హైదరాబాద్: రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో పనుల్లో వేగం పెరిగింది. ఒకవైపు భూసార పరీక్షలు నిర్వహిస్తుండగానే మరోవైపు వివిధ ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్‌లలోని సమస్యలపై అధికారులు అధ్యయనం చేపట్టారు. ఎయిర్‌పోర్టు చాలా వరకు రోడ్డు మార్గం గుండానే వెళుతున్నప్పటికీ ఒకటి, రెండు చోట్ల గుట్టలపై నుంచి మెట్రో పరుగులు తీయవలసి వస్తుంది. దీంతో కొండలపైన అలైన్‌మెంట్ పైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
బుధవారం హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి , సీనియర్ ఇంజినీర్లతో కలిసి రాజేంద్రనగర్ గుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ గుట్టౖపైపెన సుమారు 1.3 కి.మీ పొడవుగల విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్ నిర్మాణం కోసం కసరత్తు చేపట్టారు. ఈ మార్గంలో నిటారుగా ఉండే ఎత్తులు, బండరాళ్లు, లోయలు ఉండడం వల్ల మెట్రో వయాడక్ట్ నిర్మాణం చాలా కష్టమైన పని అని ఈ సందర్భంగా ఎండీ అభిప్రాయపడ్డారు.ఈ మార్గాన్ని పరిశీలించిన అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
● మెట్రో అలైన్‌మెంట్, ఔటర్‌రింగ్‌రోడ్డు క్రాష్ బారియర్ మధ్య దాదాపు 18 అడుగుల గ్యాప్ మాత్రమే ఉంది.దీంతో ఔటర్ లోతైన కటింగ్ లో ఉన్నందున వల్ల అటువైపు ఎటువంటి బండరాళ్లు పడకుండా తగిన బలం, ఎత్తుతో కూడిన రక్షణ బ్యారియర్లను అమర్చాలని ప్రతిపాదించారు.
● ఈ మార్గంలో మెట్రో అలైన్‌మెంట్‌కు బౌల్డర్ స్టెబిలైజేషన్ పద్ధతులను నిపుణులతో సంప్రదించి అవలంబించాలి;
● గుట్టపై నుంచి వెళ్లేటప్పుడు మెట్రో వయాడక్ట్‌ను రక్షించేందుకు విమానాశ్రయం మెట్రో కు ఎడమ వైపున రక్షిత ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి.దీనివల్ల సంఘవిద్రోహ శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది.
● విమానాశ్రయ మెట్రో ప్రాంతంలో ఎలాంటి ఆక్రమణలు చోటుచేసుకోకుండా నియంత్రించేందుకు హెచ్‌ఎండీఏ సహకారంతో సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
● కొండపైన రాయిని తొలగించవలసిన అవసరం లేకుండా స్టబ్‌లు లేదా తక్కువ ఎత్తు ఉన్న స్తంభాలపై మెట్రో వయాడక్ట్‌ను నిర్మించే అంశాన్ని పరిశీలించాలి.
క్రాస్ డ్రైయిన్‌ల ఏర్పాటు...
● మరోవైపు ఔటర్ డ్రైనేజీ వ్యవస్థలోకి వర్షపు నీరు ప్రవహించేలా కొండపైన హెచ్‌ఏఎంఎల్ నిర్మించిన తాత్కాలిక రహదారి లోయ పాయింట్ల వద్ద తగినంత వ్యాసార్ధంతో కూడిన హ్యూమ్ పైపులతో క్రాస్ డ్రెయిన్‌లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
● అలాగే కొండపై దాదాపు 300 మీటర్ల వరకు విస్తీర్ణంలో చేపట్టిన తాత్కాలిక రహదారిని త్వరలో పూర్తి చేయాలని ఎన్వీఎస్ రెడ్డి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎయిర్ పోర్ట్ మెట్రో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్ సాయపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment