
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఎన్నో ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు చేపట్టినా.. స్కైవేలు రానున్నా.. ప్రజలకు చాలినన్ని నడకదారులు మాత్రం అందుబాటులో లేవు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. నగరంలో 9,100 కి.మీ మేర రహదారులున్నాయి. ఇందులో పది శాతం ఫుట్‌పాత్‌లు కూడా లేవు. వేలాది కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పటికీ.. రూ.100 కోట్ల ఫుట్‌పాత్‌లు కూడా నిర్మించలేదు.
వాహనదారుల సాఫీ ప్రయాణం కోసం సిగ్నల్‌ఫ్రీగా ఉండేలా వివిధ ఫ్లై ఓవర్లతో పాటు వారికి ప్రయాణ సమయం, ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గేలా, ఫ్లై ఓవర్లతోపాటు లింక్ రోడ్లు కూడా నిర్మిస్తున్నప్పటికీ నడిచేవారికి అవసరమైన ఫుట్‌పాత్‌లపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపడంలేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అడపాదడపా ప్రాణాలు పోతున్నాయి.
ఉన్నా నడవలేరు..
ఉన్న ఫుట్‌పాత్‌లే తక్కువ కాగా, అవి సైతం ప్రజల నడకకు ఉపయోగపడటం లేదు. వాటిపైనే దుకాణాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, పబ్లిక్ టాయ్‌లెట్లు, వాటర్ ఏటీఎంలు, చెట్లు, అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఉన్నాయి. దీంతో ఆటంకాలు లేకుండా కనీసం యాభై మీటర్లు కూడా నడిచే పరిస్థితి లేదు. ఈ దుస్థితి మారుస్తారేమోనని ఎదురు చూస్తున్న పాదచారుల సమస్యల్ని పట్టించుకుంటున్న వారే లేకుండాపోయారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నా ఏళ్లుగా ఉన్న పాత సమస్య.. పాదచారుల అవస్థలు మాత్రం తీరడం లేదు. తాము నడిచేందుకు తగిన విధంగా, ఫుట్‌పాత్‌లుండాలని, అన్నిప్రధాన ర హదారుల వెంబడీ సదుపాయంగా నడిచేంత వెడల్పుతోవాటిని నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
►గడచిన పదేళ్ల కాలంలో కనీసం 400 కి.మీ ఫుట్‌పాత్‌లు కూడా నిర్మించలేదు.
► రెండేళ్లక్రితం జోన్‌కు కనీసం పది కిలోమీటర్లయినా ఫుట్‌పాత్‌లు నిర్మించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినా పనులు పూర్తి కాలేదు.
► సీఆర్‌ఎంసీ కింద రోడ్ల నిర్మాణం చేపట్టిన ఏజెన్సీలు సైతం ఫుట్‌ఫాత్‌లను పట్టించుకోవడం లేదు.
గత ఆరేళ్లలో నిర్మించిన ఫుట్‌పాత్‌లు.. వాటికై న వ్యయం
సంవత్సరం ఫుట్ వ్యయం పాత్‌లు (రూ.కోట్లలో)
2017 63 2.67
2018 95 7.20
2019 105 12.80
2020 89 17.96
2021 86 20.99
2022 49 18.90