Hyderabad: Morning Walk Turns Tragic After Speeding Car Kills Mother, Daughter - Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు క్షణాల్లోనే ఘోరం

Published Wed, Jul 5 2023 7:34 AM | Last Updated on Tue, Aug 1 2023 8:55 PM

- - Sakshi

నగరంలో ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా.. ఏ వైపు నుంచి మృత్యువు వచ్చి కబళిస్తుందో తెలియని విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. హైదర్షాకోట్‌ వద్ద రోడ్డు పక్కన ఉదయం పూట వాకింగ్‌ చేస్తున్న అభమూ శుభమూ తెలియని ఇద్దరి ప్రాణాలను కారు ప్రమాదం అన్యాయంగా బలిగొంది. ఈ ఘటన నగరవాసుల భద్రతను ప్రశ్నిస్తోంది. పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయనే ఆవేదన ఉదయిస్తోంది. ఏ వైపు నుంచి ఏ వాహనం ఎంత వేగంగా వస్తుందో తెలియని పరిస్థితుల్లో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనని.. నగరంలో ఇలాంటి ప్రమాదాలు షరామామూలుగా మారాయని పలువురు ఆక్రందన వ్యక్తంచేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌/మణికొండ: మైనార్టీ తీరి మేజర్‌ అయ్యాననే ఆనందంతో ఉన్న యువకుడు రాత్రంతా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పుట్టిన రోజు వేడుకలను మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో మరికొందరితో కలిసి చేసుకోవడానికి స్నేహితులతో కలిసి కారులో దూసుకుపోతున్నాడు. మితిమీరిన వేగంతో దూసుకువస్తున్న కారు లంగర్‌హౌస్‌–కాళిమందిర్‌ మార్గంలోని హైదర్షాకోట్‌ వద్ద మలుపు తిప్పుతూ అదుపు తప్పింది. బ్రేక్‌ వేయగా రోడ్డుపై ఉన్న ఇసుక ఫలితంగా స్కిడ్‌ అయి వాకింగ్‌ చేస్తున్న నలుగురిపై నుంచి దూసుకుపోయింది. కారు ఎడమ వైపు భాగం బలంగా తగలడంతో తల్లీకూతుళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వాకర్స్‌ తీవ్రంగా గాయపడ్డారు. కారు నడిపిన ‘బర్త్‌డే బాయ్‌’తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు..

బర్త్‌ డే పార్టీకి బయలుదేరి..
శాసీ్త్రపురం ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇంతియాజ్‌ సిద్ధిఖ్‌ తన హోండా సివిక్‌ కారును (ఏపీ09బీజే2588) ఆన్‌లైన్‌లో విక్రయించాడు. ఓఎల్‌ఎక్స్‌లో దీన్ని ఖరీదు చేసిన యువకుడు ఖైరతాబాద్‌కు చెందిన అబ్దుల్‌ రెహమాన్‌కు విక్రయించాడు. ఇంతియాజ్‌ అప్పట్లోనే కారు ఓనర్‌షిప్‌ బదిలీకి అవసరమైన పత్రాలపై సంతకం చేసి ఇచ్చినా ఇప్పటికీ ఆ ప్రక్రియ జరగలేదు. మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన విద్యార్థి బీబీఏ విద్యార్థి బదియుద్దీన్‌కు మంగళవారంతో 18 ఏళ్లు నిండాయి. మైనార్టీ తీరడంతో పాటు పుట్టిన రోజు కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి వేడుకలు మొదలెట్టాడు. మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతంలోనే ఈ నలుగురూ పార్టీ చేసుకోవడంతో పాటు కేక్‌ కట్‌ చేశారు.

మంగళవారం మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేసిన బదియుద్దీన్‌ అక్కడికి మరికొందరు స్నేహితులను ఆహ్వానించాడు. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో మాసబ్‌ట్యాంక్‌ నుంచి మొయినాబాద్‌కు రెహమాన్‌కు చెందిన కారులో బయలుదేరాడు. బదియుద్దీన్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదన్న విషయం తెలిసి స్నేహితుడు రెహమాన్‌ అతనికి కారు ఇచ్చాడు. కేక్‌ కటింగ్‌, వీడియోల కోసం ఓ కత్తినీ కారులో పెట్టుకుని వెళ్తున్నాడు.

కారు వేగాన్ని అదుపు చేయలేక..
మల్కాజిగిరికి చెందిన అనురాధ (56) తన కుమార్తె మమతతో (27) కలిసి హైదర్‌షాకోట్‌లోని లక్ష్మీ నర్సింహనగర్‌ కాలనీలో ఓ ఇంట్లో రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. బెంగళూరులోని కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మమత వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈమె తమ్ముడు తన భార్యతో కలిసి లంగర్‌హౌస్‌లో ఉంటుండగా తండ్రి మల్కాజిగిరిలో నివసిస్తున్నారు. అనురాధ ప్రతి రోజూ కచ్చితంగా వాకింగ్‌ చేయాలంటూ వైద్యులు సలహా ఇవ్వడంతో తల్లీకూతురు కలిసి ప్రధాన రహదారిపై వాకింగ్‌ కోసం వెళ్తున్నారు.

మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వీరు 6.11 గంటల సమయానికి లంగర్‌హౌస్‌–కాళీమందిర్‌ ప్రధాన రోడ్డుపైకి చేరుకుని వాకింగ్‌ చేస్తున్నారు. అదే ప్రాంతంలో మరికొందరూ నడుస్తున్నారు. బుదియుద్దీన్‌ నడుపుతున్న కారు ఆ సమయంలో అక్కడకు చేరుకుంది. మితిమీరిన వేగంతో వాహనాన్ని డ్రైవ్‌ చేస్తున్న బదియుద్దీన్‌కు మలుపు తిరిగిన వెంటనే ఎదురుగా వాకింగ్‌ చేస్తున్న వాళ్లు కనిపించారు. వెంటనే వాహనాన్ని అదుపు చేయలేకపోయిన అతడు సడెన్‌ బ్రేక్‌ వేశాడు. ఆ రోడ్డుపై ఇసుక ఉండటంతో స్కిడ్‌ అయిన కారు అదుపు తప్పింది. రోడ్డుకు అడ్డంగా తిరిగుతూ ముందుకు దూసుకువచ్చింది.

కారు ఎడమ వైపు భాగం తల్లీకూతుళ్లతో పాటు వారి పక్కనే నడుస్తున్న కవిత, కాస్త ముందు నడుస్తున్న ఇంతెకాబ్‌ ఆలంలకు బలంగా తగిలింది. అప్పటికి అదుపు కాకపోవడంతో ఫుట్‌పాత్‌ దాటి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి కారు దూసుకుపోయింది. బదియద్దీన్‌ సహా మిగతా వారు కారును వదిలి పారిపోయారు. అనురాధ, కవిత రోడ్డుపైనే ఫుట్‌పాత్‌ వద్ద పడిపోగా.. మమత మాత్రం ఫుట్‌పాత్‌పై ఉన్న కరెంట్‌ స్తంభంలోకి ఇరుక్కుపోయింది.

తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి..
నలుగురికీ తీవ్రగాయాలు కాగా అనురాధ, మమత అక్కడిక్కడే చనిపోయారు. గాయాలైన కవిత, ఇంతెకాబ్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లీకూతుళ్ళ మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బదియుద్దీన్‌ సహా నలుగురినీ అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బదియుద్దీన్‌ను, లైసెన్స్‌ లేదని తెలిసీ తన కారును ఇచ్చిన రెహమాన్‌ను అరెస్టు చేశారు. ఇద్దరు మహిళల మృతికి కారణమైన బదియుద్దీన్‌పై 304/2, 337,184,187 ఎంవీయాక్ట్‌, 25 ఆర్మ్స్‌ యాక్ట్‌ల ప్రకారం కేసు నమోదు చేసినట్టు సీఐ శివకుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement