అనారోగ్యం బారినపడి చైనా వాసి మృతి
బీజింగ్: ఏకంగా 104 రోజులపాటు డ్యూటీ చేసిన చైనా వాసి, మధ్యలో ఒక్కటంటే ఒక్క రోజే సెలవు తీసుకున్నాడు. ఆపై, తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆయన కుటుంబానికి పరిహారంగా రూ.48 లక్షలు చెల్లించాలంటూ సంస్థ యజమానిని కోర్టు ఆదేశించింది. జెఝియాంగ్ ప్రావిన్స్‌లోని జౌషాన్ ప్రాంతానికి చెందిన ఎబావో (30) వృత్తిరీత్యా పెయింటర్. గతేడాది ఓ కంపెనీతో ఆయన కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఆ మేరకు ఫిబ్రవరి నుంచి మే వరకు ఎక్కడా విరామం లేకుండా పనిచేశాడు. మధ్యలో ఏప్రిల్ 6వ తేదీన మాత్రమే సెలవు తీసుకున్నాడు.
మే 25వ తేదీ నుంచి ఎబావో ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. మే 28వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ జూన్ ఒకటో తేదీన మృతి చెందాడు. కుటుంబసభ్యులు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. రోజుకు గరిష్టంగా 8 గంటల చొప్పున వారానికి 44 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ పనిచేయించడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. ఇందుకుగాను రూ.47.46 లక్షలు, ఎబావో కుటుంబానికి మానసిక వేదన కలిగించినందుకు అదనంగా మరో రూ.1.17 లక్షలివ్వాలని కంపెనీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment