టర్కీ, కెన్యా, అజర్ బైజాన్ దేశాల ఎంపిక
బ్యాంకాక్, సింగపూర్, మలేషియా, దుబాయ్‌లకూ డిమాండ్
భారీగా పెరిగిన విమాన చార్జీలు
సాక్షి, సిటీబ్యూరో: నయా సాల్ జోష్ వచ్చేసింది. కొత్త సంవత్సర వేడుకల కోసం నగర వాసులు సరికొత్త పర్యాటక ప్రాంతాలపై ఆసక్తి చూపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యటనల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వీరి అభిరుచికి అనుగుణంగా పలు ట్రావెల్స్ సంస్థలు సైతంటూరిస్ట్ డెస్టినేషన్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ప్రతీ ఏటా ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలతో పాటు ఈసారి టర్కీ, కెన్యా, అజర్ బైజాన్, మాల్దీవులు వంటి విదేశాలకు, గోవాతో పాటు కొచ్చిన్, కశ్మీర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆన్‌లైన్ అరైవల్ వీసా ఉన్న దేశాలకు కూడా పర్యాటకులు వెళ్తున్నారు. దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు సైతంసిటీ టూరిస్టుల జాబితాలో చేరాయి.
ఇప్పటినుంచే బుకింగ్‌లు షురూ..
హైదరాబాద్ నుంచి ఏటా డిసెంబర్ చివరి వారంలో ఏదో ఒక నచ్చిన ప్రదేశానికి వెళ్లి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికే సిటీజనులు.. ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ వేడుకలకు ‘చలో టూర్’ అంటున్నారు. డిసెంబర్ చివరి వారంలో రానున్న వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే టూర్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఈసారి గోవాతో పాటు కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లను సైతం ఎంపిక చేసుకుంటున్నారు. మరోవైపు విదేశీ టూర్‌లలో బ్యాంకాక్, మలేసియా, మాల్దీవులు, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలకు యథావిధిగా డిమాండ్ ఉంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సుమారు లక్ష మందికి పైగా ప్రయాణికులు బయలుదేరి వెళ్లనున్నట్లు అంచనా. దీంతో చార్జీలు బాగా పెరగనున్నాయి.
చార్జీలు తడిసి మోపెడు..
సాధారణంగా హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.60 వేలు దాటినట్లు ట్రావెల్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వారం, పది రోజులు నుంచే బ్యాంకాక్‌కు బుకింగ్‌లు బాగా పెరిగినట్లు బంజారాహిల్స్‌కు చెందిన ఒక సంస్థ ప్రతినిధి తెలిపారు.
‘కౌలాలంపూర్ పెట్రోనాట్స్ దగ్గర ఏటా నూతన సంవత్సర వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. రంగు రంగుల బాణసంచా కాల్చుతారు. దీంతో ఆకాశమంతా హరివిల్లులు విరబూస్తాయి. ఆ వేడుకలను చూసేందుకు ఇంటిల్లిపాది వెళ్తున్నాం’ అని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన రాఘవ చెప్పారు. ప్రస్తుతం మలేసియాకు రూ.12,000 నుంచి ఏకంగా రూ.25,000 వరకు చార్జీలు పెరిగాయి. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు కూడా పెద్ద సంఖ్యలోనే వెళ్తున్నారు. దుబాయ్‌కు సాధారణంగా రూ.16,000 వరకు ఉంటుంది. ఇప్పుడు రూ.36,000 వరకు పెరిగిందని ట్రావెల్స్ సంస్థలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment