వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెనిజులా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపధ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇచ్చే బహుమతి మొత్తాన్ని 25 మిలియన్ డాలర్లకు(సుమారు 215 కోట్ల రూపాయలు) పెంచినట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది.
మదురోను వెనిజులాకు అధ్యక్షునిగా అమెరికా గుర్తించలేదు. 2024, జూలై జరిగిన ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో(Nicolás Maduro) ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అయితే అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ అందుబాటులోవున్న ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. ఇవి అతను అత్యధిక ఓట్లు గెలుచుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గొంజాలెజ్.. వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అలాగే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.
కాగా తాత్కాలిక రక్షిత హోదాతో యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్న దాదాపు 600,000 మంది వెనిజులా వలసదారులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ వలసదారులు అదనంగా మరో 18 నెలలు ఉండడానికి బైడెన్ హామీనిచ్చారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) మీడియాతో మాట్లాడుతూ మదురో అరెస్టుకు ఆధారాలు సమర్పించినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనిజులా ప్రజలకు సంఘీభావం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ బహుమతిని పెంచడం ద్వారా మదురోతో పాటు అతని ప్రతినిధులపై ఒత్తిడిని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత పెంచామన్నారు.
కాగా వెనిజులా వలసదారులకు తాత్కాలిక రక్షిత హోదా పొడిగింపును వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంగా బైడెన్(Biden) పరిపాలన ప్రతినిధి అభివర్ణించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఎనిమిది మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment