ఆంటనానారివో(మడగాస్కర్): బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు.
మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్‌లో కంటే మయోటేలో జీవనం కాస్త మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment