జగద్గిరిగుట్ట: కోనేరులో ఈతకు వెళ్లి గుర్తు తెలియని బాలుడు మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహాదేవపురం గుట్టపై ఉన్న శివాలయం కోనేరులో ఓ బాలుడు పడినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్‌ఎఫ్ బృందంతో కలిసి గాలింపు చేపట్టారు. బుధవారం కోనేరులో నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు.
మిగతా ఇద్దరు ఎవరు?ఎక్కడ?
పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా సదరు బాలుడితో పాటు మరో ఇద్దరు బాలలు కోనేరు వరకు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం ముగ్గురూ ఈత కొట్టేందుకు కొలనులోకి దిగారని, ఈ తర్వాత ఓబాలుడు మునిగిపోతుండగా మిగతా ఇద్దరూ కేకలు వేశారని, స్థానికులు అక్కడికి చేరుకునేలోగా వారు ఇద్దరూ అక్కడినుంచి పారిపోయినట్లు ఆలయంలో పనిచేసే సబిత అనే మహిళ తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment