ఆ సర్జన్ ఎవరు?
కిడ్నీ దాతలది తమిళనాడు.. స్వీకర్తలది కర్ణాటక
సాక్షి, సిటీబ్యూరో:
కొత్తపేటలోని అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్సల్లో కీలకంగా వ్యవహరించిన నెఫ్రాలజిస్ట్, అనస్థీషియన్ ఎవరు? అనే కోణంలో వైద్యారోగ్యశాఖ విచారణ ప్రారంభించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఉస్మానియా ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ఏర్పడిన త్రిసభ్య కమిటీ బుధవారం అలకనంద ఆస్పత్రిని పరిశీలించింది. అనంతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడుకు చెందిన కిడ్నీ దాతలు నసీ్త్రన్‌బేగం (35), ఫిర్దోస్‌బేగం (40) సహా కర్ణాటకకు చెందిన స్వీకర్తలు న్యాయవాది రాజశేఖర్ (68), సివిల్ ఇంజినీర్ భార్య, మాజీ స్టాఫ్‌నర్సు కృపాలత (45) ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చారు? ఎలా వచ్చారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ డాక్టర్‌ను సంప్రదించారు? ఎక్కడ వైద్య పరీక్షలు చేయించారు? సర్జరీ కోసం ఎంత చెల్లించారు? వంటి అంశాలపై ఆరా తీశారు. అయితే.. ఇప్పటికే సరూర్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్న ఆస్పత్రి నిర్వాహకుడు సుమంత్ ఇప్పటికీ నోరు మెదపనట్లు తెలిసింది. ఆయన నోరు తెరిస్తే కానీ అసలు విషయం బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే.. కిడ్నీ రాకెట్‌కు పాల్పడిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు అలకనంద ఆస్పత్రి ఎదుట బుధవారం ఆందోళనకు దిగాయి.
దాతలు, స్వీకర్తల కేస్ షీట్లు మాయం..
● వైద్యులు ఏదైనా సర్జరీ చేసే ముందు రోగి ఊరు, పేరు, ఫోన్ నంబర్‌తో పాటు బీపీ, షుగర్ ఇతర ఆరోగ్య వివరాలు కేస్ షీట్‌లో నమోదు చేస్తారు. ప్రతి ఆరు గంటలకోసారి బీపీ, పల్స్‌రేట్‌ను మానిటరింగ్ చేస్తుంటారు. సర్జరీ చేసే వైద్యుడి పేరుతో పాటు మత్తుమందు ఇచ్చే వైద్యుడు సహా స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బంది వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారు. కానీ.. అలకనంద ఆస్పత్రి యాజమాన్యం ఇవేవీ పట్టించుకోలేదు. ఎవరికీ అనుమానం రాకుండా దాతలు, స్వీకర్తలను ఇక్కడికి తీసుకురావడంతో పాటు సర్జరీ చేసిన వైద్య సిబ్బంది వివరాలను కేషీట్‌లో నమోదు చేయకుండా గోప్యంగా వ్యవహరించింది.
● సర్జరీలో పాల్గొన్న వైద్య సిబ్బంది ఆ సమయంలో తమ ముఖాన్ని రోగులు, వారివెంట వచ్చిన బంధువులు గుర్తించకుండా మాస్క్‌లు ధరించి, జాగ్రత్త పడినట్లు తెలిసింది. తనిఖీలకు వెళ్లిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కేస్ షీట్ కూడా దొరకకుండా జాగ్రత్తపడింది. నిజానికి ఎవరైనా రోగులు సర్జరీ చేయించుకునే ముందు ఆస్పత్రి ఎక్కడ ఉంది? చికిత్స చేసే డాక్టర్ ఎవరు? ఆయనకున్న అనుభవం ఏమిటీ? ఇప్పటి వరకు ఆయన ఎన్ని సర్జరీలు చేశారు? సక్సెస్ రేటు ఎంత? వంటి అంశాలపై ఆరా తీస్తారు. ఆ తర్వాతే సర్జరీకి అంగీకరిస్తారు. కానీ.. ఇక్కడ స్వీకర్తలిద్దరూ ఇవేవీ పట్టించుకోలేదు. వారిద్దరూ ఉన్నత విద్యావంతులే అయినప్పటికీ.. కేవలం మధ్యవర్తులు చెప్పిన మాటలు నమ్మి, చికిత్స కోసం వచ్చినట్లు తెలిసింది.
వేర్వేరు రాష్ట్రాలు.. వేర్వేరు మధ్యవర్తులు..
● తమిళనాడులోని పేద కుటుంబాలకు చెందిన నసీ్త్రన్‌బేగం (35), ఫిర్దోస్‌బేగం (40)లు గత కొంత కాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పైళ్లెన తర్వాత భర్తలు వదిలేయడంతో వీరు ఒంటరయ్యారు. రోజువారీ జీవనం దుర్భరంగా మారింది. వీరి బలహీనతను స్థానికంగా ఉన్న మధ్యవర్తి పూర్ణిమ అవకాశంగా తీసుకుంది. కిడ్నీ అమ్మకం ద్వారా సులభంగా డబ్బు సంపాదించ వచ్చని ఆశ చూపింది. ఆ మేరకు గతంలో తాను కూడా ఒక కిడ్నీ అమ్ముకున్నట్లు నమ్మబలికింది. ఆ మేరకు ఇద్దరు మహిళలను కిడ్నీ అమ్మకానికి ప్రేరేపించింది. అప్పటికే అలకనంద ఆస్పత్రి యజమానితో ఆమెకు పరిచయం ఉండటం, ఇదే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకురావడంతో వారికి వైద్య పరీక్షలు చేయించారు.
● ఇదే సమయంలో కర్ణాటకకు చెందిన న్యాయవాది రాజశేఖర్, స్టాఫ్‌నర్సు కృపాలత కిడ్నీల పని తీరు దెబ్బతిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారికి మధ్యవర్తి పవన్ పరిచయమయ్యాడు. ఆయన ద్వారా వీరు నగరంలోని అలకనంద ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే దాతలు, స్వీకర్తల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇరువురి బ్లడ్ గ్రూప్‌లు మ్యాచ్ అయ్యాయి. సర్జరీకి రూ.55 లక్షల వరకు ఖర్చు అవుతుందని స్పష్టం చేయడం, చెల్లించేందుకు వారు అంగీకరించడంతో గుట్టుగా వారిని నగరానికి తరలించారు. సర్జరీ సమయంలో వైద్యులు తమ ముఖాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరించి జాగ్రత్త పడటం విశేషం. ఇదే బృందం గతంలో విజయవాడ కేంద్రంగానూ పలువురికి కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసినట్లు తెలిసింది. సరూర్‌నగర్ పోలీసులు ఆ మేరకు ఓ బృందాన్ని విజయవాడకు పంపినట్లు సమాచారం.
అలకనంద ఆస్పత్రి ఎదుట ప్రజాసంఘాల ఆందోళన
నిందితులను కఠినంగా శిక్షించాలి: ఐఎంఏ
సుల్తాన్‌బజార్: అమాయకుల కిడ్నీలను మార్పిడీ చేసే ముఠాలను కఠినంగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరు ద్వారకానాథరెడ్డి, కార్యదర్శి వి.అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం కోఠిలోని ఐఎంఏ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘ టనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పూర్ణిమ, పవన్ ఏజెంట్ల ద్వారా నగరానికి రాక
భర్త లేని పేద మహిళలకు డబ్బు ఆశ చూపిన వైనం
స్వీకర్తల్లో ఒకరు న్యాయవాది, మరొకరు సివిల్ ఇంజినీర్ భార్య
గాంధీలో చికిత్స పొందుతున్న దాత, స్వీకర్తలను కలిసిన త్రిసభ్య కమిటీ
కొత్తపేట అలకనంద ఆస్పత్రి ఎదుట ప్రజాసంఘాల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment