బెయిల్‌పై వచ్చి నలభై ఏళ్లు చిక్కలేదు..! | - | Sakshi
Sakshi News home page

బెయిల్‌పై వచ్చి నలభై ఏళ్లు చిక్కలేదు..!

Oct 16 2023 5:08 AM | Updated on Oct 16 2023 10:20 AM

- - Sakshi

హైదరాబాద్: ముంబైకి చెందిన సయ్యద్‌ తాహిర్‌ (65)..40 ఏళ్ళ క్రితం అక్కడి డోంగ్రీ ప్రాంతంలో ఓ హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసినా బెయిల్‌పై వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. నేరుగా హైదరాబాద్‌ వచ్చిన అతగాడు టోలిచౌకి ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడి న్యాయస్థానం ఇతడిపై స్టాండింగ్‌ వారెంట్‌ జారీ చేయడంతో తాహిర్‌ కోసం గాలించిన మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అతడి ఆచూకీ కనిపెట్టారు. శుక్రవారం సిటీకి వచ్చిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది.

ఇక్కడి యువతినే వివాహం చేసుకుని, కుమారుడు, కుమార్తెలు కలిగిన తాహిర్‌కు అప్పట్లో తాను ఎవరి చంపడానికి ప్రయత్నించాడో కూడా గుర్తులేకపోవడం గమనార్హం. డోంగ్రీలోని కళ్యాణ్‌ మాన్షనన్‌కు చెందిన తాహిర్‌ వృత్తిరీత్యా డ్రైవర్‌. 1982లో చిన్న వివాదానికి సంబంధించి తోటి డ్రైవర్‌పై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయడంతో న్యాయస్థానం నుంచి బెయిల్‌ పొందాడు. తనకు శిక్షపడటం ఖాయమని భావించిన ఇతగాడు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

నేరుగా హైదరాబాద్‌ వచ్చి టోలిచౌకి ప్రాంతంలో స్థిరపడ్డాడు. స్థానికంగా గుర్తింపుకార్డులు సంపాదించిన తాహిర్‌ ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం నలుగురు సంతానం ఉన్నారు. డోంగ్రీలో నమోదైన హత్యాయత్నం కేసు వాయిదాలకు ఇతడు హాజరుకాకపోవడంతో సెషన్స్‌ కోర్టు తొలుత సమన్లు జారీ చేసింది. ఆపై బెయిలబుల్‌ తర్వాత నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. అయితే పోలీసులు ఎంతగా గాలించినప్పటికీ తాహిర్‌ ఆచూకీ లభించలేదు. డోంగ్రీలోనే ఉన్న అతడి తల్లిని, ఇతర బంధువులు, స్నేహితులను ఆరా తీసినా ఎలాంటి సమాచారం లభించలేదు. ఇదే విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం స్టాండింగ్‌ వారెంట్‌ జారీ చేసి అతడి కోసం గాలింపు కొనసాగించాలని, దొరికినప్పుడు అరెస్టు చేయాలని ఆదేశించింది.

దీంతో ఓ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. తాహిర్‌ ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ఈ టీమ్‌ అతడి తల్లి వివరాలు ఆరా తీసింది. ఆమె నాలుగేళ్ల క్రితం చనిపోయిందని, అక్కడి మజ్‌గావ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగినట్లు తెలుసుకుంది. అక్కడకు వెళ్లి ఆరా తీసిన పోలీసులు..వాటికి తాహిర్‌ హాజరయ్యాడని, అప్పట్లో కొందరికి తాను హైదరాబాద్‌లో ఉంటున్నట్లు చెప్పాడని తెలుసుకున్నారు. దీంతో గాలింపు చర్యలు వేగవంతం చేసిన పోలీసులు డోంగ్రీ ప్రాంతంలో ఉన్న వేగులను అప్రమత్తం చేశారు. వారిలో ఒకడు తాహిర్‌ చిన్ననాటి స్నేహితుడికి దగ్గర కావడం ద్వారా అసలు విషయం చెప్పకుండా అతడి ఫోన్‌ నెంబర్‌ సేకరించాడు.

దీని ఆధారంగా ఆరా తీసిన అధికారులు తాహిర్‌ హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉంటున్నట్లు గుర్తించారు. గత వారం నగరానికి చేరుకున్న ప్రత్యేక బృందం ఈ ప్రాంతంలో గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్ళిన అధికారులు అతడు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు, పశ్చిమ బెంగాల్‌ వెళ్లి వస్తున్నట్లు గుర్తించారు. సిటీలోనే మకాం వేసిన ప్రత్యేక బృందం శుక్రవారం తాహిర్‌ ఇంటికి వచ్చినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారెంట్‌ ఆధారంగా అరెస్టు చేసి ముంబై తరలించారు.

అక్కడి సెషన్స్‌ కోర్టు తాహిర్‌కు ఈ నెల 20 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అప్పట్లో తాను ఎవరితో గొడవపడ్డానో ఆ వ్యక్తి పేరు గుర్తులేదని తాహిర్‌ చెప్పాడు. తనకు నలుగురు సంతానం అని, పెద్ద కుమార్తె దంత వైద్యురాలు కాగా రెండో కుమార్తె ఉపాధ్యాయురాలని విచారణలో చెప్పాడు. చిన్న కుమార్తె బ్యూటీషియన్‌, కుమారుడు హోం రెన్నోవేషన్‌ కాంట్రాక్టర్‌గా స్థిరపడినట్లు వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement