షాద్‌నగర్/ కొందుర్గు: మానవత్వాన్ని మరిచి మృగాడిలా వ్యవహరించాడు.. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తెతో కొట్టి హతమార్చాడు.. ఆదివారం ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా ఆమె తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. సీరియల్స్‌లో నటుడిగా పనిచేస్తున్న ఫరూఖ్‌నగర్ మండలం, నేరేళ్లచెరువుకు చెందిన శివకుమార్ వ్యవహార శైలి ఇదీ. కొందుర్గుకు చెందిన ఇందిర, సురేందర్‌గౌడ్ దంపతులకు కూతురు సంఘవి కుమారులు పృథ్వీ(23), రోహిత్ ఉన్నారు. సంఘవి తమ్ముడు పృథ్వీతో కలిసి ఎల్‌బీనగర్ ప్రాంతంలో ఉంటూ హోమియోపతి వైద్యవిద్యలో నాలుగో సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా శివకుమార్ ప్రేమపేరుతో ఆమె వెంట పడుతున్నట్లు సమాచారం.
పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం ఎల్బీ నగర్‌లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడు పృథ్వీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గత కొంత కాలంగా శివకుమార్ సైకోలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం తన తండ్రి శంకరయ్యను సుత్తెతో తలపై మోది హత్య చేశాడు. తాజా ఘటనతో శివకుమార్ వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
కొందుర్గులో విషాదఛాయలు
మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన సంఘవి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment