ఎల్‌బీనగర్ జంక్షన్‌లో కళాకృతులు
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు, సెంట్రల్ మీడియన్లు, జంక్షన్లు తదితర ప్రాంతాలను వివిధ కళాకృతులు, థీమ్ పెయింటింగులతో సుందరీకరిస్తూ అభివృద్ధి చేస్తున్న జీహెచ్‌ఎంసీ.. ఎల్‌బీనగర్ జంక్షన్‌ను విభిన్నంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. గ్రేటర్‌లో అత్యధిక రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఎల్‌బీనగర్ జంక్షన్‌ను పాదచారులకు సదుపాయంగా మార్చడంతో పాటు చూడగానే ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకునేందుకు వివిధ పనులను చేపట్టనుంది. జంక్షన్‌లోని ఫ్లై ఓవర్లకు చెందిన ఎనిమిది స్తంభాల చుట్టూ ప్రత్యేక శిల్పాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక థీమ్‌తో బ్యూటిఫికేషన్ తదితర పనులు చేయనుంది. ఎండా వానలకు దెబ్బ తినకుండా ఉండేందుకు వెదర్‌ప్రూఫ్ మెటీరియల్ వినియోగించనుంది. ఏపీ వైపు ప్రయాణాలు సాగించేవారు, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు ఎక్కువ మంది ఈ మార్గం నుంచే వెళ్తుండటం తెలిసిందే. అధిక రద్దీ ఉండే ఈ జంక్షన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు రూ. 1.50 కోట్ల అంచనా వ్యయంతో పనులకు సిద్ధౖమై, టెండర్లు పిలిచింది. త్వరలోనే టెండరు ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించనున్నారు.
రూ. 150 కోట్లతో 225 ప్రాంతాల్లో..
వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే సందర్శకులకు కనువిందు చేసేలా సిటీ ఇమేజ్‌ను పెంచేందుకు దాదాపు 225 ప్రాంతాల్లో పనులు చేసేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ ఇందుకోసం రూ.150 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. వాటిలో ఇప్పటికే రూ.5 కోట్లకు పైగా వ్యయంతో 15 పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రారంభం కావాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రూ. 1.50 కోట్లతో సుందరీకరణ
టెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసీ
త్వరలో పనులు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment