న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఓవైపు హోరాహోరీగా దూసుకువెళ్తోంది. మరోవైపు.. సెప్టెంబర్ 10న జరిగే డిబేట్‌కు ఇరు పార్టీల అభ్యర్థులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే.. ఎన్నికల సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని జైలుకు పంపుతానని హెచ్చరించారు.
‘నేను గెలిస్తే మోసం, అధ్యక్ష ఎన్నికల సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవాళ్లు చట్టపరంగా పూర్తిస్థాయిలో విచారణ ఎదుర్కొంటారు. అంతే కాకుండా దోషులుగా తెలితే.. దీర్ఘకాల జైలు శిక్షలు కూడా అమలు చేస్తాం. ఈ విషయంలో మాత్రం న్యాయ ప్రక్రియలో ఎటువంటి దుర్వినియోగం జరగనివ్వను. కచ్చితంగా కఠినమైన శిక్షలను అమలు చేస్తాం.
దయచేసి జాగ్రత్త వహించండి.. ఈ చట్టపరమైన చర్యలు అందరికీ వర్తిస్తాయి. న్యాయవాదులు, రాజకీయ నాయకులు, దాతలు, అక్రమ ఓటర్లు, అవినీతి ఎన్నికల అధికారులకు వర్తిస్తుంది. ఇంతకుముందు చూడని విధంగా అక్రమాలకు పాల్పడినవాళ్లను వెతికిమరీ విచారించి, శిక్షలు విధిస్తాం’’ అని ట్రంప్ అన్నారు. ఎన్నికల వేళ ట్రంప్ చేసిన హెచ్చరికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
CEASE & DESIST: I, together with many Attorneys and Legal Scholars, am watching the Sanctity of the 2024 Presidential Election very closely because I know, better than most, the rampant Cheating and Skullduggery that has taken place by the Democrats in the 2020 Presidential…
— Donald J. Trump (@realDonaldTrump) September 8, 2024
ట్రంప్ హెచ్చరిక వ్యాఖ్యల ప్రకారం ఆయన రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే కచ్చితమైన అధ్యక్ష కార్యాలయాన్ని ప్రతీకారం తీర్చుకోవటం కోసమే వినియోగించుకుంటారేమో అని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు అక్రమ, మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభించకపోవటం గమనార్హం. గత ఎన్నికల్లో ట్రంప్ ఆయన అమలు చేసిన పరిపాన విధానాల వల్లే ఓడిపోయారని కోర్టులు, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment