అన్‘ఎక్స్’పెక్టెడ్‌గా!
‘ఎక్స్’లో యాక్టివ్‌గా ఉంటున్న కొత్వాల్ సీవీ ఆనంద్
ఆయన పోస్టులకు నెటిజనుల నుంచి స్పందన
వారి నుంచి కీలక సూచనలు, సలహాలు
ఆపరేషన్ రోప్ మళ్లీ మొదలవుతుందన్న కమిషనర్
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఎక్స్ ఖాతాకు 23 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. విధి నిర్వహణతో పాటు సిటీకి సంబంధించిన అనేక కీలకాంశాలను ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో పొందుపరుస్తూ ఉంటారు. కేవలం పోస్టు చేసి సరిపెట్టుకోకుండా... దానిపై వస్తున్న స్పందనలనూ నిశితంగా గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్స్ ఖాతాకు నెటిజనుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఎవరూ ఊహించని విధంగా పలువురు కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వీటిలో కొన్ని ట్రాఫిక్, మరికొన్ని పోలీసింగ్‌కు సంబంధించినవి ఉంటున్నాయి.
హై లెవల్ కమిటీ విషయం చెప్తే...
రాజధానిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో (టీజీ సీసీసీ) కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ఉన్నతాధికారులతో హై లెవల్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కొత్వాల్ ఆనంద్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీనిపై శివకుమార్ అనే నెటిజనుడు స్పందిస్తూ... వాటర్ లాగింగ్ ఏరియాల్లో సమస్యల పరిష్కారం కోసం స్థానికుల సహాయం తీసుకోవడంతో పాటు వారినీ భాగస్వాముల్ని చేయాలని సూచించారు. దీనికి ఆనంద్ ‘గ్రేట్ ఐడియా’ అంటూ కితాబివ్వడం చూస్తే... త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
టర్న్‌లు లేకున్నా బోర్డులు ఉన్నాయంటూ...
నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడానికి అధికారులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. వీటిలో భాగంగా పలు ప్రాంతాల్లో యూ టర్న్‌లు మూసేశారు. అయితే ఆయా చోట్లకు కాస్తా ముందు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు మాత్రం అలానే ఉన్నాయి. వీటిని చూస్తున్న వాహనచోదకులు ఇంకా యూ టర్న్ ఉందని భావించి రోడ్డులో కుడి వైపునకు వస్తున్నారు. చివరకు అక్కడ టర్న్ లేదని గుర్తించి మళ్లీ ఎడమ వైపునకో, రోడ్డు మధ్యకో వెళ్తున్నారు. ఈ ‘రాకపోకలు’ వారికి అసౌకర్యం కావడంతో పాటు ఇతరులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ అంశాన్ని గుర్తించిన శశిధర్ అనే నెటిజన్ ‘ఎక్స్’ ద్వారా ఆనంద్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ‘వెరీ గుడ్ అబ్జర్వేషన్–షల్ సీ’ అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా త్వరలో అవసరం లేని చోట్ల సూచిక బోర్డులు తొలగిస్తామంటూ పరోక్షంగా హామీ ఇచ్చారు.
మరోసారి ‘రోప్’ మొదలెడతామన్న సీపీ...
కొత్వాల్ ఆనంద్ మంగళవారం ఉదయం ఓ కీలక పోస్టు చేశారు. గతంలో ఆయన పోలీసు కమిషనర్‌గా పని చేసినప్పుడు 2022లో ఆపరేషన్ రోప్‌ను చేపట్టారు. రోడ్లపై ట్రాఫిక్ సజావుగా సాగాలంటే ఫుట్‌పాత్‌కు–ప్రధాన రహదారికి మధ్య ఉండే క్యారేజ్ వే క్లియర్‌గా ఉండాలి. అయితే ప్రధాన రహదారులతో సహా అనేక చోట్ల అక్రమ పార్కింగ్, ఆక్రమణలతో ఈ వే కనిపించట్లేదు. ఈ పరిస్థితి మార్చడం కోసం ఆపరేషన్ రోప్ (రివూవల్ ఆఫ్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్‌క్రోచ్‌మెంట్స్) చేపట్టారు. ఆ ఏడాది అక్టోబర్ 3 నుంచి మొదలైన ఈ ఆపరేషన్ ఆయన బదిలీ తర్వాత అటకెక్కింది. దీంతో రెండోసారి సీపీగా వచ్చిన ఆయన మళ్లీ ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment