
సాక్షి, హైదరాబాద్: సెల్‌ఫోన్ చోరీ కేసు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న నిందితుడి అనుమానాస్పద మృతిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్, నార్త్ జోన్ డీసీపీ, గోపాలపురం ఏసీపీ, తుకారాంగేట్ ఎస్‌హెచ్‌ఓలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. సెల్‌ఫోన్ చోరీ కేసు విచారణ నిమిత్తం తుకారాంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్ చిరంజీవి అనుమానాస్పద మృతి ఘటన గురించి పత్రికల్లో వచ్చిన వార్తను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా పరిగణించిన విషయం తెలిసిందే.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘పోలీసు డిపార్ట్‌మెంట్‌లోని కింది స్థాయి అధికారులకు సున్నితత్వంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. విచారణలో థర్డ్ డిగ్రీ అవసరం లేదు. థర్డ్ డిగ్రీ కారణంగానే వ్యక్తి మరణించాడు. ఈ విషయాన్ని రికార్డులోకి తీసుకురావాలి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఆటోడ్రైవర్‌పై దాదాపు 6 కేసులు ఉన్నాయని ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ క్రమంలో సీజే కల్పించుకుని.. ‘ఇది అసంబద్ధం. సదరు వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మరణించాడు. ఎలా అయినా ఇది ఆమోదయోగ్యం కాదు’ అని చెప్పారు. వాదనలు విని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. చిరంజీవి భార్యతో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ పిల్‌కు అటాచ్ చేసి కలిపి విచారణ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment