తమ వద్ద బందీగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు విడుదల చేశారు. తమ అధీనంలో ఉన్న బందీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను విడుదల చేశామని హమాస్ సైనిక విభాగం అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం ప్రకటించారు. మానవతా దృక్పథంతో అమెరికాలోని చికాగో ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు జుడిత్ తై రానన్(59), నటాలీ శోషనా రానన్‌ను(17) వదిలేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారిని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేశారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు
రెండు వారాల తర్వాత విడుదల
హమాస్ మిలిటెంట్ల స్థావరం నుంచి వీరిద్దరూ శుక్రవారం రాత్రికి ఇజ్రాయెల్‌కు చేరుకున్నట్లు ఒట్టావా ప్రభుత్వం తెలిపింది. కాగా అక్టోబర్ 7న ఇజ్రాయెల్-గాజా సరిహద్దు సమీపంలోనినహాల్ ఓజ్ కిబ్బట్స్‌నుంచి తల్లి కూతుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ ఇజ్రాయెల్‌లో హాలీడ్ నిమిత్తం ఉన్నట్లు తెలిసింది. దాదాపు రెండు వారాలపాటు మహాస్ చెరలో ఉన్న ఇద్దరు అమెరికన్లు విడుదలైన అనంతరం గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ రాయబారి కలుసుకున్నారు. సెంట్రల్ ఇజ్రాయ్‌లోని సైనిక స్థావరానికి తీసుకెళ్లి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.
చాలా సంతోషం: బైడెన్
ఇద్దరు అమెరికన్ల విడుదలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ ఈ వార్త తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. విడుదలైన తర్వాత ఇద్దరు మహిళలతో బిడెన్ ఫోన్‌లో మాట్లాడారు. తల్లీకూతుళ్లు సురక్షితంగా విడుదలపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నటాలీ రానన్ చాలా బాగుందని, చాలా సంతోషంగా కనిపిస్తుందని ఇల్లినాయిస్‌లోని ఆమె తండ్రి యురి రానన్ పేర్కొన్నారు. కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. హమాస్ వద్ద బందీలుగా ఇంకా అనేకమంది ఉన్నారని, వారి విడుదల కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు.
చదవండి: భారత్‌లో దౌత్యవేత్తల తొలగింపు.. కెనడాకు మద్దతుగా అమెరికా, బ్రిటన్
ఇదిలా ఉండగా హమాస్ మరింతమంది బందీలను విడిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాళ్ల పౌరులను వదిలిపెట్టేందుకు ఖతార్, ఈజిస్ట్‌తో కలిసి పనిచేస్తున్నట్లు హమాస్ పేర్కొంది. అయితే హమాస్ అధీనంలో దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలు ఉన్నారు.
కాగా హమాస్ మిలిటెంట్లు ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. 20 నిమిషాల్లోనే అయిదు వేల రాకేట్లతో విరుచుపడింది. వెంటనే ఇజ్రాయెల్ కూడా హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. గత 15 రోజులుగా ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు తీవ్రంగా సాగుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 4,137 మంది మృతిచెందగా.. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా బలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment