US Lawmaker Proposes Bill To Declare Diwali As Federal Holiday - Sakshi
Sakshi News home page

అమెరికాలో దీపావళికి సెలవు.. ప్రత్యేక బిల్లు.. అదే జరిగితే 12వదిగా..

Published Sat, May 27 2023 8:10 AM | Last Updated on Sat, May 27 2023 9:40 AM

Diwali As Federal Holiday In US - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో దీపావళిని ఫెడరల్‌ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్టసభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లు (Diwali Day Act )ప్రవేశపెట్టారు. గ్రేస్‌ మెంగ్‌ శుక్రవారం ప్రతినిధుల సభ( House of Representatives)లో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై పలువురు చట్టసభ్యులతో పాటు భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది.  

గ్రేస్‌ మెంగ్‌ వర్చువల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి దీపావళి పండుగ ఎంతో ముఖ్యమైంది. క్వీన్స్‌, న్యూయార్క్‌ లాంటి అమెరికా ప్రధాన నగరాల్లోనూ లెక్కలేనన్ని కుటుంబాలు, కమ్యూనిటీలు దీపావళిని ఘనంగా నిర్వహించుకుంటాయి. అమెరికన్‌ పౌరులు సైతం హుషారుగా పాల్గొనడమూ చూస్తున్నాం.  ఆ వెలుగులు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. కాబట్టి, ఈ పండుగను ఫెడరల్‌ హాలీడేగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ఆమె వివరించారు. 

మరో ఈ ప్రతిపాదనపై సౌత్‌ ఏషియా కమ్యూనిటీతో పాటు పలువురు అక్కడి చట్టసభ్యులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. న్యూయార్క్‌కు చెందిన మరో చట్టసభ్యురాలు జెన్నిఫర్‌.. దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని అంటున్నారు. అమెరికాలో 40 లక్షల మంది దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారామె. న్యూయార్క్‌ సెనెటర్‌ జెర్మీ కూనీ, న్యూయార్క్‌ సిటీ కౌన్సిల్‌మ్యాన్‌ శేఖర్‌ కృష్ణన్‌ సైతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. శేఖర్‌ కృష్ణన్‌ న్యూయార్క్‌ ప్రభుత్వానికి ఎన్నికైన తొలి ఇండియన్‌ అమెరికన్‌. 

ఇక అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లోనూ దీపావళి వేడుకలు జరుగుతుండడం చూస్తున్నదే.   ఈ బిల్లు తొలుత పార్లమెంట్‌లో పాస్‌ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఒకవేళ దీపావళి పండుగకు గనుక సెలవు దినంగా ఆమోద ముద్ర పడితే.. అమెరికా సంయుక్త రాష్ట్రంలో ఫెడరల్‌ హాలీడేస్‌ జాబితాలో 12వదిగా నిలుస్తుంది. 

అమెరికాలో పబ్లిక్‌ హాలీడేస్‌(నేషనల్‌ హాలీడేస్‌)తో పాటు ఫెడరల్‌ హాలీడేస్‌(ప్రత్యేక సెలవులు) ఉంటాయి. ఈ లిస్ట్‌లో న్యూఇయర్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జయంతోత్సవాలు, వాషింగ్టన్‌ బర్త్‌డే, మెమొరియల్‌ డే, జూన్‌టీన్త్‌ నేషనల్‌ ఇండిపెండెన్స్‌ డే, ఇండిపెండెన్స్‌ డే, లేబర్‌ డే, కొలంబస్‌ డే, వెటరన్స్‌ డే, థాంక్స్‌గివింగ్‌ డే, క్రిస్మస్‌ డేలు ఉన్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement