
తప్పుడు లెక్కలతో
అధిక ఫీజుల విధింపు
టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు
Comments
Please login to add a commentAdd a comment