వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ వద్ద సంబరాలు
వాషింగ్టన్/లండన్: అయోధ్యలో రామాలయ మందిర నిర్మాణానికి చేసిన భూమి పూజను పురస్కరించుకొని అమెరికా, బ్రిటన్‌లలోని భారతీయ హిందువులు సంబరాలు చేసుకున్నారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్ ప్రాంతంలో రాముడి చిత్రాలు కలిగిన డిజిటల్ స్క్రీన్ ట్రక్కు తిరుగుతూ జైశ్రీరామ్ అనే నినాదాలను వినిపించింది. వాషింగ్టన్ లోనూ విశ్వహిందూ పరిషద్ సభ్యులు రాముడి చిత్రాలు, నినాదాలతో కూడిన ఓ ట్రక్కును నడిపారు. భారతీయ హిందువులు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి తమ ఆనందాన్ని తెలిపారు.
కాలిఫోర్నియాకు చెందిన హిందూ నాయకుడు అజయ్ జైన్ మాట్లాడుతూ రామున్ని ఆరాధించే హిందువులు, జైనులకు ఇది ఓ మరపురాని రోజు అని చెప్పారు. ప్రముఖ టైమ్ స్క్వేర్ వద్ద రాముడి చిత్రాలను, రామాలయ నమూనా త్రీడీ చిత్రాలను ప్రదర్శించారు. మరోవైపు యూకేలో భారతీయ హిందువులు ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనల ద్వారా అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్‌గా పూజలు జరిపి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. యూకేలో ఉన్న 150 దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపినట్లు వెల్లడించారు. భూమి పూజ జరిగిన కార్యక్రమం హిందువుల మనసుల్లో చిరకాలం నిలిచిపోతుందని యూకే హిందూ కౌన్సిల్ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment