హైదరాబాద్: నగరంలో రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచనలున్నందున ఎలాంటి పరిస్థితులెదురైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతో పని చేయాలని ఆదేశించారు.
బుధవారం నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జలమండలి, విద్యుత్, రెవెన్యూ, ట్రాఫిక్ పోలీస్ తదితర అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో జీహెచ్‌ఎంసీ పని చేయాలని ఆయన సూచించారు.
సంసిద్ధంగా ఉన్నాం: అధికారులు
వర్షాకాల ప్రణాళికలో భాగంగా అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు మంత్రికి తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం కాకుండా డీవాటరింగ్ పంపులు, సిబ్బంది అందుబాటులో ఉంచామన్నారు. ఎస్‌ఎన్‌డీపీఓ భాగంగా ఇప్పటి వరకు జరిగిన పనులతో వరదప్రభావిత ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులుండవనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పారిశుద్ధ్యం మెరుగవ్వాలి..
పారిశుద్ధ్య నిర్వహణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో పోల్చుకుంటే మెరుగైనప్పటికీ, దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నగరం వేగంగా విస్తరిస్తుండటం.. జనాభా పెరుగుతుండటంతో చెత్త ఉత్పత్తి కూడా పెరుగుతోందని, అందుకనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణా ప్రణాళికలను నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment