
జి.కిషన్‌రెడ్డి
లోక్‌సభ స్థానం: సికింద్రాబాద్
తల్లిదండ్రులు: స్వామిరెడ్డి, ఆండాళమ్మ
స్వస్థలం: తిమ్మాపూర్(రంగారెడ్డి జిల్లా)
విద్యార్హత: ఇంజినీరింగ్
రాజకీయ నేపథ్యం: 1964 మే 15న జన్మించిన కిషన్‌రెడ్డి బీజేపీలో సాధారణ కార్యకర్తగా 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్నారు. ఆయన 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారి హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో అంబర్‌పేట్ ఎమ్మెల్యేగా ఎన్నికై వరుసగా రెండోసారి శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. ఆపై 2010 మార్చి 6న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణాగ్రామం నుంచి 22 రోజుల పాటు బీజేపీ పోరుయాత్ర ప్రారంభించారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2023 జూలై 4న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. సికింద్రాబాద్ నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చింది. అదే విధంగా మల్కాజ్‌గిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను రంగంలోకి దింపింది. హైదరాబాద్ స్థానానికి మాధవీలత, చేవెళ్ల స్థానానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్లను ఖరారు చేసింది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా వీటిలో నాలుగు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. ఇక మేడ్చల్–మల్కాజ్‌గిరి స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సహా పార్టీ కార్యదర్శి మురళీధర్‌రావు, సీనియర్ నేత ఎం.కొమురయ్య, కొంపెల్లి మోహన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, హన్మకొండ మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి పోటీ పడ్డారు. ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న కూన.. తాజా జాబితాతో పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి అనూహ్యంగా మాధవీలని పోటీలోకి దింపడం విశేషం. ఇదిలా ఉండగా.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు పొరుగున ఉన్న భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు అవకాశం కల్పించింది. నాగర్‌కర్నూల్ స్థానానికి మాజీ ఎంపీ తనయుడు పోతుగంటి భరత్‌ప్రసాద్ పేరు ఖరారు చేసి.. మహబూబ్‌నగర్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పోటీ పడుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment